logo

మూడు కిలోల గంజాయి పట్టివేత

గంజాయి సరఫరా చేస్తున్న ముఠా సభ్యులను కరీంనగర్‌ పోలీసులు అరెస్టు చేశారు. పట్టుబడిన వారందరూ 27 ఏళ్లలోపు వారే కావడం గమనార్హం. 

Published : 07 Feb 2023 06:03 IST

ఏడుగురు నిందితుల అరెస్టు

వివరాలు వెల్లడిస్తున్న సీపీ సుబ్బారాయుడు

కరీంనగర్‌ నేరవార్తలు, న్యూస్‌టుడే: గంజాయి సరఫరా చేస్తున్న ముఠా సభ్యులను కరీంనగర్‌ పోలీసులు అరెస్టు చేశారు. పట్టుబడిన వారందరూ 27 ఏళ్లలోపు వారే కావడం గమనార్హం.  మూడు కిలోల సరకును స్వాధీనం చేసుకున్నారు. సోమవారం పోలీస్‌ కమిషనరేట్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సీపీ ఎల్‌.సుబ్బారాయుడు వివరాలు వెల్లడించారు. నిషాని హరికృష్ణ, బహదూర్‌ లక్ష్మణ్‌, ఎండీ.అలీ అలియాస్‌ సోను, గంప గోవర్ధన్‌, చెల్పూరి విలాస్‌ (కరీంనగర్‌), నిషాని సాయికృష్ణ (కొత్తపల్లి మండలం ఎలగుందుల), దూళం అభిరాం (బావుపేట) వేర్వేరు వృత్తులు చేసుకుంటూ జీవిస్తున్నారు. గంజాయికి అలవాటుపడిన వీరు ముఠాగా ఏర్పడి వక్రమార్గంలో డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా సీలేరు ప్రాంతం సుబ్బారావు అనే వ్యక్తి నుంచి 20 కిలోల గంజాయిని కొనుగోలు చేసి 17 కిలోలు విక్రయించారు. బహదూర్‌ లక్ష్మణ్‌, ఎండీ అలీ, గంప గోవర్ధన్‌, చెల్పూరి విలాస్‌ ఒక జట్టుగా ఏర్పడి కరీంనగర్‌లోని శివాజీనగర్‌లో 1.5 కిలోల సరకును సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నిషాని హరికృష్ణ, సాయికృష్ణ, దూలం అభిరాం మరో జట్టుగా ఏర్పడి కరీంనగర్‌ మల్కాపూర్‌ శివారులో 1.5 కిలోల గంజాయితో ఉన్నారు. టాస్క్‌ఫోర్స్‌, కరీంనగర్‌ రూరల్‌, కొత్తపల్లి పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని సరకును స్వాధీనం చేసుకున్నారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సమావేశంలో టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ విజయసారథి, ఇన్‌స్పెక్టర్లు వెంకటేశ్వర్లు, విజ్ఞాన్‌రావు, సృజన్‌రెడ్డి, ఎస్సై సాంబమూర్తి ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని