logo

ప్రభుత్వ భవనాలు.. మట్టి పాలేనా!

రామగుండంలోని నాలుగు ప్రభుత్వ భవనాలు మట్టిపాలేనా అనే అనుమానాలను స్థానికులు వ్యక్తం చేస్తున్నారు.

Published : 08 Feb 2023 06:14 IST

నిరుపయోగంగా గృహనిర్మాణ శాఖ ఏఈ కార్యాలయ భవనం

న్యూస్‌టుడే, రామగుండం: రామగుండంలోని నాలుగు ప్రభుత్వ భవనాలు మట్టిపాలేనా అనే అనుమానాలను స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. సుమారు రూ.50 లక్షలతో నిర్మించిన ఈ భవనాలు కొన్నేళ్లకే నిరుపయోగంగా మారాయి. అనువైన స్థలం ఉన్నా సరైన ప్రణాళిక లేకుండా రహదారికి దగ్గరగా వీటిని నిర్మించడంతో రోడ్డు విస్తరణలో 80 శాతం కట్టడాలను తొలగించనున్నారు. విస్తరణ జాప్యం కావడం, ఉమ్మడి రామగుండం మండలం నుంచి అంతర్గాం, పాలకుర్తి మండలాలు ఏర్పాటు కావడంతో కార్యాలయాలు తరలిపోయాయి. పట్టణంలోని పాత మండల పరిషత్‌ కార్యాలయ భవనంతోపాటు పక్కనే ఉన్న గృహా నిర్మాణ, వ్యవసాయశాఖలు, ఉపాధి హామీ కార్యాలయాల భవనాలు నిరుపయోగంగా మారాయి. ఈ భవనాలు, మండల పరిషత్‌ అవరణ ఖాళీ ప్రదేశం అసాంఘిక శక్తులకు అడ్డాగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అంతర్గాంకు తరలని ఇందిరా క్రాంతి పథం కార్యాలయం, భవిత కేంద్రం మాత్రమే నడుస్తున్నాయి. ఈ సిబ్బంది సైతం బిక్కు బిక్కుమంటూ విధులు నిర్వహిస్తున్నారు. రోడ్డుకు దగ్గరగా కాకుండా మరోచోట నిర్మించి ఉంటే ఈ భవనాలు ఉపయోగపడేవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా స్థలం కబ్జాకు గురవకుండా పరిషత్‌ ప్రాంగణం సద్వినియోగమయ్యేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

గుర్తు తెలియని వ్యక్తులు పగులగొట్టిన తలుపు

* పట్టణంలో రామగుండం మండల ప్రజా పరిషత్‌ కార్యాలయం భవనాన్ని 1991లో నిర్మించారు. కొద్ది రోజులకే ఇది శిథిలావస్థకు చేరింది. మరమ్మతులకు రూ.లక్షలు ఖర్చు చేశారు. అయినా బాగు కాలేదు. కొత్త మండలాలు ఏర్పడిన తర్వాత సైతం అంతర్గాం మండల పరిషత్‌ కార్యాలయాన్ని గత ఏడాది ఆగస్టు వరకు ఈ భవనంలోనే నిర్వహించారు. బ్రహ్మణపల్లిలో కోటి రూపాయలతో నిర్మించిన కొత్త భవనంలోకి కార్యాలయాన్ని తరలించారు.
* పరిషత్‌ కార్యాలయం స్థలం మొత్తం 1.13 ఎకరాలు. ఇందులో 10 గుంటలు రోడ్డు విస్తరణలో పోయింది. ముందుభాగంలో కొంతమేర కబ్జాకు గురైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మధ్యలో, ముందువైపు ఖాళీ స్థలాన్ని వదిలేసి వెనుక వైపున రోడ్డుకు దగ్గరగా 2015లో రూ.37 లక్షలతో ఉపాధిహామీ, ఐకేపీ కార్యాలయాలకు, రూ.3 లక్షలతో గృహ నిర్మాణశాఖ కార్యాలయానికి నూతన భవనాలు నిర్మించారు. వీటి పక్కనే 2005లో రూ.10 లక్షలతో మండల వ్యవసాయశాఖ కార్యాలయం నూతన భవనం నిర్మించారు.
* నూతన భవనాలను వెనుక వైపున రోడ్డుకు అనుకొని నిర్మించడంతో రహదారి విస్తరణలో ఈ కట్టడాలు 80 శాతం మేర పోతున్నాయి. రైల్వే పైవంతెన నుంచి ఎంపీపీ కార్యాలయం వరకు విస్తరణ చేపట్టలేదు. దీంతో ఈ భవనాలను ఇంకా కూల్చివేయలేదు. గృహా నిర్మాణశాఖను ఎత్తేయడంతో ఈ భవనం ఖాళీగా ఉంటుంది. వ్యవసాయశాఖ కార్యాలయం విధులను ఎక్కువగా ఎన్టీపీసీ మేడిపల్లిలోని రైతువేదిక వద్ద నిర్వహిస్తున్నారు. ఎంపీపీ కార్యాలయంతోపాటు ఉపాధిహామీ కార్యాలయాన్ని 5 నెలల క్రితం అంతర్గాంకు తరలించారు. ఐకేపీ కార్యాలయం ఇక్కడే కొనసాగుతోంది. అవరణలో భవిత కేంద్రాన్ని మొక్కుబడిగా నిర్వహిస్తున్నారు.
* కార్యాలయాలు తరలిపోవడం, భవనాలు విస్తరణలో పోనుండటంతో ఈ ప్రదేశం అసాంఘిక శక్తులకు అడ్డాగా మారింది. భవనాల్లోని సామగ్రి చోరీ అవుతున్నాయి. జిల్లా పరిషత్‌ ఆధీనంలో ఉన్న ఈ భవనాల వినియోగం, కూల్చివేత, ఖాళీ స్థలం సంరక్షణ, అభివృద్ధి, సద్వినియోగం విషయంలో ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు సరైన నిర్ణయం తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.


ఆదాయం సమకూరేలా చర్యలు

రామగుండంలోని ఎంపీపీ పాత కార్యాలయ భవనంలో జరిగిన చోరీ ఘటనలపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. అవసరమైన వస్తువులను అంతర్గాం కార్యాలయానికి తరలించాం. పోలింగ్‌ బాక్స్‌లు ఉన్నాయి.. వాటిని సైతం తరలిస్తాం. రోడ్డు విస్తరణలో భవనాల కూల్చివేత తర్వాత పాత శిథిల భవనాన్ని కూల్చివేస్తాం. స్థలాన్ని సంరక్షిస్తాం. దుకాణాల సముదాయం ఏర్పాటు చేసి ఆదాయం సమకూరేలా చర్యలు తీసుకుంటాం.

బి.యాదగిరి, ఎమ్పీడీవో, అంతర్గాం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని