logo

16 శాతం సంగతేంటి?

జిల్లాలో 2021-22 వానాకాలం సీజన్‌కు సంబంధించిన కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌(సీఎంఆర్‌) సేకరణ లక్షం ఇప్పటి వరకు చేరుకోలేదు.

Published : 08 Feb 2023 05:56 IST

జిల్లాలో 84 శాతం పూర్తయిన సీఎంఆర్‌
న్యూస్‌టుడే, మెట్‌పల్లి

ఓ మిల్లులో బియ్యం

జిల్లాలో 2021-22 వానాకాలం సీజన్‌కు సంబంధించిన కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌(సీఎంఆర్‌) సేకరణ లక్షం ఇప్పటి వరకు చేరుకోలేదు. పౌరసరఫరాల శాఖ సేకరించిన వరి ధాన్యాన్ని మిల్లింగ్‌ చేసేందుకు ఇచ్చిన గడువు ముగిసి పోయినా ఇంత వరకు కొందరు మిల్లర్లు బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించలేదు. తాకీదులు ఇచ్చినా, అదనపు కలెక్టర్‌ లత సమావేశాలు నిర్వహించి హెచ్చరిస్తునా మిల్లర్లు స్పందించడంలేదు. గత నెల గడువు ముగిసే నాటికి మిల్లర్లు 84 శాతం బియ్యాన్ని మాత్రమే చెల్లించారు. ఇంకా 16 శాతం బియ్యాన్ని అప్పగించాల్సి ఉందని అధికారులు పేర్కొంటున్నారు. 16 శాతం సీఎంఆర్‌ బియ్యంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో ఇటు మిల్లర్లు అటు అధికారుల్లో అయోమయం నెలకొంది.

మిల్లింగ్‌ చేయకుండానే..

విద్యుత్తు ఖర్చు ఉండదు, కార్మికులతో పని లేకుండా పలువురు వ్యాపారులు పైసా ఖర్చు చేయకుండా పభుత్వం కేటాయించిన ధాన్యం మిల్లింగ్‌ చేయకుండానే అమ్మేస్తున్నారు. తరుగు పేరుతో రైతులు నష్టపోతుండగా మిల్లర్లు మాత్రం నయాపైసా పెట్టుబడి పెట్టకుండా సొమ్ము చేసుకుంటున్నారు. మర ఆడించకుండానే ధాన్యాన్ని మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలకు తరలించి అమ్ముకుంటుండగా మరి కొందరు ధాన్యాన్ని బియ్యంగా మార్చి ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారని తెలుస్తోంది. బియ్యం అప్పగించాలని అధికారులు ఒత్తిడి తెచ్చినప్పుడు పీడీఎస్‌ బియ్యాన్ని సేకరించి సీఎంఆర్‌ కింద అప్పగిస్తున్నారు. కేటాయింపులు జరిగినప్పటి నుంచి నెల రోజుల లోపు బియ్యం ఇవ్వాలి. కానీ కొందరు ఇచ్చిన ధాన్యంతో వ్యాపారం చేస్తూ బియ్యం అప్పగించకుండా సంవత్సరాలు గుడుపతున్నారు. ఒక సీజన్‌లో సీఎంఆర్‌ ధాన్యం తీసుకుని దాంతో వ్యాపారం చేసుకుంటున్నారు. మరో సీజన్‌లో కేటాయించిన ధాన్యాన్ని మర ఆడించి బియ్యం అప్పగిస్తున్నారు. ఎప్పటికప్పుడు బియ్యం పరీక్షించి తీసుకోవల్సిన అధికారులు దాన్ని పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. రాజకీయ నాయకులు, అధికారుల అండతో పలువురు మిల్లుల నిర్వాహకులు అక్రమ దందాకు పాల్పడుతున్నారన్న అభిప్రాయాలున్నాయి. మరో రెన్నెళ్లలో యాసంగి ధాన్యం మార్కెట్కు రానుంది.

రెండు పర్యాయాలు పొడిగింపు

జిల్లాలో వానాకాలం సీజన్‌కు సంబంధించి కొనుగోలు కేంద్రాల ద్వారా 3,25,444 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. వాటిని జిల్లాలోని 72రా, 63 పారా బాయిల్డ్‌ రైసు మిల్లులకు మరపట్టి బియ్యంగా మార్చేందుకు అధికారులు అప్పగించారు. ప్రభుత్వం 100 కిలోల ధాన్యం ఇస్తే మర ఆడించి 67 కిలోల బియ్యం ఇవ్వాల్సి ఉంటుంది. మిల్లింగ్‌ చేసినందుకు ప్రభుత్వం మిల్లర్లకు మిల్లింగ్‌ ఛార్జీలు ఇస్తుంది. గత నవంబర్‌లో గడువు ముగియగా బియ్యం అప్పగించడానికి రెండు పర్యాయాలు అవకాశం ఇచ్చారు. డిసెంబర్‌ 31తో చెల్లించడానికి అవకాశం ఇచ్చారు. మళ్లీ జనవరి చివరి వరకు గడువు పొడిగించారు. మిల్లర్లు 84 శాతం బియ్యాన్ని మాత్రమే అప్పగించారు. ఇంకా 80 మంది రా మిల్లుల నిర్వాహకులు 34 వేల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని ఇవ్వాల్సి ఉంది. గత వేసంగి సీజన్‌కు సంబంధించి 94,842 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని మిల్లర్లు అప్పగించలేదు. గత నెలలో ధాన్యం అప్పగించిన మిల్లుల్లో తనిఖీలు చేయగా తక్కువ నిలువలు ఉన్న రెండు రైసు మిల్లులను బ్లాక్‌ లిస్టులో పెట్టారు.


ప్రభుత్వ ఆదేశాల మేరకు..

- చందన్‌కుమార్‌, జిల్లా పౌరసరఫరా శాఖ అధికారి, జగిత్యాల

వానాకాలం సీజన్‌ సీఎంఆర్‌ బియ్యం అప్పగించాల్సిన గడువు గత నెలతో ముగిసింది. ఇంకా 80 మంది రా మిల్లుల నిర్వాహకులు 34 వేల మెట్రిక్‌ టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉంది. మళ్లీ గడువు పొడిగించే అవకాశం లేదు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావాల్సి ఉంది. ఆ మేరకు చర్యలు చేపడతాం. ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి అవకతవకలకు పాల్పడిన మిల్లుల నిర్వాహకులపై చర్యలు చేపట్టాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు