logo

నిధులు వ్యయం.. పథకాలు అస్తవ్యస్తం

మత్య్సకారుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పథకాలు అమలు చేస్తున్నాయి. వారికి ఉపాధి కల్పనే లక్ష్యంగా నిధులు వెచ్చిస్తున్నాయి.

Published : 05 Feb 2023 05:03 IST

మత్స్య సహకార సంఘాల్లో పెరిగిన రాజకీయ జోక్యం
పాలకవర్గాల ఏర్పాటుపై నేతల వద్దకు పంచాయితీలు

ఈనాడు డిజిటల్‌, పెద్దపల్లి: మత్య్సకారుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పథకాలు అమలు చేస్తున్నాయి. వారికి ఉపాధి కల్పనే లక్ష్యంగా నిధులు వెచ్చిస్తున్నాయి. ఏటా చెరువుల్లో ఉచితంగా చేప పిల్లలు వదలడంతో పాటు యంత్రాలు అందజేయడం, సహకార సంఘాల ఆధ్వర్యంలో ఉపాధి కల్పించడం తదితర వసతులు కల్పిస్తోంది. సమున్నత ఆశయంతో అమలు చేస్తున్న పథకాలు పలు చోట్ల పక్కదారి పడుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపంతో అక్రమాలు జరుగుతున్నాయి.
జిల్లాలో చేప పిల్లల సరఫరాలో జాప్యానికి తోడు పంపిణీ ప్రక్రియ అస్తవ్యస్తంగా మారింది. ఏటా జూన్‌, జులై నెలల్లోనే 100 శాతం పంపిణీ పూర్తి కావాల్సి ఉండగా గతేడాది డిసెంబరు వరకు కొనసాగింది. దీనికి తోడు పంపిణీ ప్రక్రియ నిర్లక్ష్యంగా జరిగింది. జిల్లావ్యాప్తంగా మత్స్య సహకార సంఘాల్లోనూ రాజకీయ నాయకుల జోక్యం పెరిగింది. పార్టీల వారీగా సొసైటీలు ఏర్పడుతుండటంతో చేపల క్రయ విక్రయాల విషయంలో విభేదాలు చోటుచేసుకుంటున్నాయి. ఆధిపత్య ధోరణితో తరచూ నియోజకవర్గ ప్రజాప్రతినిధుల వద్దకు పంచాయతీలు వెళ్తున్నాయి.

రోడ్లపైనే విక్రయాలు

* స్థానికంగా చేపల ఉత్పత్తితో పాటు ఇక్కడే విక్రయించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పిల్లల పంపిణీ చేపట్టింది. మార్కెటింగ్‌ కోసం ప్రభుత్వం కేటాయించిన వాహనాలు, ఇతర స్టాళ్లను లబ్ధిదారులు ఎప్పుడో ఇతరులకు విక్రయించారు.

* రామగుండం, పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్‌ పట్టణ ప్రాంతాల్లో రహదారులపైనే చేపలు విక్రయిస్తున్నారు. ధర్మారంలో సమీకృత చేపల మార్కెట్‌ ఏర్పాటు చేస్తామని గతంలో చేసిన ప్రతిపాదనలు అమలుకు నోచుకోలేదు.

* ఇప్పటివరకు చెరువుల్లో వేసిన చేపపిల్లలు మార్చి, ఏప్రిల్‌ నెలాఖరు వరకు పెరిగి విక్రయానికి సిద్ధమవుతాయి. రోహు, బొచ్చ, బంగారుతీగ జాతికి చెందిన చేపలను గతేడాది స్థానికంగా మార్కెటింగ్‌ చేసే సౌకర్యాలు లేక పశ్చిమబెంగాల్‌, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలకు ఎగుమతి చేయాల్సి వచ్చింది.

అనుయాయులకే అందలం

* జిల్లావ్యాప్తంగా 1000 చెరువులుండగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1.49 కోట్ల చేప పిల్లల పంపిణీ జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. మొత్తం 143 మత్య్స సహకార సంఘాలుండగా దాదాపు 8 వేల మంది సభ్యులున్నారు.

* చెరువు శిఖాన్ని బట్టి సొసైటీలు ఏర్పాటు చేసుకునే అవకాశాలున్నాయి. జిల్లాలో 266 పంచాయతీలుండగా 143 మత్య్స సహకార సంఘాలు ఏర్పడ్డాయి.

* నిబంధనల ప్రకారం నిర్ణీత కాలానికి ప్రతి సంఘానికి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఓటర్ల జాబితా రూపొందించడం, అనర్హులైన సభ్యులను తొలగించడం వంటివి చేపట్టాల్సి ఉంటుంది.

* ఇవేవీ లేకుండానే ఎమ్మెల్యేల కనుసన్నుల్లోనే సంఘాలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇతరులకు అవకాశం ఇవ్వకుండా పార్టీల కార్యకర్తలూ, బంధుమిత్రులకు ఇస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

* గతంలో సుల్తానాబాద్‌లో, ఇటీవల ఓదెల మండలంలో మత్స్య సహకార సంఘం సభ్యులు శాసనసభ్యుడి వద్దకు వచ్చి అక్రమాలపై ఫిర్యాదు చేశారు. కొత్తగా ఎన్నికలు నిర్వహించాలని కోరారు. మరో పార్టీకి చెందిన సొసైటీ సభ్యులు సైతం ఆ పార్టీ నాయకుడిని కలిసి గోడు వెళ్లబోసుకున్నారు.


ఆన్‌లైన్‌లోనే అన్ని వివరాలు
-భాస్కర్‌, జిల్లా మత్య్సశాఖ అధికారి

త్వరలో మత్య్స సహకార సంఘాలతో పాటు జిల్లాలో మా శాఖ ఆధ్వర్యంలోని అన్ని కార్యకలాపాలను డిజిలీకరణ చేస్తాô. సొసైటీల ఆధ్వర్యంలో చేపల ఉత్పత్తి, విక్రయాలు తదితర అన్ని అంశాలనూ ఆన్‌లైన్‌లో పొందుపరుస్తాం. సొసైటీల్లో అక్రమాలపై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. ఎన్నికల్లో రాజకీయ జోక్యాలున్నట్లు నిర్ధారణ అయితే రద్దు చేస్తాం. ధర్మారంలో రూ.50 లక్షలతో చేపల మార్కెట్‌ ఏర్పాటుకు నిధులున్నా, స్థలం అందుబాటులో లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని