logo

Telangana Budget 2023: ఎన్నెన్నో ఆశలు.. కురిసేనా వరాలు

రాష్ట్ర పద్దుపైనే ఉమ్మడి జిల్లా ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. శాసనసభ ఎన్నికల ముందు చివరి బడ్జెట్‌ కావడంతో ఆర్థిక మంత్రి కురిపించే వరాలపైనే అందరి దృష్టీ పడింది.

Updated : 06 Feb 2023 09:27 IST

నేటి రాష్ట్ర బడ్జెట్‌పైనే ఉమ్మడి జిల్లా ప్రజల దృష్టి

ఈనాడు, కరీంనగర్‌: రాష్ట్ర పద్దుపైనే ఉమ్మడి జిల్లా ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. శాసనసభ ఎన్నికల ముందు చివరి బడ్జెట్‌ కావడంతో ఆర్థిక మంత్రి కురిపించే వరాలపైనే అందరి దృష్టీ పడింది. ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం, పెండింగ్‌ ప్రాజెక్టుల పూర్తి, కొత్త పథకాలతో సంక్షేమం పరుగులు పెట్టాలని ఆకాంక్షిస్తున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న పనులకు మరింత దన్నుగా నిలవడంతో పాటు గత హామీలు అమలయ్యేలా కేటాయింపులుండాలని కోరుతున్నారు. సోమవారం రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వాసుల ఆకాంక్షలపై ‘ఈనాడు’ ప్రత్యేక కథనం.


పెండింగ్‌ ప్రాజెక్టులకు మోక్షం కలిగేనా!

ఉమ్మడి జిల్లాలో సాగునీటి రంగానికి ప్రతి బడ్జెట్‌లో పెద్దపీట వేస్తున్నారు. ఈసారి కూడా ఘనమైన కేటాయింపులుంటే పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తయ్యే అవకాశముంది. కాళేశ్వరం పథకానికి అనుబంధంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిర్మిస్తున్న ప్యాకేజీ పనులకు నిధులు కేటాయించాల్సి ఉంది. జగిత్యాల జిల్లాలోని రోళ్లవాగు ప్రాజెక్టుకు నిధుల కేటాయింపులుండాలి. కోటిలింగాల నుంచి వెల్గటూరు, పెగడపల్లి, గంగాధర మండలాల మీదుగా మధ్యమానేరు(శ్రీరాజరాజేశ్వర) జలాశయం వరకు నిర్మిస్తున్న అదనపు టీఎంసీ పనులకు రూ.వందల కోట్ల ప్రకటన సభలో వినిపించాలని రైతులు ఆశిస్తున్నారు. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో పెండింగ్‌ పథకాలతో పాటు కథలాపూర్‌, మేడిపల్లి మండలాలకు కొత్త పథకాలు మంజూరు చేస్తామని గతంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు నెరవేరాల్సి ఉంది. నారాయణపూర్‌ ముంపు బాధితుల వేదన తీరేలా ప్రకటన రావాలి. వరద కాలువ, కాకతీయ కాలువల మరమ్మతుకు అవసరమైన రూ.100 కోట్ల నిధులతో పాటు కొన్ని చోట్ల విస్తరణకు వీలుగా అందిన ప్రతిపాదనలు నెరవేరాల్సి ఉంది.


సాగుకు కావాలి దన్ను

సాగులో మరింత వెన్నుదన్నుగా నిలిచేలా ప్రోత్సాహకాలపై రైతులు ఆశలు పెట్టుకున్నారు. రుణమాఫీ హామీ నెరవేరేలా నిధుల ప్రకటన ఉంటుందని ఆశిస్తున్నారు. అకాల వర్షాల సమయంలో సాంత్వన చేకూర్చేలా పరిహారం అందించాలని, ఈ మేరకు బడ్జెట్‌ కేటాయింపులుండాలని కోరుతున్నారు. సేంద్రీయ సాగుకు ఊతమివ్వడంతో పాటు ఉద్యాన పంటలు, కూరగాయల కాలనీల ఏర్పాటు అంశాన్ని ఈసారి ఆచరణలో చూపించాల్సి ఉంది. యాంత్రీకరణకు మరింత తోడ్పాటు అవసరం ఉంది. బిందు, తుంపర సేద్యానికి రాయితీలు, ఆయిల్‌పామ్‌ సహా కొత్త పంటల సాగుకు ప్రోత్సాహకాలు మరింత మెరుగవ్వాల్సి ఉంది. వ్యవసాయ మార్కెట్‌లలో వసతుల కల్పనకు నిధులు కేటాయించాలి. రాయితీ గొర్రెల పథకంలో రెండో విడత కోసం డీడీలు కట్టి ఎదురుచూస్తున్న వారికి నగదు విధానంలోనైనా మేలు జరగాలి.


మెరుగైన వైద్యమే ప్రధానం

నాలుగు జిల్లాల్లో వైద్య కళాశాల ఏర్పాటు ఆశలు నెరవేరాయి. జగిత్యాలలో తరగతులు ప్రారంభం కాగా, భవన నిర్మాణం ప్రగతిలో ఉంది. సిరిసిల్ల, కరీంనగర్‌, గోదావరిఖనిలలో నూతన భవనాల నిర్మాణంతో పాటు ఇక్కడ పోస్టుల భర్తీ, తరగతుల నిర్వహణకు వీలుగా నిధులు మంజూరు చేయాల్సి ఉంది. ప్రభుత్వ వైద్య సేవలు మరింత మెరుగయ్యేలా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉపకేంద్రాలు, బస్తీ దవాఖానాల్లో వైద్య ఉపకరణాలు అందుబాటులోకి రావాల్సి ఉంది.


పరిశ్రమలకు అందేనా తోడ్పాటు

వివిధ సంక్షేమ పథకాల అమలులో రాయితీలు మరింత పెరిగేలా బడ్జెట్‌లో కేటాయింపులుండాలని ఆయా వర్గాల ప్రజలు కోరుతున్నారు. పారిశ్రామిక రంగానికి మరింత తోడ్పాటు అవసరం ఉంది. ఆహార ఉత్పత్తుల పరిశ్రమల ఏర్పాటు కోసం ఉమ్మడి జిల్లాలోని చిగురుమామిడి, ఎలిగేడు, మెట్‌పల్లి మండలాల్లో గుర్తించిన భూముల్లో కార్యాచరణ ప్రారంభమయ్యేలా నిధులు కేటాయించాలి. బీసీ, ఎస్టీ, మైనారిటీ యువతకు స్వయం ఉపాధి పథకాలు కొన్నేళ్లుగా అందని ద్రాక్షగా మారాయి. రాయితీ పథకాల కింద నిధుల కేటాయింపులుండాలి.


ప్రత్యేక నిధులతోనే సాంత్వన

* మానేరు రివర్‌ఫ్రంట్‌కు గతంలో మంజూరు చేసిన రూ.408 కోట్లకు సంబంధించిన పద్దు నిధి రూపంలో ఈ బడ్జెట్‌ ద్వారా జిల్లాకు రావాలి.
* శాతవాహన విశ్వవిద్యాలయంలో బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలతో పాటు వసతులు కల్పించాలి.
* పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా గోదావరి, మానేరు పరీవాహక ప్రాంతాల ప్రగతికి నిధులు కేటాయించాలి.
* మహిళా సంఘాలకు అందాల్సిన వడ్డీ లేని రుణాలు, బ్యాంకు లింకేజీ రుణాలు, సమాఖ్య భవనాలకు నిధులు మంజూరు చేయాలి.
* గతేడాది కురిసిన అధిక వర్షాలకు ఉమ్మడి జిల్లాలో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతుకు దాదాపు రూ.200 కోట్ల వరకు ప్రత్యేక నిధులు కేటాయించాలి.

* గుర్తింపు సంఘం ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీల అమలుకు ప్రత్యేక నిధులు కేటాయించాలని సింగరేణి కార్మికులు కోరుతున్నారు.
* దళితబంధు పథకానికి నిధుల లేమి ఆటంకంగా మారింది. నియోజకవర్గాల వారీగా ఎంపిక చేసిన లబ్ధిదారులకు ఈ బడ్జెట్‌తో మేలు జరగాలి.
* రెండు పడక గదుల ఇళ్లన్నీ పూర్తయ్యేలా కేటాయింపులుండాలి. సొంత స్థలంలో ఇళ్ల నిర్మాణాలకు ఇచ్చే ప్రోత్సాహకాలకు నిధులు మంజూరు చేయాలి.
* నేతన్నల సంక్షేమానికి కొత్త ప్రోత్సాహకాలుండాలి. బీడీ కార్మికులకు మేలు జరగాలి.
* మత్స్యకారులతో పాటు వివిధ కుల సంఘాల జీవనం మరింత మెరుగయ్యేలా వివిధ పథకాలతో లబ్ధి చేకూరాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని