logo

నిండా నీరు.. ముందుకు కదలని తీరు

ఏళ్ల తరబడి ఎగువ మానేరు జలాశయం కాల్వలో పేరుకుపోయిన తుంగ, పిచ్చి మొక్కలు తొలగించడం లేదు. అక్కడక్కడ ఉపాధి కూలీల ద్వారా పూడిక తొలగిస్తూ నామ మాత్రపు చర్యలు చేపడుతున్నారే తప్పా పూర్తిస్థాయిలో పనులు చేపట్టిన దాఖలాలు లేవు.

Published : 07 Feb 2023 06:03 IST

మరమ్మతులకు నోచుకోని ఎగువ మానేరు కాల్వలు, తూంలు
న్యూస్‌టుడే, ముస్తాబాద్‌

ముస్తాబాద్‌ వద్ద కాల్వలో తుంగ, చెత్తాచెదారం

ఏళ్ల తరబడి ఎగువ మానేరు జలాశయం కాల్వలో పేరుకుపోయిన తుంగ, పిచ్చి మొక్కలు తొలగించడం లేదు. అక్కడక్కడ ఉపాధి కూలీల ద్వారా పూడిక తొలగిస్తూ నామ మాత్రపు చర్యలు చేపడుతున్నారే తప్పా పూర్తిస్థాయిలో పనులు చేపట్టిన దాఖలాలు లేవు. నిధుల మంజూరు కోసం అధికారులు ప్రతిపాదనలు పంపుతున్నా వాటికి మోక్షం కలగడం లేదు. ఎగువ మానేరులో జలకళ సంతరించుకొన్నప్పటికీ చివరి ఆయకట్టు వరకు నీరందని పరిస్థితి ఉంది. కాల్వలు, తూంల మరమ్మతులు చేపట్టాలని వేడుకొంటున్నా ఫలితం ఉండటం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గంభీరావుపేట మండలం నర్మాలలో ఎగువ మానేరు జలాశయం ఉంది. దీని సామర్థ్యం 31 అడుగులు కాగా, ప్రస్తుతం 26 అడుగుల వరకు నీరు ఉంది. యాసంగి సాగు కోసం మూడు మండలాల్లోని ఆయకట్టుకు డిసెంబరు 16న ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు కలిసి నీటిని విడుదల చేశారు. కుడి కాల్వ ద్వారా గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్‌ మూడు మండలాల్లోని నర్మాల, కోళ్లమద్ది, కొత్తపల్లి, లింగన్నపేట, మల్లారెడ్డిపేట, బండలింగంపల్లి, గోపాల్‌పల్లె, రాంరెడ్డిపల్లె, కొండాపూర్‌, గూడెం, గూడూరు, నామాపూర్‌, ముస్తాబాద్‌, పోత్గల్‌, తెర్లుమద్ది గ్రామాల ఆయకట్టుకు సాగునీరందుతుంది. మూడు మండలాల్లో కలిపి 13 వేలకు పైగా ఆయకట్టు ఉండగా, అత్యధికంగా ముస్తాబాద్‌ మండలంలోనే 8,556 ఎకరాల ఆయకట్టు ఉంది. ఎగువమానేరు నుంచి తెర్లుమద్ది చివరి ఆయకట్టు వరకు 22 డిస్ట్ర్టిబ్యూటర్‌లు ఉండగా, చిన్న చిన్న డిస్ట్రిబ్యూటర్లు దాదాపు 40 వరకు ఉన్నాయి. కాల్వల ఆనవాళ్లు లేకుండా పోతున్నాయి. కాల్వలు, తూంలు, షట్టర్లు చెడిపోయి ఏళ్లు కావస్తున్నా మరమ్మతులకు నోచుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రంలోని ఎగువ మానేరు కాల్వలో అక్కడక్కడ ఉపాధి హామీ కూలీల ద్వారా పూడిక, పిచ్చి మొక్కలను తొలగించినప్పటికీ మరికొన్ని చోట్ల బాగా పెరిగిపోయాయి. నీరు ముందుకు కదలని పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి సాగు నీరు సాఫీగా పారేందుకు కాల్వలు, తూంల మరమ్మతులు చేపట్టాలని అన్నదాతలు కోరుతున్నారు.

ఏళ్ల తరబడి మరమ్మతులు చేపట్టని తూం


ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి

మాది తెర్లుమద్ది గ్రామం. ఎగువ మానేరు కాల్వ నీటిపై ఆధారపడి రెండెకరాల పొలం సాగవుతుంది. యాసంగి సాగు కోసం ఎగువమానేరు కాల్వ ద్వారా నీరు వదలారు. సంతోషంగా ఉంది. మండల కేంద్రంలోని మురుగు వచ్చి ఎగువ మానేరు కాల్వలో చేరుతుంది. దీంతో చెత్తచెదారం ఇందులో చేరి నీరు కలుషితమతుంది. కాల్వలో అక్కడక్కడ తుంగ, పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగి కొంత ఇబ్బంది తలెత్తుతుంది. ఏళ్ల తరబడి కాల్వలు, తూంలు మరమ్మతులు చేసిన దాఖలాలు లేవు. అధికారులు చొరవ తీసుకొని మరమ్మతులు చేసి పంట చేతికొచ్చే వరకు సాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి.

పుట్ట అశోక్‌, రైతు, తెర్లుమద్ది


ప్రతిపాదనలు పంపించాం

ఎగువ మానేరు కుడి కాల్వ నుంచి తెర్లుమద్ది 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఏడాది క్రితమే కాల్వలు, తూంలు, షట్టర్ల మరమ్మతుల కోసం రూ.50 కోట్లకు ప్రతిపాదనలు పంపించాం. మరో రూ.10 కోట్లకు ప్రతిపాదనలు పంపించేందుకు రంగం సిద్ధం చేస్తున్నాం. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కాగానే కాల్వలు, తూంలు, షట్టర్లు,  ప్రధాన రోడ్డు వెంట ఉన్న ఎగువ మానేరు కాల్వ వంతెనల వద్ద తూంల మరమ్మతులు చేపడతాం. ఉపాధి కూలీల ద్వారా కాల్వలో పెరిగిన తుంగ, పిచ్చి మొక్కలను అక్కడక్కడ తొలగించారు. చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందిస్తున్నాం. రైతులకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ సమస్యలు తలెత్తకుండా చూసుకుంటున్నాం.

వంశీకృష్ణ, ఏఈ, జలవనరులశాఖ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు