logo

ఈసారైనా సజావుగా జరిగేనా?

జిల్లాలోని వివిధ శాఖల్లో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి చర్చించి అవసరమైన సూచనలు, తీర్మానాలు చేసి జిల్లా పరిషత్‌కు పంపించేందుకు నిర్వహించే స్థాయీ సంఘ సమావేశాలు మొక్కుబడిగా జరుగుతున్నాయి.

Published : 06 Feb 2023 02:36 IST

మొక్కుబడిగా స్థాయీ సంఘాల సమావేశాలు

జడ్పీ సమావేశ మందిరంలో స్థాయీ సంఘం సమావేశం (పాత చిత్రం)

కరీంనగర్‌ పట్టణం, న్యూస్‌టుడే: జిల్లాలోని వివిధ శాఖల్లో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి చర్చించి అవసరమైన సూచనలు, తీర్మానాలు చేసి జిల్లా పరిషత్‌కు పంపించేందుకు నిర్వహించే స్థాయీ సంఘ సమావేశాలు మొక్కుబడిగా జరుగుతున్నాయి. సభ్యుల గైర్హాజరుతో వాయిదా పడుతున్నాయి. మూడు నెలలకొకసారి జరిగేవి కూడా వాయిదా పడడం, పూర్తి స్థాయిలో జరగకపోవడం విమర్శలకు దారితీస్తోంది. గత సమావేశంలో ఏడింటిలో ఐదు మాత్రమే మొక్కుబడిగా నిర్వహించారు. వ్యవసాయం, సంక్షేమ విభాగాలవి వాయిదా పడ్డాయి. నేడు (సోమవారం) జరిగే సమావేశాలు పూర్తి స్థాయిలో జరుగుతాయా? లేదా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


ఆయా విభాగాలపై సమీక్ష

ఒకటో స్థాయీ సంఘం పరిధిలో ఆర్థిక ప్రణాళిక విభాగాలుంటాయి. జిల్లా పరిషత్‌ నిధులు చేపట్టి పనుల ప్రణాళికపై చర్చిస్తారు. రెండో దాంట్లో గ్రామీణాభివృద్ధి, అనుబంధ విభాగాలపై సమీక్షిస్తారు. మూడో దాంట్లో వ్యవసాయం, అనుబంధ విభాగాలపై చర్చిస్తారు. నాలుగులో విద్య, వైద్యం ఉంటాయి. ఐదులో స్త్రీ, శిశు సంక్షేమ విభాగాల శాఖలు, ఆరు, ఏడులో చేపట్టిన పనులను వివరిస్తారు. ఈ సమావేశాలలో ఆయా శాఖలపై చర్చించి సూచనలు అవసరమైన తీర్మానాలు చేశారు. ఈ సమావేశాలు అన్నింటికి ఆయా శాఖల అధికారులు పూర్తి సమాచారంతో హాజరవుతారు.


కమిటీల ఏర్పాటు ఇలా..

వ్యవసాయ స్థాయీ సంఘానికి వైస్‌ ఛైర్మన్‌ అధ్యక్షులుగా వ్యవహరించడం ఆనవాయితీ. సంక్షేమ విభాగాల కమిటీకి షెడ్యూల్‌ కులాల జడ్పీ సభ్యురాలిని ఎన్నుకుంటారు. మహిళా సంక్షేమానికి మగువలు అధ్యక్షులుగా ఉంటారు. మిగిలిన నాలుగు కమిటీలకు జడ్పీ ఛైర్‌పర్సన్‌ అధ్యక్షత వహిస్తారు. కమిటీల్లో జడ్పీటీసీ సభ్యులు కో-ఆప్షన్‌ సభ్యులు శాసన సభ్యులుగా ఉంటారు. జిల్లా పరిషత్‌ల విభజన తర్వాత జిల్లాలు చిన్నవి కావడంతో ప్రతి కమిటీకి ఇద్దరు జడ్పీటీసీ సభ్యులు, ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ మొత్తం మీద ముగ్గురు నుంచి నలుగురు సభ్యులుగా ఉంటారు. వీరి సమక్షంలో సమావేశాలు జరుగుతాయి.


సభ్యులు, అధికారుల గైర్హాజరు..

సభ్యులు, అధ్యక్షత వహించాల్సిన ఛైర్మన్లు గైర్హాజరు కావడంతో చాలా సమావేశాలకు వాయిదా పడుతున్నాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా హాజరు కావడంలేదు. కమలాకర్‌, జీవన్‌రెడ్డి, రసమయి బాలకిషన్‌, రవిశంకర్‌ ఒకసారి హాజరయ్యారు. కొందరు జిల్లా స్థాయి అధికారులు హాజరుకాక కింది స్థాయి వారిని పంపడంతో సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వారికి వ్యతిరేకంగా తీర్మానాలు చేస్తున్నారు.


కొన్ని సార్లు ఛైర్మన్‌ ఛాంబర్‌లోనే..

సాధారణంగా ఈ సమావేశాలు జడ్పీ మందిరంలో జరగాలి. సభ్యుల సంఖ్య తక్కువగా ఉంటే ఛైర్‌పర్సన్‌ ఛాంబర్‌లోనే జరిపి ముగిస్తున్నారు. మొక్కుబడిగా జరగడంతో ఆశించిన ప్రయోజనం చేకూరడం లేదు. 2019 జులై 5న జడ్పీ పాలకవర్గం బాధ్యతలు చేపట్టింది. ఇప్పటివరకు దాదాపు సగం వాయిదాపడ్డాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని