logo

ఆశల సాగు..సంక్షేమం బాగు

కర్షక సంక్షేమం.. సాగునీటి రంగానికి సమున్నత స్థానం.. ప్రాధాన్యతా రంగాలకు పెద్దపీట.. వెరసి రాష్ట్ర బడ్జెట్‌ ప్రగతికి మార్గదర్శిగా కనిపిస్తోంది.. పంట రుణ మాఫీ కోసం నిధులు.. దళితబంధుకు దండిగా కాసులు.. నడుస్తున్న పథకాలను మురిపించేలా రూ.కోట్లు.. వివిధ రంగాలకు ప్రత్యేక కేటాయింపులతో రాష్ట్ర పద్దు మురిపించింది. 

Published : 07 Feb 2023 06:03 IST

వ్యవసాయానికి పెద్దపీట.. కీలక రంగాలకు ప్రాధాన్యం
రాష్ట్ర బడ్జెట్‌లో ఉమ్మడి జిల్లాకు ప్రత్యేక వరాల్లేవు
ఈనాడు, కరీంనగర్‌

కర్షక సంక్షేమం.. సాగునీటి రంగానికి సమున్నత స్థానం.. ప్రాధాన్యతా రంగాలకు పెద్దపీట.. వెరసి రాష్ట్ర బడ్జెట్‌ ప్రగతికి మార్గదర్శిగా కనిపిస్తోంది.. పంట రుణ మాఫీ కోసం నిధులు.. దళితబంధుకు దండిగా కాసులు.. నడుస్తున్న పథకాలను మురిపించేలా రూ.కోట్లు.. వివిధ రంగాలకు ప్రత్యేక కేటాయింపులతో రాష్ట్ర పద్దు మురిపించింది.  ఉమ్మడి జిల్లాకు ప్రత్యేకించి వరాల జల్లు కురియకున్నా, అభివృద్ధి రథానికి అవసరమైన ఇం‘ధనాన్ని’ అందించే   నిర్ణయాలు వెల్లడయ్యాయి. ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో ఉమ్మడి జిల్లాకు ఒనగూరే ప్రయోజనాలపై  ‘ఈనాడు’ ప్రత్యేక కథనం.


అన్నదాత అభ్యున్నతికి..

బడ్జెట్‌లో సింహభాగంగా వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.26,831 కోట్లు కేటాయించగా, మన వాటాగా రూ.2,981 కోట్లు రానున్నాయి. రైతుబంధుకు రూ.15,075 కోట్లు, బీమా పథకానికి రూ.1,589 కోట్లు కేటాయించారు. నాలుగు జిల్లాల పరిధిలో 14 లక్షల ఎకరాల్లో 6.62 లక్షల మంది రైతులు వివిధ పంటలు సాగు చేస్తున్నారు. ఇప్పటివరకు రైతు బీమా కింద 8,145 కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందింది.


దారులు మెరుగయ్యేలా..

రహదారులపై ఇక్కట్లు తీరేలా కాసుల కరుణ కురిసింది. వర్షాలకు అధికంగా రోడ్లు పాడైన జిల్లాల్లో ఉమ్మడి కరీంనగర్‌ అగ్రపథంలో ఉంది. రహదారులు భవనాలు, పంచాయతీరాజ్‌ శాఖలకు భారీ కేటాయింపులతో ప్రయాణికుల కష్టాలు తీరనున్నాయి. రెండు శాఖల పరిధిలో నాలుగు జిల్లాల్లో 9,896 కి.మీ.ల మేర రహదారులున్నాయి. ఇందులో సగానికి పైగా కంకర తేలి అధ్వాన స్థితికి చేరాయి.


ఆయకట్టుకు జీవం

ప్రాజెక్టుల జిల్లా కావడంతో నీటిపారుదల రంగానికి నిధుల అవసరం ఎక్కువగానే ఉంటుంది. బడ్జెట్‌లో రూ.26,885 కోట్లు కేటాయించగా మన జిల్లాలోని మూడో టీఎంసీ పనులకు, కాళేశ్వరం ప్రాజెక్టు కొసరు పనులకు, మోతె వాగు ప్రాజెక్టు, నారాయణపూర్‌ రిజర్వాయర్‌కు కొంత మొత్తంగా సాయమందనుంది. ఇక పెండింగ్‌లో ఉన్న చెక్‌డ్యామ్‌ల నిర్మాణం పనులకు రూ.200 కోట్ల వరకు రానున్నాయి. కాకతీయ, వరదకాలువ పునరుద్ధరణ పనులు సహా నీటిపారుదల రంగంలోని ఇతర మరమ్మతులకు మరికొంత సొమ్ము దక్కనుంది.


క్రమబద్ధీకరణ జోష్‌!

ఏప్రిల్‌ నుంచి కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసును క్రమబద్ధీకరిస్తామని ప్రకటించడంతో నాలుగు జిల్లాల పరిధిలోని దాదాపు 1500 మందికి ప్రయోజనం కలగనుంది. సెర్ప్‌ ఉద్యోగుల పేస్కేల్‌ను సవరిస్తామని చెప్పడంతో 500 మందికి మేలు జరగనుంది. కొలువుల భర్తీ, కొత్త ఉద్యోగుల వేతనాల కోసం రూ.వెయ్యి కోట్ల కేటాయింపు హామీతో యువతలో ఉత్సాహం నింపింది. గ్రూప్‌-4 కోసం దాదాపు 62 వేల మంది దరఖాస్తు చేసుకొని సన్నద్ధమవుతున్నారు.


ఆయిల్‌పామ్‌ సాగుకు ప్రోత్సాహం

ఆయిల్‌పామ్‌ సాగుకు రూ.వెయ్యి కోట్లు కేటాయించగా జిల్లా వాటాగా రూ.111 కోట్లు రానున్నాయి. నాలుగేళ్లల్లో లక్ష ఎకరాలకు పైగా మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఏడాది మార్చి వరకు 13,163 ఎకరాల లక్ష్యంలో సగానికిపైగా పురోగతి ఉంది. కొత్తగా 7,489 ఎకరాల్లో సాగుకు రైతులు డీడీలు చెల్లించారు.


విద్య, వైద్యానికి తోడ్పాటు

విద్యా శాఖకు రూ.19,093 కోట్లు కేటాయించగా ఉమ్మడి జిల్లాకు రూ.1909 కోట్లు రానున్నాయి. ‘మన ఊరు-మన బడి’ పెండింగ్‌ పనులకు నిధుల కొరత తీరనుంది. 2,560 ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 4,70,172 మంది విద్యార్థులకు మౌలిక వసతులు తీరనున్నాయి. బీసీ సంక్షేమానికి భారీగా నిధులు ప్రకటించడంతో గురుకులాలతో పాటు యువతకు రుణాలు అందే వీలుంది. వైద్య రంగానికి రూ.12,161 కోట్లు కేటాయించగా మన వాటాగా రూ.వెయ్యి కోట్ల వరకు రానున్నాయి. కరీంనగర్‌, సిరిసిల్ల జిల్లాల్లో ఈ విద్యా సంవత్సరంలో వైద్య కళాశాలల్లో తరగతులు ప్రారంభమవుతాయి.


17,700 మందికి దళితబంధు

హుజూరాబాద్‌లో పురుడు పోసుకున్న దళితబంధు పథకానికి రూ.17,700 కోట్లు కేటాయించారు. కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున సాయం అందించే పథకంలో పైలట్‌ ప్రాజెక్టు కింద హుజూరాబాద్‌ నియోజకవర్గంలో 18 వేల మంది లబ్ధి పొందారు. మిగతా చోట్ల మొదట 100 మందిని, ఆ తరువాత 500 మందిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 1.77 లక్షల మందికి ఆర్థిక సాయం అందనుండగా ఉమ్మడి జిల్లా వాటాగా 17,700 మంది లబ్ధి పొందనున్నారు. ఈ లెక్కన ఒక్కో నియోజకవర్గానికి 1,475 మందికి ఆర్థిక భరోసా కలగనుంది.


ప్రత్యేక ప్రగతికి పె‘న్నిధి’

ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి ప్రత్యేక ప్రగతి నిధిని సమకూరుస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఉమ్మడి జిల్లాలో ఈ రెండు వర్గాల జనాభా 6,64,465. అంబేడ్కర్‌ ఓవర్సీస్‌ ఉపకార వేతనం కింద అందించే రూ.20 లక్షల సాయాన్ని ఇప్పటివరకు 10 మంది విద్యార్థులు అందుకున్నారు. ఎస్సీల ప్రత్యేక ప్రగతినిధికి రూ.36,750 కోట్లు, ఎస్టీలకు రూ.15,233 కోట్లు ఇవ్వనున్నారు. దీంతో నాలుగు జిల్లాల్లోని ఎస్సీ, ఎస్టీ కాలనీల అభివృద్ధితో పాటు సంక్షేమానికి బాటలు పడనున్నాయి.

ఎస్సీ సంక్షేమానికి- రూ.36,750 కోట్లు
మన వాటా- రూ.3,675 కోట్లు
ఎస్టీ సంక్షేమానికి - రూ.15,233 కోట్లు
మన వాటా- రూ.1,523 కోట్లు


ఇలా వెన్నుదన్నుగా..

* ప్రజా పంపిణీ బియ్యం పంపిణీకి రూ.3,117 కోట్లు పొందుపర్చగా 1,897 దుకాణాల్లోని 9,88,853 మంది వినియోగదారులకు ప్రయోజనం కలగనుంది.

* ఆసరా పింఛన్లకు రూ.12 వేల కోట్లు కేటాయించగా ఉమ్మడి జిల్లాలో 5,91,316 మంది లబ్ధిదారులున్నారు. ఇందులో మూడు నెలల కిందట ఎంపికైన 50 వేల మంది కొత్త వారున్నారు.

* రుణమాఫీకి రూ.6,385 కోట్లు కేటాయించగా ఉమ్మడి జిల్లా వాటా రూ.709 కోట్లు. ఈ అంశాన్ని గత బడ్జెట్‌లో ప్రస్తావించినా ఆశించిన ఫలితం కనబడలేదు. ఈసారైనా నెరవేరాలని రైతులు కోరుతున్నారు.

* అటవీ శాఖ, హరితహారానికి రూ.1,471 కోట్లు కేటాయించగా మన వాటాగా రూ.163 కోట్లు దరి చేరతాయి. మొక్కల సంరక్షణతో పాటు నర్సరీల ఏర్పాటుతో జిల్లాల్లో హరిత ప్రగతి మరింతగా కనిపించనుంది.

పురపాలికల అభివృద్ధికి కేటాయించిన రూ.11,372 కోట్లలో మనకు రూ.700కు పైగా వస్తే ప్రగతి కనిపించనుంది. ఉమ్మడి జిల్లాలో రెండు కార్పొరేషన్‌లు, 14 బల్దియాల్లో కలిపి పట్టణ జనాభా 9.51 లక్షలు దాటింది.

*  పంచాయతీరాజ్‌ శాఖకు రూ.31,426 కోట్లు కేటాయించారు. నాలుగు జిల్లాల్లోని 1208 పంచాయతీలు, అనుబంధ గ్రామాల్లో పల్లె జనాభా 16.96 లక్షలను దాటడంతో ప్రగతి అనివార్యంగా మారింది.

* కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలకు రూ.3,210 కోట్లు కేటాయించారు.

* వర్సిటీలకు రూ.500 కోట్లు కేటాయించగా గతంలో శాతవాహన విశ్వవిద్యాలయంలో భవనాల నిర్మాణాలు, మౌలిక వసతుల కల్పనకు పంపిన ప్రతిపాదనల ఆధారంగా రూ.80 కోట్ల వరకు రానున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు