logo

అంచనాలకు మించి వరి సాగు

ఈ యాసంగిలో సైతం జిల్లా రైతులు వరి సాగు వైపే అధికంగా మొగ్గు చూపారు. గతేడాది ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

Published : 06 Feb 2023 02:36 IST

న్యూస్‌టుడే, కరీంనగర్‌ మంకమ్మతోట: ఈ యాసంగిలో సైతం జిల్లా రైతులు వరి సాగు వైపే అధికంగా మొగ్గు చూపారు. గతేడాది ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సందిగ్ధôలో కొందరు ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్లారు. ఈసారి అలాంటి ప్రకటన ఏమి చేయకపోవడంతో అంచనాలకు మించి వరి సాగు చేస్తున్నారు. ఈ యాసంగిలో ఇప్పటి వరకు సాగు చేసిన పంటల వివరాలపై కథనం.


గతేడాదికన్నా 7 వేల ఎకరాలు అధికం

గత యాసంగి సీజన్‌లో జిల్లాలో 2,46,893 ఎకరాల్లో వరి సాగు విస్తీర్ణం నమోదైంది. ఈ యాసంగిలో 2,44,000 వరకు వరి విస్తీర్ణం ఉండవచ్చని జిల్లా వ్యవసాయ అధికారులు అంచనాలు తయారు చేశారు. కానీ అంతకు మించి 2,54,015 ఎకరాల్లో ఇప్పటికే వరి సాగు చేశారు. మరికొన్ని చోట్ల ఇప్పటికీ సాగుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. మొత్తంగా అధికారుల అంచనాలకు మించి ఇప్పటికే 7 వేల ఎకరాల వరకు పెరగగా, మరో పక్షం రోజుల్లో వేసే నాట్లతో కలిపి గతేడాదితో పోల్చితే పది వేల ఎకరాలు అధికంగా సాగయ్యే అవకాశముందని జిల్లా వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు.


పెరుగుదలకు కారణాలు

గతేడాది మాదిరిగానే ఈ ఏడాది అధిక వర్షాలు పడడంతో జిల్లాలో భూగర్భ జలాలపై బెంగ లేదు. అంతేగాకుండా కాళేశ్వరం పంపులు తిరిగి పనిచేయడంతో కాలువల కింద పంటలు వేసుకునే వారందరిలో నీటి విడుదలపై భరోసా వచ్చింది. సాగుకు సరిపడా విద్యుత్తు సరఫరా విషయంలో కూడా పెద్దగా ఇబ్బందులుండవనే హామీతో రైతుల్లో సాగుపై మరింత భరోసా కల్గింది. గత రబీ సీజన్‌లో వచ్చిన వరి ధాన్యాన్ని మొత్తంగా ఎలాంటి షరతులు లేకుండా ప్రభుత్వం కొనుగోలు చేయడంతో రైతుల్లో కొనుగోళ్లపై ఉన్న అపోహలు తొలిగిపోయినట్లు అయింది. అంతేగాకుండా ప్రపంచ మార్కెట్‌లో వరికి డిమాండ్‌ ఉండడంతో రబీ ధాన్యాన్ని ప్రైవేట్‌గా మిల్లర్లు సైతం పోటీపడి కొనుగోలు చేశారు. ఈ పరిణామాలు రైతుల్లో యాసంగి ధాన్యం కొనుగోళ్లపై నమ్మకాన్ని పెంచినట్లు అయింది.


క్రాప్‌ బుకింగ్‌ విధానంతో...

సంబంధిత వ్యవసాయ అధికారులు క్రాప్‌ బుకింగ్‌ ప్రక్రియ ద్వారా పంటల సాగు వివరాలను పకడ్బందీగా నమోదు చేస్తున్నారు. రైతుల వారీగా నీటి వసతి, అందుబాటులో ఉన్న వనరులు, మార్కెటింగ్‌ సదుపాయం తదితర వివరాలనూ నమోదు చేస్తున్నారు.


పకడ్బందీగా వివరాల నమోదు

క్రాప్‌ బుకింగ్‌ విధానంతో పంట సాగు వివరాలను పకడ్బందీగా నమోదు చేస్తున్నాం. 95 శాతం వరకు వివరాల నమోదు పూర్తయింది. కొన్ని చోట్ల ముందుగా నాట్లు వేసిన వాటికి మొగి పురుగుతో ఇబ్బందులు ఏర్పడ్డాయి. వారందరూ తిరిగి నాట్లు వేస్తున్నారు. మరో ఐదు శాతం సాగు వివరాల నమోదు ప్రక్రియ పూర్తి చేయాల్సి వచ్చింది. పంటల సాగుతోపాటు రైతులు, మార్కెటింగ్‌ తదితర వివరాలను సైతం నమోదు చేస్తున్నాం.  

వాసిరెడ్డి శ్రీధర్‌,  జిల్లా వ్యవసాయాధికారి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని