logo

డంపింగ్‌ యార్డుపై నిర్లక్ష్యం

హుజూరాబాద్‌ పురపాలికలో డంపింగ్‌ యార్డుకు మోక్షం లభించడం లేదు. స్థలం కేటాయించినా.. నిధులున్నా నిర్లక్ష్యమే అలుముకుంది.

Published : 08 Feb 2023 05:56 IST

న్యూస్‌టుడే, హుజూరాబాద్‌

జూరాబాద్‌లో ఏళ్ల తరబడి నిర్మాణంలో ఉన్న డంపింగ్‌ యార్డు

హుజూరాబాద్‌ పురపాలికలో డంపింగ్‌ యార్డుకు మోక్షం లభించడం లేదు. స్థలం కేటాయించినా.. నిధులున్నా నిర్లక్ష్యమే అలుముకుంది. పనులు ప్రారంభించి మూడేళ్లు దాటినా ముందుకు సాగక అందుబాటులోకి రావడం లేదు. దీంతో తడి, పొడి చెత్తను వేరు చేసి సేంద్రియ ఎరువుగా మార్చాలని ప్రభుత్వం నిర్దేశించినా ఇక్కడమాత్రం అమలుకు నోచుకోవడం లేదు. అధికారుల పర్యవేక్షణ లోపం.. గుత్తేదారు నిర్లక్ష్యం వల్లే పనుల్లో ప్రగతి కనిపించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇలాగైతే స్వచ్ఛ లక్ష్యం ఎలా నెరవేరుతుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

మూడేళ్లు దాటినా..

హుజూరాబాద్‌ పురపాలికలోని 30 వార్డుల్లో 49,305 జనాభా ఉండగా 9,351 నివాసగృహాలు ఉన్నాయి. రోజూ 20 వేల మెట్రిక్‌ టన్నుల చెత్తను సేకరిస్తున్నారు కానీ.. డంపింగ్‌ యార్డు లేకపోవడంతో మొన్నటి వరకు పట్టణంలో సేకరించిన చెత్తను ఇప్పలనర్సింగాపూర్‌, సిర్సపల్లి ప్రధాన రహదారులకు ఇరువైపులా జనావాసాల మధ్య పడేశారు. విపరీతమైన దుర్గంధం వెదజల్లుతుండటంతో స్థానికుల అభ్యంతరంతో గతంలో డంపింగ్‌ యార్డు కోసం కేటాయించిన కొత్తపల్లి శివారులోని ఖాళీ స్థలంలో పారబోస్తున్నారు. హుజూరాబాద్‌ పురపాలికలోని ఇప్పలనర్సింగాపూర్‌లో అయిదెకరాల స్థలాన్ని కేటాయించి రూ.2.18 కోట్ల అంచనా వ్యయంతో మూడేళ్ల క్రితం పనులను ప్రారంభించారు. పొడి చెత్త కోసం రూ.38 లక్షలతో నిర్మిస్తున్న డ్రై రిసోర్స్‌ సెంటర్‌(డీఆర్సీ) ఫిల్లర్ల స్థాయిలోనే ఉంది. బయోమైనింగ్‌ ద్వారా తడి చెత్తను శుద్ధి చేసి తడి చెత్తను సేంద్రియ ఎరువుగా మార్చేందుకు రూ.12 లక్షలతో చేపడుతున్న మూడు వర్మీకంపోస్టు షెడ్ల నిర్మాణ పనులు ఇంకా పూర్తి కాలేదు. వేబ్రిడ్జి, ఇతర పనులకు రూ.12 లక్షలు కేటాయించినా ఇంకా టెండర్లు పిలువలేదు. అంతర్గత రహదారులకు రూ.18 లక్షలు, రూ.7.50 లక్షలతో డంపింగ్‌ యార్డుకు వెళ్లే రహదారి నిర్మాణ పనులు చేయాల్సి ఉంది. రూ.15 లక్షలతో డ్రైనేజీ నిర్మించినా ఇంకా పూర్తిస్థాయిలో పనులు కాలేదు. మొత్తం నిధుల్లో ప్రహరీ నిర్మాణానికే రూ.50 లక్షలు ఖర్చు చేయడం గమనార్హం. మొత్తంగా మూడేళ్లు దాటినా 50 శాతం పనులు కూడా పూర్తి కాలేదు. సకాలంలో బిల్లులు చెల్లించక పనులు పూర్తి చేయడం లేదని గుత్తేదారు చెబుతున్నారు. కాగా రెండు నెలల్లో పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని మున్సిపల్‌ ఏఈ సాంబరాజు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని