logo

గ్రామాల వారీగా లక్ష్య నిర్దేశనం

ఉపాధి హామీ పథకం పనుల అమలులో కేంద్ర ప్రభుత్వం సమూల మార్పులను చేపట్టడంతో కూలీల సంఖ్య తగ్గుతుంది.

Published : 08 Feb 2023 05:56 IST

న్యూస్‌టుడే, సారంగాపూర్‌

40 మందికి తగ్గకుండా కూలీలు

ఉపాధి హామీ పథకం పనుల అమలులో కేంద్ర ప్రభుత్వం సమూల మార్పులను చేపట్టడంతో కూలీల సంఖ్య తగ్గుతుంది. దీనిని నిలవరించేందుకు అధికారులు సిబ్బందికి గ్రామాల వారీగా లక్ష్యాన్ని నిర్దేశించారు. ప్రతి పంచాయతీలో కనీసం 40 మంది కూలీలు తగ్గకుండా పనులకు వెళ్లేలా చూడాలని ఉన్నాతాధికారులు సిబ్బందికి మౌఖికంగా ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా పనుల వద్దకు వెళ్లి చరవాణిలో కూలీల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంటుందని, ఆయా కూలీలకు అనుగుణంగా తగినన్ని పనులు ఉండేలా చూసుకోవాలని సూచించారు. ఇందుకు గ్రామాల్లో ప్రత్యేకంగా కూలీలు పనులకు వెళ్లేలా అవగాహన కల్పించాలని కోరారు. ఏటా వేసవిలో అందించే అదనపు భత్యం గతేడాది నుంచి నిలిపివేశారు. గతేడాది నుంచి కేంద్ర ప్రభుత్వం ఎన్‌ఎంఎంఎస్‌(నేషనల్‌ మొబైల్‌ మానిటరింగ్‌) ద్వారా ఉపాధి పనుల నిర్వహణ కొనసాగిస్తున్నారు. దీని ద్వారా ఏటా వేసవిలో అందించే అదనపు భత్యం సాఫ్ట్‌వేర్‌లో తొలగించడంతో వేసవి భత్యం అందక కూలీలు నిరాశ చెందుతున్నారు. దీని ద్వారా జిల్లా వ్యాప్తంగా 1,66,000 కుటుంబాలకు జాబ్‌ కార్డులు ఉండగా 2,70,579 మంది కూలీలు ఉన్నారు. ఇందులో ఎస్సీలు 69,655, ఎస్టీలు 12,161, ఇతరులు 1,88,763 మంది కూలీలు ఉండగా, 1,56,206 మహిళ కూలీలు ఉన్నారు. యాక్టివ్‌ కుటుంబాలు 1,08,802 ఉండగా 1,50,684 కూలీలు పనులకు వెళ్తున్నారు. ఆయా కూలీలకు వేసవి అదనపు భత్యం అందకుండా పోతుంది.

అందని వేసవి అదనపు భత్యం

ప్రతి వేసవిలో ఉపాధి హామీ పథకం పనులకు వచ్చే కూలీలకు ఉపాధి వేతనంతోపాటు వేసవి భత్యం అందిస్తుండేవారు. వేసవి తీవ్రతను పరిగణనలోకి తీసుకుని నేల స్వభావం గట్టిగా ఉంటుందని ఏటా వేసవిలో అదనంగా చెల్లిపులు చేస్తుండేవారు. దీని దృష్టిలో ఉంచుకుని ఫిబ్రవరిలో 20 శాతం, మార్చిలో 25 శాతం, ఏప్రిల్‌, మే నెలలో 30 శాతం, జూన్‌లో 20 శాతం కూలీతోపాటు అదనంగా అందించేవారు. గత ఏడాది నుంచి అదనపు భత్యం రాకపోవడంతో కూలీలు పనులకు వెళ్లేందుకు ఆసక్తి చూపడంలేదు. వాస్తవానికి ఏటా ఫిబ్రవరి నుంచి జూన్‌ వరకు వ్యవసాయ పనులు ఉండకపోవడం, వేసవిలో అదనపు భత్యం వస్తుండడంతో కూలీల సంఖ్య పెరుగుతుంది. మార్చి, ఏప్రిల్‌, మే నెలలో మరింత కూలీల సంఖ్య పెరుగుతుండడంతో అదనపు భత్యం చెల్లించాలని కూలీలు కోరుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని