logo

సాంకేతిక సమస్యలు.. తాగునీటికి తిప్పలు

కరీంనగర్‌ నగర పాలక సంస్థ పరిధిలో తాగునీటి అవసరాలు పెరిగాయి. నగరమంతా ప్రతి రోజు సరఫరా అవుతుండగా.. ఒకటెండ్రు రిజర్వాయర్ల పరిధిలో మాత్రం సాంకేతిక సమస్యలతో తరచూ సమస్యలు ఎదురవుతున్నాయి..

Published : 05 Feb 2023 05:03 IST

న్యూస్‌టుడే, కరీంనగర్‌ కార్పొరేషన్‌

కరీంనగర్‌ నగర పాలక సంస్థ పరిధిలో తాగునీటి అవసరాలు పెరిగాయి. నగరమంతా ప్రతి రోజు సరఫరా అవుతుండగా.. ఒకటెండ్రు రిజర్వాయర్ల పరిధిలో మాత్రం సాంకేతిక సమస్యలతో తరచూ సమస్యలు ఎదురవుతున్నాయి.. పాత పైపులైను కావడం..విడి భాగాలు నాసిరకంగా అమర్చుతుండటం మూడు నెలలకు ఒకసారి దెబ్బతింటున్నాయి. ఆయా ప్రాంతాలకు జలం సరఫరాలో తరచూ అంతరాయాలు ఏర్పడుతున్నాయి.

లీకేజీలు అధికం..

అంబేడ్కర్‌నగర్‌ రిజర్వాయర్‌లోని పైపులైన్లు పూర్తిగా శిథిలమయ్యాయి. మిషన్‌ భగీరథ ద్వారా కొంతమేరనే కొత్త లైను వేయగా మిగతా చోట్ల వదిలేశారు. మంచిర్యాల చౌరస్తా నుంచి నాకా చౌరస్తా వరకు కొత్తది వేసినప్పటికీ పాత పైపులైను ద్వారానే శుద్ధి జలం సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ కొద్ది దూరం తారు రోడ్డుపై లీకేజీల ప్రవాహం ఆగడం లేదు. గతంలోనే పలుమార్లు మరమ్మతులు చేసి తారు వేయగా మళ్లీ బీట్‌ మార్కెట్‌ సమీపంలో నడి రోడ్డుపై నీరంతా బయటకు వస్తోంది. నాకా చౌరస్తా నుంచి పెద్దపల్లి రోడ్డులో 13 ఏళ్ల కిందట ప్రధాన పైపులైను వేయగా ఇది కూడా రోడ్డు మీద ఉండటంతో భారీ వాహనాలతో తరచూ లీకవుతోంది.

విడిభాగాలు ఏవీ?

తాగునీటి సరఫరా రోజు జరుగుతుండటంతో వాల్వులపై ప్రభావం పడుతోంది. అన్ని చోట్ల వీటికి సంబంధించిన విడిభాగాలు మాత్రం ఉండటం లేదు. 600, 500 మిమీ పైపులైన్ల వాల్వులు, షట్టర్లు, చెక్‌నట్లకు కొరత ఉంది. వీటిని ఇతర ప్రాంతాల నుంచి తెప్పించి వేసే వరకు సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. ప్యాకింగ్‌ తాడులు, పైపులు, మోటార్లు తదితర సామగ్రి సిద్ధంగా ఉండటం లేదు. అత్యవసరంగా కొనుగోలు చేయడానికి, మరమ్మతులు చేసేందుకు బిల్లులు చెల్లించడానికి కొంత మొత్తం కూడా ఉన్నతాధికారులు మంజూరు చేయకపోవడం కూడా ప్రధాన సమస్యగా మారింది.

నగరంలో కుళాయి  కనెక్షన్లు సుమారు : 49 వేలు
రిజర్వాయర్లు : 16


అంబేడ్కర్‌నగర్‌ రిజర్వాయర్‌ పరిధిలో 11 డివిజన్లకు 10,780 నల్లా కనెక్షన్లకు ప్రతి రోజు తాగునీరు సరఫరా చేయాల్సి ఉంటుంది. దీనికి ఆ రిజర్వాయర్‌లో రెండు ట్యాంకులు ఉన్నాయి. ఈ ప్రాంతానికి నెలకు వారం రోజులపాటు సరఫరా నిలిపి వేస్తున్నారు. లీకేజీలు, వాల్వ్‌ల మరమ్మతులు, విద్యుత్తు అంతరాయం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. తాజాగా ఈనెల 27 నుంచి ఇప్పటి వరకు రోజు విడిచి రోజు శుద్ధిజలం సరఫరా చేస్తున్నారు.


మంచిర్యాల చౌరస్తా నుంచి నాకా మీదుగా పెద్దపల్లి వైపు తారు రోడ్డుపై తరచూ పైపులైను లీకవుతోంది. పలుమార్లు మరమ్మతులు చేసినా భారీ వాహనాల రాకపోకలతో ఒత్తిడికి గురై జాయింట్లు ఊడిపోతున్నాయి. రోడ్డు చెడిపోతుండగా రాకపోకలు సాగించే ప్రజలు, సరఫరా నిలిపివేస్తే కాలనీవాసులు అవస్థ పడుతున్నారు. దీనికి శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరముంది.


మిషన్‌ భగీరథలో మూడేళ్ల కిందట వేసిన ఔట్‌లైన్‌కు సంబంధించిన 500 మి.మీ వాల్వ్‌ దెబ్బతింది. షట్టర్‌, చెక్‌నట్‌ పని చేయకపోవడంతో మరమ్మతులు చేసేందుకు ఆదిలాబాద్‌కు పంపించారు. అక్కడి నుంచి వచ్చేందుకు నాలుగైదు రోజుల సమయం పడుతుండటంతో అప్పటి వరకు రోజు విడిచి రోజు నీరు సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టారు. ఇదే తరహాలో శాతవాహన విశ్వవిద్యాలయం ఎంబీఆర్‌ నుంచి వచ్చే 600 మి.మీ పైపులైను వాల్వ్‌ చెడిపోయింది. ఎనిమిది రిజర్వాయర్లకు ఒక రోజు జలం సరఫరాపై ప్రభావం పడింది.


పరిష్కరించేందుకు చర్యలు
- మసూద్‌అలీ, డీఈఈ, నగరపాలిక

రిజర్వాయర్‌ పరిధిలో ఎప్పటికప్పుడూ లీకేజీలు గుర్తించి మరమ్మతు చేయిస్తున్నాం. సాంకేతిక సమస్యలతో ఇబ్బందులు వస్తున్నాయి. త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని