logo

ప్రతిభ ఉన్నా.. ప్రోత్సహించేవారు లేరు!

ప్రస్తుతం చదువుతో పాటు క్రీడలకు చాలా ప్రాముఖ్యం ఇస్తున్నారు. పాఠశాల, కళాశాలల్లో విద్యార్థులు క్రీడల్లో రాణించడానికి ప్రభుత్వం వ్యాయామ ఉపాధ్యాయులు, అధ్యాపకులను నియమిస్తుంది.

Published : 05 Feb 2023 05:03 IST

జూనియర్‌ కళాశాలల్లో భర్తీ కాని పీడీ పోస్టులు  
న్యూస్‌టుడే, ఇబ్రహీంపట్నం

ప్రభుత్వ జూనియర్‌ కళాశాల

ప్రస్తుతం చదువుతో పాటు క్రీడలకు చాలా ప్రాముఖ్యం ఇస్తున్నారు. పాఠశాల, కళాశాలల్లో విద్యార్థులు క్రీడల్లో రాణించడానికి ప్రభుత్వం వ్యాయామ ఉపాధ్యాయులు, అధ్యాపకులను నియమిస్తుంది. కాగా ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో వ్యాయామ అధ్యాపకులు లేకపోవడంతో విద్యార్థులు క్రీడలకు దూరంగా ఉంటున్నారు. చాలా మంది విద్యార్థులు పాఠశాల స్థాయిలో జిల్లా, రాష్ట్ర స్థాయిలో రాణించినా కళాశాలలో తగిన ప్రోత్సాహం లేకపోవడంతో ఇక్కడే ఆగి పోతున్నారు.

మంజూరైనా భర్తీ కావడం లేదు..

జిల్లాలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు 15 ఉన్నాయి. ఇందులో కేవలం 10 కళాశాలల్లోనే వ్యాయామ అధ్యాపకుడి పోస్టులు మంజూరు ఉండగా మిగిలిన 5 కళాశాలలకు పీడీ పోస్టులు లేవు. పీడీ పోస్టులు మంజూరు ఉన్న కళాశాలల్లో జిల్లాలో ఒక్కటి కూడా భర్తీ చేయలేదు. జగిత్యాల బాలికల జూనియర్‌ కళాశాల, కోరుట్ల బాలుర జూనియర్‌ కళాశాల, ఇబ్రహీంపట్నం, కథలాపూర్‌, మల్యాల, రాయికల్‌, సారంగపూర్‌, బీర్పూర్‌, మల్లాపూర్‌, గొల్లపల్లి జూనియర్‌ కళాశాలలకు పీడీ పోస్టులు ఉన్నప్పటికి భర్తీ కావడం లేదు. కోరుట్ల బాలికల జూనియర్‌ కళాశాల, జగిత్యాల జూనియర్‌ కళాశాల, మెట్‌పల్లి, ధర్మపురి, కొడిమ్యాల కళాశాలలకు పీడీ పోస్టులు మంజూరు లేవు. కళాశాలల్లో విద్యార్థులకు చదువుతో పాటు వ్యాయామ విద్య అవసరం. చదువుతో ఒత్తిడికి గురయ్యే వారు క్రీడల ద్వారా మానసిక ఉల్లాసంతో పాటు శారీరకంగా ఎంతో దృఢంగా తయారవుతారు. పాఠశాల స్థాయిలోనే క్రీడలపై పట్టు సాధించి జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచిన వారు ఉన్నారు. వారికి కళాశాలల్లో ప్రోత్సహించే వారు లేకపోవడంతో క్రీడా జీవితం ముందుకు సాగడం లేదు. ఆసక్తి ఉన్న విద్యార్థులకు నిత్యం క్రీడలను సాధన చేయిస్తే వారు మరింతగా రాణించే అవకాశం ఉంది.  


విద్యార్థి పేరు శరణ్య. ఇబ్రహీంపట్నం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో సీఈసీ ద్వితీయ సంవత్సరం చదువుతుంది. పాఠశాలలో చదివే సమయంలో పరుగు పోటీల్లో రాష్ట్ర స్థాయి వరకు వెళ్లింది. పదో తరగతి పూర్తయిన తర్వాత జూనియర్‌ కళాశాలలో చేరగా వ్యాయామ అధ్యాపకుడు లేకపోవడంతో ఆటలకు దూరంగా ఉంటుంది. ఈ పరిస్థితి శరణ్య ఒక్కరిదే కాదు. చాలామంది విద్యార్థులు పాఠశాల స్థాయిలో వారికి నచ్చిన క్రీడల్లో రాణించగా కళాశాలకు వచ్చే సరికి ప్రోత్సాహం లేక రాణించలేకపోతున్నారు.

పీడీని నియమించాలి:  గణేష్‌, విద్యార్థి, ఇబ్రహీంపట్నం

మా కళాశాలలో వ్యాయామ అధ్యాపకుడి పోస్టు ఖాళీగా ఉంది. పీడీ లేకపోవడంతో మేము క్రీడలకు దూరంగా ఉంటున్నాం. పీడీ ఉంటే ఆటలను ఆడించి, జిల్లా, రాష్ట్ర స్థాయిలో రాణించేలా ప్రోత్సహిస్తారు.

త్వరలో వచ్చే అవకాశం: - నారాయణ, నోడల్‌ అధికారి

జిల్లాలోని కళాశాలల్లో వ్యాయామ అధ్యాపకుల పోస్టుల భర్తీ గురించి ప్రభుత్వానికి నివేదించాం. ప్రస్తుతం ఉద్యోగ నియామకాల ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించగా, త్వరలో పీడీ పోస్టులు భర్తీ అయ్యే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని