logo

పేరు ఘనం.. వసతి శూన్యం

ఇంటర్‌ పరీక్షలు సమీపిస్తున్నాయి. ఫిబ్రవరిలో ప్రయోగ పరీక్షలు. మార్చిలో వార్షిక పరీక్షలు. ఆ నెలాఖరులో మూల్యాంకనం. ఇది అధికారులకు సమస్యగా మారింది.

Published : 06 Feb 2023 02:36 IST

సమస్యల్లో ఇంటర్‌ మూల్యాంకన శిబిరం
మూడు చోట్ల నిర్వహణతో వ్యయ భారం

మూల్యాంకన కేంద్రాల్లో ఒకటి ఇంటర్‌ విద్యాధికారి కార్యాలయం

న్యూస్‌టుడే, గణేశ్‌నగర్‌: ఇంటర్‌ పరీక్షలు సమీపిస్తున్నాయి. ఫిబ్రవరిలో ప్రయోగ పరీక్షలు. మార్చిలో వార్షిక పరీక్షలు. ఆ నెలాఖరులో మూల్యాంకనం. ఇది అధికారులకు సమస్యగా మారింది. కారణం కావాల్సిన భవనం లేకపోవడం. రాష్ట్రంలో రెండో మూల్యాంకన కేంద్రం కరీంనగర్‌. అత్యధిక సబ్జెక్టులు ఇక్కడే దిద్దుతారు. ఆ మేరకు వసతులు లేవిక్కడ. మూడు చోట్ల మూల్యాంకనం చేస్తారు. ఇంటర్‌ బోర్డు అధిక వ్యయం చేయాల్సిన దుస్థితి. వాస్తవానికి ఉన్నతాధికారులు స్పందించి చొరవ తీసుకుంటే భవన నిర్మాణం జరిగే అవకాశముంది. అంతకుముందు ప్రస్తుతం వినియోగిస్తున్న కార్యాలయం ఇంటర్‌ బోర్డు పేరిట మోటేషన్‌ కావాల్సి ఉంది. ఇందుకు లేఖలు ఒక శాఖ నుంచి మరొక శాఖకు తిరుగుతూనే ఉన్నాయి.


సమస్య ఏమిటంటే?

స్టేప్‌కార్‌ కార్యాలయాన్ని ఇంటర్‌ విద్యకు కేటాయించారు. అయితే ఆ స్థలం, భవనం టీసీఐఐసీ (పరిశ్రమల శాఖ) ఆధీనంలో ఉంది. 2017 నుంచి అక్కడ డీవీఈవో కార్యాలయం కొనసాగుతోంది. ఇందుకు ఇంటర్‌ బోర్డు ఆస్తి పన్ను చెల్లించాలి. నగర పాలక సంస్థ నుంచి కార్యాలయానికి చెల్లించాలని నోటీసులు అందాయి. ఆ మొత్తం ఇంటర్‌ బోర్డు కమిషనర్‌ మంజూరు చేయాల్సి ఉంది. వినియోగిస్తున్న భవనం ఇంటర్‌ బోర్డు పేరిట మోటేషన్‌ చేస్తే సంబంధిత నిధులు లభిస్తాయని బోర్డు స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని డీఐఈవో కార్యాలయం నగర పాలక సంస్థ కమిషనర్‌కు లేఖ రాసింది. ఆ తర్వాత 2020 నుంచి మోటేషన్‌ కోసం కలెక్టర్‌కు లేఖలు రాశారు. 2022లో టీసీఐసీసీ జోనల్‌ మేనేజర్‌కు కలెక్టర్‌ నుంచి సిఫారసు వెళ్లింది. ఇదే విషయాన్ని జిల్లా అధికారులు పరిశ్రమల శాఖ మేనేజింగ్‌ డైరెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. నేటికి సమస్య పరిష్కారం కాలేదు.


భవనం నిర్మిస్తేనే..

పరిశ్రమల శాఖ మోటేషన్‌కు అనుమతిస్తే భవనం ఇంటర్‌ బోర్డు ఆధీనంలోకి వస్తుంది. అప్పుడు కావాల్సిన నిధుల మంజూరు చేయడంలో నగర పాలక సంస్థకు బకాయిపడ్డ రూ.5 లక్షలు చెల్లించేందుకు అవకాశం ఉంటుంది. మూల్యాంక శిబిరానికి అనువుగా ఇక్కడ భవన నిర్మాణానికి మార్గం సుగమమవుతుంది. ఇందుకు ఇంటర్‌ బోర్డు కూడా సానుకూలంగా ఉంది. జిల్లా కలెక్టర్‌తోపాటు పరిశ్రమల శాఖ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తే సమస్య పరిష్కారమవుతుందని ప్రధానాచార్యులు, అధ్యాపకులు అభిప్రాయపడుతున్నారు.


రాష్ట్రంలో 5 లక్షల సమాధాన పత్రాలు ఇక్కడికే

పాత జిల్లా కేంద్రాల్లో మూల్యాంకనం జరుగుతుంది. రాష్ట్రంలో వరంగల్‌ మొదటి స్థానంలో ఉండగా, కరీంనగర్‌ శిబిరం రెండో స్థానం ఉంది. ఇక్కడే 5 లక్షలకు పైగా సమాధాన పత్రాల మూల్యాంకనం చేస్తారు. అన్ని సబ్జెక్టులు కలుపుకొని సుమారు 2 వేల మంది అధ్యాపకులు పలు విడతల్లో 30 రోజులపాటు శ్రమిస్తారు. ప్రభుత్వ కళాశాలల్లో సరిపడా వసతులు లేవు. వాస్తవానికి ఒకే చోట శిబిరం ఏర్పాటు చేయాలి. కానీ ఇక్కడ మూడు ఉన్నాయి.


గతంలో ఇలా..

జిల్లా కేంద్రంలోని ముకరంపురలో ఇంటర్‌ విద్యా కార్యాలయం. దాని పక్కనే ప్రభుత్వ ఆర్ట్స్‌ జూనియర్‌ కళాశాల. కార్యాలయంలో కొన్ని సబ్జెక్టుల అధ్యాపకులు పేపర్లు దిద్దేవారు. అక్కడే స్ట్రాంగ్‌ రూంతోపాటు పర్యవేక్షణ జరిగేది. ఆర్ట్స్‌ కళాశాలలో 30 గదుల్లో గరిష్ఠ అంశాల మూల్యాంకనం కొనసాగేది. ఏటా మూడు విడతల్లో ఆయా సబ్జెక్టుల సమాధాన పత్రాలను అధ్యాపకులు దిద్దేవారు. అయితే ఇప్పుడవి లేకపోవడం సమస్యగా మారింది.


ఇప్పుడు ఇలా..

స్మార్ట్‌సిటీలో భాగంగా ఆర్ట్స్‌ కళాశాలను కూల్చివేశారు. ఇప్పుడక్కడ పార్కు నిర్మిస్తున్నారు. అప్పటి కలెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ ఆర్ట్స్‌ కళాశాలకు ఇంటర్‌ విద్యా కార్యాలయం (ఆర్‌ఐవో) కేటాయించారు. అక్కడ కొనసాగుతున్న కార్యాలయాన్ని పద్మానగర్‌లోని స్టేప్‌కార్‌ కార్యాలయానికి మార్చారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు 2017లో ఆర్‌ఐవో కార్యాలయం కలెక్టర్‌కు అప్పగించి పద్మానగర్‌కు షిఫ్ట్‌ చేశారు. పాత ఆర్‌ఐవో ఆఫీసులో ఇప్పుడు ఆర్ట్స్‌ కళాశాల కొనసాగుతోంది. మొదట అసౌకర్యంగా ఉన్నా తాత్కాలిక గదులు, మరమ్మతులతో ఫర్వాలేదు. మూల్యాంకనం కోసం జ్యోతినగర్‌లోని లయోలా కళాశాలను ఆశ్రయించారు. రెండేళ్లు గడిచాక వారు నిరాకరించారు. గత్యంతరం లేక పద్మానగర్‌లో ఇంగ్లిష్‌, సంస్కృతం మూల్యాంకనం జరుగుతోంది. తెలుగు, హిందీతోపాటు ఆర్ట్స్‌, కామర్స్‌ సబ్జెక్టులు ఆర్ట్స్‌ కళాశాలలో, సైన్స్‌, మ్యాథ్స్‌ సబ్జెక్టులు ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో నిర్వహించాల్సి వస్తోంది. పద్మానగర్‌లోని స్ట్రాంగ్‌ రూం నుంచి సమాధాన పత్రాలు రెండు చోట్లకు రవాణా చేయడం సమస్యగా మారింది. రవాణా ఖర్చు పెరిగింది. మూడు చోట్ల విద్యుత్‌ ఛార్జీలు భరించాల్సిన పరిస్థితి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని