logo

బస్సు ఢీకొని ఆటో డ్రైవర్‌ దుర్మరణం

అదుపు తప్పి బోల్తా పడిన ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఆటో డ్రైవర్‌ మృతి చెందగా అందులో ప్రయాణిస్తున్న యువతికి తీవ్ర గాయాలయ్యాయి. వెల్గటూరులో శనివారం సాయంత్రం జరిగిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

Published : 05 Feb 2023 05:03 IST

చంద్రమౌళి

వెల్గటూరు, న్యూస్‌టుడే : అదుపు తప్పి బోల్తా పడిన ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఆటో డ్రైవర్‌ మృతి చెందగా అందులో ప్రయాణిస్తున్న యువతికి తీవ్ర గాయాలయ్యాయి. వెల్గటూరులో శనివారం సాయంత్రం జరిగిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కుమ్మరిపల్లి వైపు నుంచి వెల్గటూరుకు వస్తున్న ఆటో రైస్‌మిల్లు సమీపంలోని టీ ఫైబర్‌ గ్రిడ్‌ కేబుల్‌ కోసం తవ్విన గుంతను తప్పించబోయి అదుపు తప్పి రహదారి కుడివైపు వరకు వచ్చి బోల్తా పడింది. సరిగ్గా అదే సమయంలో ఎదురుగా వెల్గటూరు నుంచి జగిత్యాల వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ప్రమాదవశాత్తు ఈ ఆటోను ఢీకొంది. దీంతో ఆటో ముందు భాగం బస్సు కింద పడి నుజ్జునుజ్జయింది. ఈ ఘటనలో జగదేవుపేటకు చెందిన ఆటో డ్రైవర్‌ క్యాతం చంద్రమౌళి (38)కి, ఇందులో ప్రయాణిస్తున్న చెన్న అర్చనకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలిస్తుండగా చంద్రమౌళి మార్గమధ్యంలో మృతి చెందాడు. అతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. జీవనోపాధి కోసం కొన్నేళ్లు ఇరాక్‌ వెళ్లి వచ్చిన చంద్రమౌళి రెండేళ్లుగా ఆటో నడుపుతూ జీవనోపాధి పొందుతున్నాడు. ప్రమాదంలో కుటుంబ పెద్దను కోల్పోవడంతో కుటుంబం పరిస్థితి దయనీయంగా మారింది.

ప్రాణ సంకటంగా ప్రమాదకర గుంతలు

రహదారి పక్కన ప్రమాద హెచ్చరికలు లేకుండా కేబుల్‌ కోసం తవ్విన గుంతలను అలాగే వదిలేయడం ప్రమాదాలకు కారణమవుతోంది. కుమ్మరిపల్లి వైపు నుంచి వచ్చేటప్పుడు ఎడమ వైపు సగభాగం మేరకు గుంతకు సంబంధించిన మట్టి, రాళ్లు ఉన్నాయి. కుమ్మరిపల్లి నుంచి వెల్గటూరు వరకు అయిదారు చోట్ల రహదారి పక్కన ఇలా ప్రమాదకరంగా ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం జగదేవుపేటకు చెందిన లక్ష్మణ్‌ అనే వ్యక్తికి చెందిన ఆటో కూడా బోల్తా పడింది. పోలీసులు సాయంత్రం వేళలో ఇదే ప్రదేశంలో వాహన తనిఖీలు చేస్తుంటారు. వాహన చోదకుల వద్ద పత్రాలు లేకుంటే జరిమానాలు విధించే పోలీసు శాఖ ఈ గుంతలను కూడా పట్టించుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని