logo

ఆసుపత్రులు ఇబ్బడిముబ్బడి.. కానరాని కట్టడి

అనుమతులుండవు.. నిబంధనలు పట్టించుకోరు.. మౌలిక వసతులు కనిపించవు.. రాత్రికి రాత్రే వివిధ పేర్లతో బోర్డులతో ఇష్టారాజ్యంగా, ఇబ్బడిముబ్బడిగా జిల్లావ్యాప్తంగా కొత్త ప్రైవేటు ఆస్పత్రులను ఏర్పాటు చేస్తున్నారు.

Published : 07 Feb 2023 06:03 IST

ఈనాడు డిజిటల్‌, పెద్దపల్లి

గోదావరిఖనిలోని స్కానింగ్‌ కేంద్రాన్ని పరిశీలిస్తున్న జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు

అనుమతులుండవు.. నిబంధనలు పట్టించుకోరు.. మౌలిక వసతులు కనిపించవు.. రాత్రికి రాత్రే వివిధ పేర్లతో బోర్డులతో ఇష్టారాజ్యంగా, ఇబ్బడిముబ్బడిగా జిల్లావ్యాప్తంగా కొత్త ప్రైవేటు ఆస్పత్రులను ఏర్పాటు చేస్తున్నారు. వైద్యారోగ్య శాఖ నిబంధనల ప్రకారం అన్నీ అనుమతులు వచ్చాకే వైద్య సేవలు ప్రారంభించాల్సి ఉంటుంది. ప్రభుత్వ వైద్యులు ప్రైవేటు వైద్య రంగంలో పోటీ పడుతూ.. అనుమతుల దరఖాస్తు ప్రక్రియ చేయకముందే స్థానిక రాజకీయ నాయకుల అండదండలతో దర్జాగా సేవలు ప్రారంభిస్తూ ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారు.

* రామగుండం, గోదావరిఖని, పెద్దపల్లి, సుల్తానాబాద్‌, మంథని ప్రాంతాల్లో ఇప్పటికే వైద్యసేవలు అందిస్తున్న కొన్ని ప్రైవేటు ఆస్పత్రులకు అనుమతులు లేవని స్వయంగా వైద్యశాఖ ఉన్నతాధికారులే చెబుతుండటం గమనార్హం. ప్రభుత్వ వైద్యులు తమ సమయపాలన ప్రకారం సర్కారు దవాఖానాల్లో అందుబాటులో ఉండాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు పట్టించుకోకుండా తమకు చెందిన ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ బినామీ పేర్లతో అనుమతులకు దరఖాస్తులు చేసుకుని వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.

నోటీసులకే పరిమితం..

* ఈ ఏడాది జనవరి 20న రామగుండంలోని లక్ష్మీనగర్‌ ఓ ఆస్పత్రి పక్కన ఎలాంటి అనుమతులు లేకుండా ఎంఆర్‌ఐ స్కానింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. స్థానికులు కొందరు ఫిర్యాదు చేయడంతో వైద్యారోగ్యశాఖ అధికారులు వెళ్లి తనిఖీలు చేసి ఎలాంటి అనుమతులు లేకపోవడంతో కేంద్రాన్ని సీజ్‌ చేశారు.

* పెద్దపల్లి కూనారం క్రాస్‌ రోడ్డులోని ఓ ఆసుపత్రిని గతంలో అధికారులు తనిఖీలు చేసి  అనుమతులు లేవని నోటీసులు ఇచ్చి మూసేశారు. ఇప్పుడా భవనంలోనే మరో పేరుతో ఆస్పత్రి ఏర్పాటు చేశారు. ఈ ఆస్పత్రికి మాత్రం అన్నీ రకాల అనుమతులు ‘అందజేసినట్లు’ అధికారులు చెబుతుండటం గమనార్హం.

* గత ఏడాది మంథని పురపాలిక పరిధిలో ప్రభుత్వ అనుమతులు లేకుండా కొనసాగుతూ చిన్న పిల్లలకు అనధికారికంగా వైద్యం నిర్వహిస్తున్న ఓ ప్రయివేటు ఆస్పత్రిపై స్థానికులు కొందరు జిల్లా వైద్యఆరోగ్యశాఖకు ఫిర్యాదులు చేశారు.

* జిల్లాలో 135 వరకు ప్రైవేటు ఆస్పత్రులుండగా 40 ప్రైవేటు ఆస్పత్రులకు ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేవని గుర్తించారు. వీటికి పలుమార్లు నోటీసులు పంపించారు. కొందరు స్పందించి ఆన్‌లైన్‌లో అనుమతులు తీసుకుంటుండగా ఇంకొందరు పట్టించుకోకుండా వైద్యం నిర్వహిస్తున్నారు.

* అగ్నిమాపక, కాలుష్యనియంత్రణ బోర్డు, పార్కింగ్‌, విశాలమైన భవనం, సిబ్బంది విద్యార్హతలు అన్నింటికి అనుమతులు తీసుకోవాల్సిందే. ఇలా కాకుండా ఇరుకుగదుల్లో, ఏ వ్యాధికి ఎంత రుసుము వసూలు చేస్తారో? అనే సూచికలు కూడా ఏర్పాటు చేయడం లేదు.

ఆసుపత్రుల బోర్డుపై ఒక వైద్యుడి పేరుతో అనుమతులుంటే ఇంకో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కనీస మౌలిక వసతుల్లేని ప్రైవేటు ఆస్పత్రులు కార్పొరేట్‌ స్థాయి వైద్యశాల రుసుములు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వాసుపత్రులకు వచ్చిన వారిని కూడా మెరుగైన చికిత్సల పేరిట తమ ఆసుపత్రికి ‘రిఫర్‌’ చేస్తు రిజిస్టర్‌ మెడికల్‌ ప్రాక్టీషనర్‌, ప్రైవేటు మెడికల్‌ ప్రాక్టీషనర్లతో వైద్యులతో కమీషన్లు ఏర్పాటు చేసుకుంటున్నారు.  


అన్ని వసతులుంటేనే అనుమతులు
- ప్రమోద్‌కుమార్‌, జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి

జిల్లావ్యాప్తంగా ఈ సంవత్సరం 20 వరకు కొత్త ప్రైవేటు ఆస్పత్రులు అనుమతుల కోసం దరఖాస్తులు చేశారు. పూర్తి స్థాయిలో ఉన్నతాధికారుల సమక్షంలో ఆస్పత్రిని క్షేత్ర స్థాయిలో పరిశీలించిన తర్వాతే అనుమతులు మంజూరు చేస్తున్నాం. అనుమతుల్లేని వాటికి, అనుమతులు వచ్చాక అదనంగా వసతులు, కేంద్రాలు ఏర్పాటు చేసుకున్నవారిని గుర్తించి నోటీసులు ఇచ్చాం. కొందరు స్పందించి ఆన్‌లైన్‌లో అనుమతులు పొందారు. తిరస్కరిస్తున్న వారికి అనుమతులు రద్దు చేస్తున్నాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు