logo

కాసుల కష్టం.. నిర్మాణాలకు నష్టం

పేదల సొంతింటి కల రెండు పడకగదుల ఇళ్ల రూపంలో తీరడమనేది జిల్లాలో కష్టసాధ్యమైన ప్రక్రియగా మారింది.

Published : 08 Feb 2023 05:56 IST

రెండుపడక గదుల ఇళ్ల పురోగతికి అవరోధం
ఈనాడు, కరీంనగర్‌ న్యూస్‌టుడే- కరీంనగర్‌ పట్టణం

‘‘మేడమ్‌.. గుత్తేదారులు ఎవరు ముందుకు రావట్లేదు. కొసరు పనులతో ఉన్న ఇళ్లను మాత్రం పూర్తిచేయిస్తాం. క్షేత్రస్థాయిలో రెండు పడకగదుల ఇళ్ల నిర్మాణం చాలా కష్టమవుతోంది. నిర్మాణదారులు మధ్యలోనే వదిలేసి వెళ్లిపోతున్నారు. ఏం చేయలేకపోతున్నాం.’’

జడ్పీ స్థాయీ సంఘ సమావేశాల్లో చైర్‌పర్సన్‌ ఎదుట ర.భ.శాఖ ఇంజినీరింగ్‌ అధికారి ఆవేదన

పేదల సొంతింటి కల రెండు పడకగదుల ఇళ్ల రూపంలో తీరడమనేది జిల్లాలో కష్టసాధ్యమైన ప్రక్రియగా మారింది. కొంచెం అటూ ఇటూగా దశాబ్ద కాలం నుంచి ఆగుతూ.. సాగుతున్న వీటి నిర్మాణాల విషయంలో గుత్తేదారులు బెంబేలెత్తుతున్నారు. బాబోయ్‌.. ఈ నిర్మాణాలు మావల్ల కాదనేలా చేతులెత్తేస్తున్నారు. సకాలంలో బిల్లులు అందక.. అందే బిల్లులు నిర్మాణాలకు సరిపడక నష్టాల బాట పడుతున్నామని బోరుమంటున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాలతోపాటు పట్టణ ప్రాంతాల్లో మంజూరైన వేలాది ఇళ్ల నిర్మాణాల ప్రక్రియ ముందుకు కదలడం లేదు. పునాదిస్థాయి దాటని తీరుతో చాలాచోట్ల ఇవి అందని ద్రాక్షగానే మారిపోయాయి.

ఎక్కడెక్కడ ఎలా..?

* జిల్లా వ్యాప్తంగా 6,494 ఇళ్లు మంజూరైనా పాలనాపరమైన అనుమతులు అందుకున్న వాటి సంఖ్య 6,360. గ్రామాల్లో రూ.5.04 లక్షలు, పట్టణాల్లో రూ.5.30 లక్షల వ్యయంతో వీటిని నిర్మించేందుకు అప్పట్లో రూ.390.56కోట్లు అంచనా వేశారు. కాలక్రమంగా పెరిగిన ధరలతో నిర్మాణాలు గుత్తేదారులకు గిట్టుబాటు అవడం లేదు.
* మొత్తంగా 789 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. మరో 1,743 నిర్మాణదశలో వివిధ స్థాయిలో ఉన్నాయి. 4,907 ఇళ్లకు అగ్రిమెంట్‌  పూర్తయింది. 2,138 ఇళ్లకు అసలు నిర్మాణానికి అవసరమైన పునాదులు కూడా పడలేదు. పునాదుల స్థాయిలో 32, బీమ్‌ దశలో 301, రూఫ్‌లెవల్‌లో 183, గోడల దశలో 104, చివరి పనుల్లో 922 ఉన్నాయి.
* హుజూరాబాద్‌ నియోజకవర్గంలో 264 పూర్తవగా 950 పురోగతిలో ఉన్నాయి. 187 చోట్ల అసలు పని ప్రారంభించలేదు. చొప్పదండి నియోజకవర్గంలో 497కుగానూ 243 పూర్తయ్యాయి. 20 పురోగతిలో ఉండగా 23చోట్ల నిర్మాణాల ఊసేలేదు. మానకొండూర్‌లో 789 పూర్తవగా మిగతా 223 ఇళ్లకు నిర్మాణ గ్రహణం పట్టుకుంది.  


ఇలా.. పునాదులు పడి ఫిల్లర్ల స్థాయిలో అలంకారప్రాయంగా ఉన్న చోట ఈపాటికే బహుళ అంతస్థుల్లో రెండుపడక గదుల ఇళ్లు పూర్తవ్వాల్సి ఉంది. తిమ్మాపూర్‌ మండలం రామకృష్ణాపూర్‌ కాలనీలో 2017 నవంబరు 18న స్థానిక ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ శంకుస్థాపన చేశారు. రూ.1.88 కోట్ల వ్యయంతో రెండంతస్థుల్లో నిర్మించాలనుకున్న వీటికి ఐదేళ్లు దాటినా ఇంకా ఒక్క ఇటుకని ఇక్కడ పెట్టే సాహసాన్ని చేయలేకపోతున్నారు. పదుల సంఖ్యలో వీటి పురోగతి కోసం సమీక్షలను నిర్వహించినా.. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనేలా పరిస్థితి మారిపోయింది.


ఇవీ.. కరీంనగర్‌ శివారులోని చింతకుంట సమీపంలో నిర్మిస్తున్న ఇళ్లు. బహుళ అంతస్థుల్లో నిర్మితమవుతున్న వీటి కోసం ఇప్పటికే వేలసంఖ్యలో అర్జీలు కలెక్టరేట్‌కు అందాయి. అపార్ట్‌మెంట్‌ సంస్కృతిని కళ్లకుగట్టేలా.. ఇందులో 660 మంది లబ్ధిదారులు ఉండేందుకు వీలుగా వీటిని నిర్మిస్తున్నారు. సరైన పర్యవేక్షణ లేకపోవడంతో దాదాపుగా మూడేళ్లుగా ఇక్కడి కొసరు పనులు నింపాదిగా జరుగుతున్నాయి. ఎన్నికలు జరిగే ఏడాది అవడంతో మరో ఐదారు నెలల్లో లబ్ధిదారులకు వీటిని అందిస్తే పలువురు పేదలకు సొంతింటి కల సాకారమయ్యే అవకాశముంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు