logo

నేడు నందిమేడారంలో హైకోర్టు సీజే పర్యటన

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ ఆదివారం ధర్మారం మండలం నందిమేడారంలో పర్యటించనున్నారు.

Published : 05 Feb 2023 05:03 IST

జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు ప్రారంభం.. ఏర్పాట్లు పర్యవేక్షించిన జస్టిస్‌ నవీన్‌రావు

కోర్టు హాలును పరిశీలిస్తున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ నవీన్‌రావు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి నాగరాజు

ధర్మారం, న్యూస్‌టుడే: హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ ఆదివారం ధర్మారం మండలం నందిమేడారంలో పర్యటించనున్నారు. గ్రామానికి ఇటీవల మంజూరు చేసిన జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టును హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ పొనుగోటి నవీన్‌రావు, జస్టిస్‌ ఎన్‌.వి.శ్రవణ్‌కుమార్‌లతో కలిసి ఆయన ప్రారంభించనున్నారు. ఈ మేరకు కోర్టు ఏర్పాటు పనులను శనివారం సాయంత్రం జస్టిస్‌ పొనుగోటి నవీన్‌రావు పరిశీలించారు. కోర్టు హాలు, వివిధ విభాగాల గదులను జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.నాగరాజుతో కలిసి పరిశీలించారు. కోర్టు భవనం, సభావేదిక, ఇతర ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. సీనియర్‌ సివిల్‌ జడ్జి అర్జున్‌, హైకోర్టు న్యాయవాది మధుసూదన్‌రావు, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సురేష్‌బాబు, న్యాయవాదులు లింగారెడ్డి, లక్ష్మినర్సయ్య, ప్రకాష్‌ తదితరులు వెంట ఉన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి 15 మందికి పైగా హైకోర్టు న్యాయమూర్తులు హాజరు కానున్నారు.

చారిత్రక ప్రదేశాల సందర్శన

ఉదయం నందిమేడారానికి చేరుకోనున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తులు మొదట కోర్టును ప్రారంభిస్తారు. అక్కడే ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగిస్తారు. అనంతరం నందిమేడారంలో భూగర్భంలో ఏర్పాటు చేసిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నంది పంపుహౌస్‌, గ్యాస్‌ ఇన్సులేటెడ్‌ సబ్‌స్టేషన్‌, డెలివరీ సిస్టర్న్‌, నంది రిజర్వాయరును సందర్శించనున్నారు. కాకతీయుల కాలంలో నిర్మించిన శ్రీఅమరేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. చారిత్రక నంది విగ్రహం, త్రికూటాలయానికి వెళ్లనున్నారు. అక్కడికి సమీపంలోనే ఉన్న కోట బురుజుపైకి వెళ్లనున్నారు. పల్లె ప్రకృతివనంలో మొక్కలు నాటేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని