logo

సాగుతోపాటే పెరిగిన సమస్యలు

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ఈ యాసంగిలో సాధారణంకన్నా అధికంగా పంటలు సాగులోకి రాగా.. ప్రతికూల వాతావరణంతో పైర్లపై సమస్యలు పెరిగినట్లు జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనస్థానం సహ పరిశోధన సంచాలకులు డాక్టర్‌ జి.శ్రీనివాస్‌ పేర్కొన్నారు.

Published : 06 Feb 2023 02:36 IST

డాక్టర్‌ జి.శ్రీనివాస్‌

న్యూస్‌టుడే, జగిత్యాల వ్యవసాయం: ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ఈ యాసంగిలో సాధారణంకన్నా అధికంగా పంటలు సాగులోకి రాగా.. ప్రతికూల వాతావరణంతో పైర్లపై సమస్యలు పెరిగినట్లు జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనస్థానం సహ పరిశోధన సంచాలకులు డాక్టర్‌ జి.శ్రీనివాస్‌ పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్య చర్యలను ‘న్యూస్‌టుడే’ ముఖాముఖి ద్వారా వివరించారు.

జగిత్యాల మండలంలో ఎదుగుదల లేక ఎర్రబారిన వరి పైరు


ఉమ్మడి జిల్లాలో ఏయే పంటల సాగువిస్తీర్ణం పెరిగింది.?

సమాధానం: కరీంనగర్‌, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఈ యాసంగిలో 6.34 లక్షల ఎకరాల్లో అన్నిరకాల పంటలు పండిస్తారని అంచనా వేసినా సాగునీటి లభ్యతతో ఇప్పటికే సాగు 9.75 లక్షల ఎకరాలను దాటింది. ఇందులో వరిసాగే 8.9 లక్షల ఎకరాలుండగా తదుపరి మొక్కజొన్న, పెసర, మినుము, ఆవాలు, జొన్న, వేరుసెనగ తదితర పంటలున్నాయి. ఈ నెల 15 వరకు నువ్వులు, పెసర, మినుము, కూరగాయలు తదితరాలను విత్తుకునే అదనుండగా సాగువిస్తీర్ణం మరింతగా పెరగనుంది.


వరిపైరు ఎదుగుదల లేక నష్టం వాటిల్లుతోంది.?

ఉత్తరంవైపు నుంచి వీస్తున్న పొడిగాలులతో తేమశాతం తగ్గి చలిపెరగటం, ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులతో సమస్యలు తలెత్తుతున్నాయి. దుక్కిలో జింకువేయని పొలాలు ఎర్రబారగా 2 శాతం జింకుసల్ఫేటు ద్రావణాన్ని రెండుదఫాలుగా పైరుపై పిచికారీ చేయాలి. వానాకాలం వరితీసిన వెంటనే యాసంగి నార్లు పోయగా మొగిపురుగు జీవితచక్రం కొనసాగి ప్రస్తుతం వీటి తీవ్రత అనూహ్యంగా పెరిగింది. పైరు లేతదశలో 8 కిలోల కారటాఫ్‌ హైడ్రోక్లోరైడ్‌ లేదా 4 కిలోల క్లోరాంత్రనిలిప్రోల్‌ గుళికలను ఎకరాకు వేసి మొగిపురుగును నివారించవచ్చు. నాటి నెల రోజులు దాటితే కారటాఫ్‌ హైడ్రోక్లోరైడ్‌ 400 గ్రాములు లేదా క్లోరాంత్రనిలిప్రోల్‌ 60 మి.లీ మందును ఎకరాకు పిచికారీ చేయాలి.


ఇతర పంటలపై చీడపీడల ప్రభావం ఉందా.?

మక్కలో కత్తెరపురుగు నివారణకు తవుడు, బెల్లం, థయోడికార్బ్‌తో విషపు ఎరలను తయారు చేసుకుని వినియోగించాలి. పొడి వాతావరణంలో కొన్నిరకాల పైర్లపై తామర పురుగుల నివారణకు 1.5 గ్రాముల ఎసిఫేటును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. మామిడిలో తామర పురుగుల నివారణకు ఫిప్రోనిల్‌ 2 మి.లీ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.


రైతులకు మీరిచ్చే సలహా ఏమిటి?

వాతావరణం, నేలగుణం, పంట విత్తన రకాలు, యాజమాన్యం తదితరాలను బట్టి ఒకరైతు పొలానికి పక్కనేఉన్న మరోరైతు పొలానికి చాలాతేడా ఉంటుంది. కాబట్టి పంటలపై ఏవేని అసహజ లక్షణాలుంటే వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులు లేదా శాస్త్రవేత్తలకు పైర్ల నమూనాలు చూపించి నివారణ తెలుసుకుని ఆచరించాలి. తోటి రైతులను అనుకరించి లేదా దుకాణాల్లోంచి నేరుగా మందులను తీసుకెళ్లి వాడటంద్వారా ఆర్థికనష్టమే అధికంగా ఉంటుంది, పైర్లపై ఆశించిన ప్రయోజనాలను పొందలేరు.


వరి పైరులో ఎలాంటి యాజమాన్య చర్యలు చేపట్టాలి.?

కొన్నిచోట్ల లోతట్టు వందూరు నేలల్లో నిరంతరం నీరు నిలిచిన ప్రాంతాల్లోనూ వరి ఎర్రబారుతోంది. దీనికిగాను పొలాల్లో నిల్వనీటిని తీసివేసి ఆరగట్టి పలుచగా యూరియా చల్లాలి. కొన్నిచోట్ల ఆశించిన అగ్గితెగులు నివారణకు ట్రైసైక్లోజోల్‌ 0.6 మి.లీ మందును లీటరు నీటికి వంతున కలిపి పిచికారీ చేయాలి. కొన్నిచోట్ల ఉల్లికోడు ఆశించగా నివారణకు 2 మి.లీ ఫిప్రోనిల్‌ మందును లీటరు నీటికి వంతున కలిపి పిచికారీ చేయాలి. తెగుళ్లవ్యాప్తి నిరోధానికి యూరియాను పరిమితంగానే వినియోగించాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని