logo

వరి సాగుకే అన్నదాత మొగ్గు

జిల్లాలో యాసంగి (రబీ) సీజన్‌ వరినాట్లు పూర్తయ్యాయి. వరిసాగుపై ప్రభుత్వం ఆంక్షలను ఎత్తేయడంతో ఈసారి కూడా అన్నదాతలు వరి పంటకే ప్రాధాన్యత ఇచ్చారు.

Published : 08 Feb 2023 06:14 IST

జిల్లాలో పూర్తయిన నాట్లు
న్యూస్‌టుడే, ఎల్లారెడ్డిపేట

ఎల్లారెడ్డిపేటలో సాగు చేసిన వరి పంట

జిల్లాలో యాసంగి (రబీ) సీజన్‌ వరినాట్లు పూర్తయ్యాయి. వరిసాగుపై ప్రభుత్వం ఆంక్షలను ఎత్తేయడంతో ఈసారి కూడా అన్నదాతలు వరి పంటకే ప్రాధాన్యత ఇచ్చారు. వరినాట్లు వేసే ప్రక్రియ పూర్తి కాగా రైతులు ఎరువుల యాజమాన్యంపై ప్రత్యేక దృష్టిసారించాలని వ్యవసాయశాఖ అధికారులు పేర్కొంటున్నారు. మోతాదుకు మించి యూరియా వాడితే ఆర్థికభారంతోపాటు పంటకు నష్టం కలుగుతుందని చెబుతున్నారు. వ్యవసాయశాఖ అధికారుల సిఫారసు మేరకు ఎరువులను వినియోగించాలని సూచిస్తున్నారు.

మెట్టప్రాంతమైన జిల్లాలో వర్షాలు పుష్కలంగా కురవడంతో నీటి వనరులు జలకళను సంతరించుకున్నాయి. రాజరాజేశ్వర, అన్నపూర్ణ, ఎగువమానేరు జలాశయాలు పూర్తిస్థాయి నీటి మట్టాన్ని సంతరించుకున్నాయి. వీటితోపాటు 625 చెరువుల్లో దాదాపు అన్ని చెరువులు పూర్తిగా నిండిపోయి మత్తడి పారాయి. భూగర్భజల మట్టాలు భారీగా వృద్ధిచెందాయి. జిల్లాలో వ్యవసాయానికి పెద్ద దిక్కుగా నిలుస్తున్న 47,568 బావులు, బోరుబావుల్లో పాతాళగంగ ఉబికి వచ్చింది. జనవరిలో జిల్లా సగటు భూగర్భజల మట్టం 6.43 మీటర్లగా నమోదైంది. చెరువుల నుంచి ఆయకట్టు భూములకు నీటిని వదిలారు. సాగునీరు సమృద్ధిగా లభించడంతో సాగుకు అనుకూల వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో రైతాంగం ఎన్నో ఆశలతో యాసంగి సాగుకు శ్రీకారం చుట్టింది. జిల్లాలో మొత్తం 1,72,465 ఎకరాల్లో అన్ని రకాల పంటలు సాగవగా అత్యధికంగా వరి 1,70,451 ఎకరాల్లో వేశారు. వరినాట్లు పూర్తవగా పంటల యాజమాన్య పద్ధతులను రైతులు పాటిస్తున్నారు. అయితే యూరియాను అధిక మోతాదులో వాడటం వల్ల వరికి కీడు తప్పా మేలేమీ ఉండదని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. అవసరం మేరకే వినియోగించాలని అంటున్నారు. సరైన పద్ధతుల్లో వాడితే వరికి ఉపయోగకరంగా ఉంటుందని చెబుతున్నారు.


సిఫారసు చేసిన మోతాదులోనే యూరియా వాడాలి

సిఫారసు చేసిన మోతాదులోనే యూరియా వాడాలి. ఎకరం విస్తీర్ణానికి సుమారు వంద కిలోలను మూడు భాగాలుగా చేసుకొని నాట్లు వేసిన 15 రోజులకు ఒకసారి చొప్పున మూడుసార్లు పంటకు అందించాలి. చివరి దఫాలో 45 రోజులకు ఎకరానికి 30 కిలోల పొటాష్‌ను కలిపి యూరియా వేస్తే గింజ బరువు, రోగ నిరోధకశక్తి పెరుగుతుంది. యూరియా మోతాదు ఎక్కువైతే చీడపీడలు ఆశిస్తాయి. నత్రజని వాయువు రూపంలో వృథాగా బయటకు వెళ్లిపోతుంది. యూరియాను అతిగా నీటిలో చల్లకుండా పొలం బురదలా ఉండేలా చూసుకోవాలి. మంచు పూట చల్లితే మొక్క ఆకులపై యూరియా గుళికలు అతుక్కొని, ఆకులు మాడిపోతాయి. యూరియాకు డీజిల్‌ వంటి పదార్థాలు కలిపి చల్లితే పైరుకు, భూమికి హాని కలుగుతుంది. నూనె నీటిపై తేలడం వల్ల వేర్లకు గాలి అందకుండా పోతుంది. మొక్కలు చనిపోయే ప్రమాదం ఉంది. పంటకు మేలు చేసే కీటకాలు కూడా నశిస్తాయి.

భూమిరెడ్డి, మండల వ్యవసాయాధికారి, ఎల్లారెడ్డిపేట

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని