logo

పరారు ఖైదీ ఎక్కడ?

పోలీసుల కళ్లు గప్పి పరారైన రిమాండ్‌ ఖైదీ కరీంనగర్‌ పోలీసులకు సవాలుగా మారాడు. ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినా అతని ఆచూకీ కనుక్కోలేకపోయారు.

Published : 05 Feb 2023 05:03 IST

పోలీసులకు సవాలుగా ఘటన

ఈనాడు, కరీంనగర్‌: పోలీసుల కళ్లు గప్పి పరారైన రిమాండ్‌ ఖైదీ కరీంనగర్‌ పోలీసులకు సవాలుగా మారాడు. ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినా అతని ఆచూకీ కనుక్కోలేకపోయారు. కరీంనగర్‌ జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్న లక్ష్మణ్‌ను జగిత్యాల కోర్టులో ఈ నెల 3న హాజరుపరిచి సాయంత్రం కారాగారానికి తీసుకొస్తుండగా ఇద్దరు ఎస్కార్ట్‌ పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయిన సంగతి తెలిసిందే. జనసంచారం అధికంగా ఉన్న చోటు నుంచి చాకచక్యంగా పరుగు తీసిన తీరుపై పోలీసు ఉన్నతాధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. భద్రతా వైఫల్యాల్ని ఎత్తిచూపిన ఈ ఘటనను సవాలుగా స్వీకరించారు.

బేడీలు ఎలా మాయం?

లక్ష్మణ్‌ పరుగెత్తినప్పుడు అతని చేతికి ఉన్న బేడీలు కొద్దిసేపటి తరువాత మాయమయ్యాయి. ఈ విషయాన్ని పోలీసులు ఫుటేజీల ద్వారా గుర్తించారు. ఐదారు గల్లీల నుంచి వేగంగా పరుగెత్తే క్రమంలో చేతికి బేడీలున్నట్లు కనిపించగా..  ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోని ఓ సీసీ కెమెరా దృశ్యాల్లో మాత్రం చేతికి ఎలాంటి బేడీలు లేకపోవడంతో పోలీసులు విస్తుపోయారు. దొంగ వెళ్లిన మార్గాలను గాలించగా ఒక చోట బేడీలు దొరికాయి. వాటిని స్వాధీనపర్చుకున్నారు. ఎక్కడైనా రాత్రి వేళ తలదాచుకుని శనివారం మరో చోటకు వెళ్లి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. బేడీలను అంత తక్కువ వ్యవధిలో తొలగించుకున్నాడనే విషయమై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాళం సరిగ్గా వేశారా? లేదా చెవిని కూడా లక్ష్మణ్‌ ముందుగా తస్కరించి తన వద్ద ఉంచుకున్నాడా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో రెండుసార్లు పారిపోయిన లక్ష్మణ్‌ను కరీంనగర్‌ పోలీసులు తేలిగ్గా తీసుకున్న తీరుపై విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పెద్దసంఖ్యలో వాహనాలను దొంగలించాడనే అభియోగాలు ఈ ఖైదీపై ఉన్నాయి. అలాంటి కీలకమైన దొంగకు భద్రత కల్పించే విషయంలో అప్రమత్తంగా వ్యవహరించలేదనేది తాజా సంఘటనతో స్పష్టమవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని