logo

15 నుంచి అనాథల అరిగోస దీక్షలు

అనాథల సంక్షేమానికి ఇచ్చిన హామీల అమలులో ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ విఫలమయ్యారని అనాథల హక్కుల పోరాట వేదిక, ఎంఆర్‌పీఎస్‌, ఎంఎస్‌పీ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విమర్శించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు.

Published : 07 Feb 2023 06:03 IST

మాట్లాడుతున్న మందకృష్ణ మాదిగ  

సిరిసిల్ల (విద్యానగర్‌), న్యూస్‌టుడే: అనాథల సంక్షేమానికి ఇచ్చిన హామీల అమలులో ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ విఫలమయ్యారని అనాథల హక్కుల పోరాట వేదిక, ఎంఆర్‌పీఎస్‌, ఎంఎస్‌పీ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విమర్శించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. అనాథల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ఈ నెల 15 నుంచి ‘అనాథల అరిగోస’ పేరుతో దీక్షలు చేపడతామని హెచ్చరించారు. అనాథలకు ప్రత్యేకంగా రిజర్వేషన్లు ఇస్తామని, వారి సంక్షేమం కోసం దేశం గర్వించదగ్గ చట్టాలు తెస్తామన్నారన్నారు. కుల, ఆదాయ సర్టిఫికెట్లు లేక వారు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అనాథ ఆశ్రమాల నిర్వహణను ప్రభుత్వ పరిధిలోకి తెస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. తెలంగాణ ధనిక రాష్ట్రంగా చెబుతూ వారిని ఆదుకోకపోవడం బాధాకరమన్నారు. రైతుబంధు పథకం దేశానికి ఆదర్శం అని గొప్పలు చెప్పుకుంటున్నారని, మంత్రి మల్లారెడ్డి లాంటి వారితో పాటు వందలాది ఎకరాలున్న భూస్వాములకు రైతు బంధు ఇవ్వడం సరికాదని పేర్కొన్నారు. శాసనసభ సమావేశాల్లో వీరి సంక్షేమానికి చట్టం తీసుకురావాలని ఆయన డిమాండ్‌ చేశారు. గజ్వేల్‌ నియోజకవర్గంలో ఇద్దరు అనాథల కష్టాలను చూసి ప్రత్యేక చట్టం తీసుకొస్తామని చెప్పి నేటి వరకు ఆ ఊసే లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోతే ఈ నెల 15 నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ నియోజకవర్గ కేంద్రాల్లో అనాథల అరిగోస దీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ సమావేశంలో మహాజన సోషలిస్టు పార్టీ(ఎంఎస్‌పీ) ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా ఇన్‌ఛార్జి ఇంజం వెంకటస్వామి, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్‌ఛార్జి ఆవునూరి ప్రభాకర్‌, జిల్లా కోఆర్డినేటర్‌ కానపురం లక్ష్మణ్‌, గుండా థామస్‌, రేణుకుంట సాగర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని