logo

అద్దె భవనంలో గ్రంథాలయం

ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయడంతో పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్నారు.

Published : 08 Feb 2023 05:56 IST

న్యూస్‌టుడే, రాయికల్‌

రాయికల్‌లో అద్దె భవనంలో కొనసాగుతున్న గ్రంథాలయం

ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయడంతో పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్నారు. రాయికల్‌ మండల వ్యాప్తంగా సుమారు 65 వేల జనాభా ఉండగా సుమారు 8 వేల మంది యువత ఉద్యోగాల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. రాయికల్‌ పట్టణంతో పాటు 32 గ్రామాలకు రాయికల్‌లోని గ్రంథాలయమే దిక్కు. పోటీపరీక్షలకు సన్నద్ధం కావడానికి అవసరమైన సామగ్రి అందుబాటులో లేదు. 30 ఏళ్లుగా ఇరుకు గదులలో నిర్వహించిన రాయికల్‌ గ్రంథాలయాన్ని ఇటీవల తహసీల్దారు కార్యాలయం సమీపంలోని ఓ ఇంటిలో రెండు గదులు అద్దెకు తీసుకుని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అద్దె భవనంలో కొనసాగుతున్నప్పటికి వసతులు, పోటీ పరీక్షలకు ఉపయోగపడే పుస్తకాలను అందుబాటులో ఉంచాలని యువత కోరుతున్నారు. పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి పట్టణ ప్రాంతాలకు వెళ్లలేని నిరుద్యోగులు, మహిళలు, నిరుపేద యువత గ్రంథలాయాలపై ఆధారపడతారు. 

నూతన భవనం నిర్మాణం ఎప్పుడో!

రాయికల్‌ పట్టణంలో సుమారు దశాబ్దలుగా గ్రంథాలయం అద్దె భవనంలోనే కొనసాగుతోంది. మూడేళ్ల కిందట రాయికల్‌ గ్రామ పంచాయతీ నుంచి పురపాలికగా మారినా గ్రంథాలయం భవన నిర్మాణం చేపట్టడం లేదు. ఏటా పన్నుల రూపంలో వసూలు చేసిన మొత్తాన్ని పురపాలిక అధికారులు గ్రంథాలయానికి అందజేస్తున్నా వసతుల కల్పన చేపట్టడం లేదు. పట్టణంలో గ్రంథాలయానికి స్థలం కేటాయిస్తే నిధులు మంజూరు చేసి భవన నిర్మాణం చేపట్టాల్సి ఉంది. యువతకు, చిన్నారులకు ఉపయోగపడే గ్రంథాలయాలను అభివృద్ధి చేసి అందుబాటులోకి తీసుకురావాలని మండల వాసులు కోరుతున్నారు.


పోటీ పరీక్షల పుస్తకాలు లేవు..

- ఆడెపు రాజీవ్‌, రాయికల్‌

ఉద్యోగ నోటిఫికేషన్లు రావడంతో వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధం కావడానికి గ్రంథాలయంలో పుస్తకాలు అందుబాటులో లేక ఇబ్బందిగా మారింది. రాయికల్‌ గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలను అందుబాటులో ఉంచాలి. కుర్చీలు, ఇతర వసతులు కల్పించాలి.


వసతులు కల్పించాలి..

- మహిపాల్‌రెడ్డి, జిల్లా యువజన కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి

రాయికల్‌ గ్రంథాలయానికి సొంత భవన నిర్మాణం చేపడితే మండల వాసులకు ఉపయోగకరంగా ఉంటుంది. ఏళ్లుగా అద్దె భవనాల్లోనే కొనసాగడంతో పాఠకులకు ఇబ్బందిగా మారింది. ఒకే సమయంలో వచ్చే పాఠకులకు చదవడానికి వసతులు లేక అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం స్పందించి నూతన భవనంతో పాటు వసతులు కల్పించాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని