logo

Crime News: ఎందుకు చంపావ్‌ నాన్నా?

పెళ్లికి పోయొద్దాం బిడ్డా అంటే.. ఎంతో ఆనందపడితిమి.. వెళ్లేటప్పుడు ఎన్నో ముచ్చట్లు   చెబితివి.. విందులో కొసరి కొసరి తినిపిస్తివి.. ఇంతలో ఏమైంది నాన్నా.. మమ్మల్ని ఇలా బావిలో తోసేస్తివి..

Updated : 05 Feb 2023 08:03 IST

న్యూస్‌టుడే, మేడిపల్లి, జగిత్యాల గ్రామీణం

మధుమిత, ప్రణిత్య

పెళ్లికి పోయొద్దాం బిడ్డా అంటే.. ఎంతో ఆనందపడితిమి.. వెళ్లేటప్పుడు ఎన్నో ముచ్చట్లు   చెబితివి.. విందులో కొసరి కొసరి తినిపిస్తివి.. ఇంతలో ఏమైంది నాన్నా.. మమ్మల్ని ఇలా బావిలో తోసేస్తివి.. అప్పటివరకు మాతో ఆనందంగా గడిపిన నీకు మమ్మల్ని చంపాలని ఎందుకు అనిపించింది..  నా ముద్దుల పట్టీలు అంటూ గారాం చేసేవాడివి..  పెద్ద స్థాయికి   చేరుకుంటరని అందరికీ చెబుతుండే నువ్వేనా.. ఈ పని చేసింది.. నీళ్లలో పడేసి పైన నువ్వేమి ఆలోచిస్తున్నవో కాని.. ఊపిరాడక మేం ఇక్కడ సతమతవుతున్నాం.. నువ్వు.. అమ్మ.. అక్క గుర్తుకొస్తున్నారు.. ఆర్థిక సమస్యలు.. బలహీన క్షణాలు నిన్ను   ఈ పని చేసేలా చేయొచ్చు.. కానీ నిండు ప్రాణాలు పోయినంత మాత్రాన సమస్యలు దూరమవుతాయా.. మమ్మల్ని బాగా చదివిస్తే మేమే మీకు దన్నుగా ఉండేవాళ్లం.. నీ కష్టాలను తీర్చేవాళ్లం.. ఇలాంటి అన్యాయం ఇంకెవరికీ జరగొద్దు నాన్నా.. అయిపోయింది నాన్నా.. మేమింక ఈ ప్రపంచం నుంచి  వెళ్లిపోతున్నాం..  (జగిత్యాల జిల్లా నర్సింగాపూర్‌లో జలపతిరెడ్డి అనే వ్యక్తి ఇద్దరు కుమార్తెలను బావిలో తోసేసి తాను ఆత్మహత్య చేసుకున్న  ఘటన కలకలం రేపింది.. చనిపోయే ముందు ఆ చిన్నారులు పడిన ఆవేదన ఇలా ఉంటుందన్న దానికి అక్షర రూపమే ఇది.)

రోదిస్తున్న జలపతిరెడ్డి  భార్య కవిత, పెద్ద కుమార్తె జష్మిత

ఆర్థిక సమస్యలు చుట్టుముట్టి..

ఇద్దరు కుమార్తెలను బావిలో తోసి తండ్రి జలపతిరెడ్డి ఆత్మహత్య చేసుకోవడానికి ఆర్థిక సమస్యలే కారణమని తెలుస్తోంది.  మృతి చెందిన చిన్నారుల్లో మధుమిత 5వ తరగతి చదువుతుంటే.. ప్రణిత్య రెండో తరగతి చదువుతోంది.. జలపతిరెడ్డికి చెందిన భూమిని ప్రజా అవసరాల కోసం తీసుకున్న ప్రభుత్వం పరిహారాన్ని కోర్టులో డిపాజిట్‌ చేసింది. ఆ సొమ్ము చేతికి రాక ఆర్థికంగా ఇబ్బందులకు గురయ్యారు. మరోవైపు తనకున్న కొంత వ్యవసాయ భూమిని విక్రయించి వచ్చిన సొమ్ముతో అప్పులు చెల్లించి మిగతా కొంత సొమ్మును గ్రామంలో, జగిత్యాలకు చెందిన కొందరికి అప్పుగా ఇచ్చారు. వారెవరూ తిరిగి చెల్లించడం లేదని సమాచారం. పిల్లలు ఎదుగుతుండటం, అవసరాలు పెరిగిపోవడంతో కుటుంబంలో గొడవలు చోటుచేసుకున్నాయని తెలుస్తోంది. ఈ క్రమంలో మానసిక ఇబ్బందులకు గురైన జలపతిరెడ్డి గత నెలలోనే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని సూసైడ్‌ నోట్‌ రాసి దగ్గర పెట్టుకుని తన భార్యకు కూడా ఫోన్‌లో పంపించినట్లు గ్రామస్థులు చెప్పారు. అయితే తరచూ చనిపోతానని చెబుతుండటంతో కుటుంబసభ్యులు పెద్దగా పట్టించుకోలేదని సమాచారం. శుక్రవారం రాత్రి ముగ్గురు కుమార్తెలను తీసుకుని స్నేహితుడి ఇంట వివాహానికి వెళ్లాలని నిర్ణయించుకున్నా పెద్ద కుమార్తె వెళ్లకపోవడంతో ఆమె ప్రాణాలు నిలిచాయి. శనివారం ఉదయం జలపతిరెడ్డి మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు ముందుగా హత్యగా భావించారు. ఆ తర్వాత బావిలో చిన్నారుల మృతదేహాలు వెలికి తీయడంతో చిన్నారులను బావిలో తోసేసినట్లు నిర్ధారణకు వచ్చారు. ఈ సంఘటనపై మొదట భార్య అనుమానం వ్యక్తం చేసినప్పటికీ తరవాత పోలీసులకిచ్చిన ఫిర్యాదులో న్యాయవాది వేధింపులతోనే తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని, పిల్లలను బావిలో తోశాడని పేర్కొంది. ఈ ఫిర్యాదు, మృతుడి వద్ద లభించిన సూసైడ్‌ నోట్‌ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. చరవాణి కాల్‌ రికార్డులు, సమీపంలోని వారిని విచారిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని