logo

నలుగురికే పోడు పట్టాలు

జిల్లాలో పోడు భూముల జాబితా కొలిక్కివచ్చింది. గిరిజన, అటవీశాఖలు రూపొందించిన ఆర్‌ఓఎఫ్‌ఆర్‌, అగ్రాయిడ్‌ ప్రొ, ప్రాసిట్‌ అనే మూడు యాప్‌ల సహాయంతో అర్హులను తేల్చారు.

Updated : 08 Feb 2023 07:19 IST

పోడు సర్వే చేస్తున్న అధికారులు

న్యూస్‌టుడే, పెద్దపల్లి కలెక్టరేట్‌: జిల్లాలో పోడు భూముల జాబితా కొలిక్కివచ్చింది. గిరిజన, అటవీశాఖలు రూపొందించిన ఆర్‌ఓఎఫ్‌ఆర్‌, అగ్రాయిడ్‌ ప్రొ, ప్రాసిట్‌ అనే మూడు యాప్‌ల సహాయంతో అర్హులను తేల్చారు. జిల్లాలో 10 మండలాల్లోని 52 గ్రామపంచాయతీల్లో మొత్తం 8163 ఎకరాల్లోని 4596 దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఉపగ్రహ చిత్రాలతో సాగులోని భూములను గుర్తించారు. జిల్లాలో అత్యధికంగా అనర్హులే ఉండగా కేవలం నలుగురే లబ్ధిదారులుగా నిర్ధారించారు. సబ్‌ డివిజన్‌, జిల్లా స్థాయి కమిటీ ఆమోదముద్ర వేసి ప్రభుత్వానికి నివేదించారు. ఈ నెలలో పట్టాలు పంపిణీ చేస్తామని ప్రభుత్వం భావిస్తోంది. దరఖాస్తుల పరిశీలనలో ఆంక్షలు విధించి అర్హత ఉన్నా తిరస్కరించినట్లు పలువురు ఆరోపిస్తున్నారు.

ఉపగ్రహ చిత్రాలే ఆధారం

పోడు భూముల పరిశీలనలో శాస్త్రీయ విధానాన్ని వినియోగించారు. అగ్రాయిడ్‌ ప్రొ, ప్రాసిట్‌ అనే యాప్‌ల్లో సరిహద్దులు, విస్తీర్ణాన్ని నిర్ణయించారు. చరవాణిలో యాప్‌ను తెరవడంతో రైతు పోడు చేసిన భూమి ఏ రేంజి, బీట్, కంపార్ట్‌మెంట్లోకి వస్తుందో గుర్తించి ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేశారు. ఉపగ్రహ చిత్రాల ద్వారా ఎన్నేళ్ల నుంచి సాగులో ఉన్నట్లు లెక్కించారు. అటవీ హక్కుల చట్టం ప్రకారం గిరిజనులకు 2005, డిసెంబరు 13 కంటే ముందు, మూడు తరాలు అంటే 75 ఏళ్లు గిరిజనేతరులను పరిగణనలోకి తీసుకున్నారు. జిల్లాలో మొత్తం దరఖాస్తుదారులు 4596 ఉండగా ఇందులో 488 మంది 934 ఎకరాల్లో గిరిజనులు, 4108 గిరిజనేతరులు 7229 ఎకరాల్లో దరఖాస్తు చేసుకున్నారు. 2453 మంది రెవెన్యూ, ప్రభుత్వ భూముల్లో దరఖాస్తు చేసుకున్నట్లు తేలింది.

సాంకేతిక విధానంతో..

క్షేత్ర స్థాయిలో సేకరించిన జాబితాను గ్రామ స్థాయిలో ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ కమిటీలు అర్హత లేనివాటిని తిరస్కరించారు. ఆయా జాబితాపై సబ్‌ డివిజన్‌ కమిటీ(రేంజర్‌, ఆర్డీవో, ఇతర అధికారులు) పునఃపరిశీలించారు. జిల్లా కమిటీ నిర్ణయం మేరకు జిల్లాలో కేవలం నలుగురు గిరిజనులు సాగులో ఉన్నట్లు జాబితా సిద్ధం చేశారు. వీరికి 1.39 ఎకరాల భూమిని పంపిణీ చేయనున్నారు. చాలా చోట్ల మోకా సర్వే పారదర్శకంగా చేయలేదని ప్రజావాణిలో ఫిర్యాదులు చేస్తున్నారు. శాస్త్రీయ ఆధారాలతో లబ్ధిదారులను గుర్తించడంతో ఫిర్యాదులను  అధికారులు పట్టించుకోవడం లేదు. పోడు భూములను కాజేయాలనే దళారుల పన్నాగం ఫలించలేదు. సాంకేతికత విధానం చెక్‌ పడింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు నలుగురు పట్టాహక్కులు పొందనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని