logo

రాత్రిళ్లు నిల్వ.. పగలు తరలింపు

కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతి లేకుండా మానేరులో జరుగుతున్న ఇసుక తవ్వకాలను నిలిపివేయాలంటూ చెన్నైలోని ఎన్జీటీ(జాతీయ హరిత ట్రైబ్యునల్‌) జనవరి 23న ఉత్తర్వులు జారీ చేసింది.

Published : 08 Feb 2023 06:14 IST

ఎన్‌జీటీ నిషేధం ఉత్తర్వులు బేఖాతరు
మానేరు ఇసుక రవాణాపై టీఎస్‌ఎండీసీ చోద్యం
న్యూస్‌టుడే, పెద్దపల్లి

నిల్వ కేంద్రంలో ఇసుక

కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతి లేకుండా మానేరులో జరుగుతున్న ఇసుక తవ్వకాలను నిలిపివేయాలంటూ చెన్నైలోని ఎన్జీటీ(జాతీయ హరిత ట్రైబ్యునల్‌) జనవరి 23న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 23లోగా అనుమతి పత్రాలను సమర్పించిన తర్వాతే మైనింగ్‌ జరపాలని ఆదేశించింది.

ఓదెల మండలం గుండ్లపల్లి క్వారీ నుంచి ఇసుక తరలింపునకు రెండు రోజుల కిందట ఆన్‌లైన్‌లో 45 ట్రిప్పులకు డబ్బులు చెల్లించి అనుమతి తీసుకున్నారు. కానీ పంచాయతీ ఆధ్వర్యంలోని వసూలు కేంద్రంలో 65 ట్రిప్పులకు రశీదులు ఇచ్చారు. అంటే 20 లారీల ఇసుకను క్వారీ నుంచి అక్రమంగా తరలించినట్లు తేలింది.

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా బోర్నపల్లి క్వారీ నుంచి ఇసుక రవాణాను అక్కడి గ్రామస్థులు అడ్డుకోవడంతో గుత్తేదారులు మానేరుకు ఇవతలి వైపు గ్రామమైన కాల్వశ్రీరాంపూర్‌ మండలం కిష్టంపేట క్వారీ నుంచి ఇసుక తరలించే యత్నం చేశారు. రెండు రోజుల కిందట కిష్టంపేట గ్రామస్థులు అడ్డుకున్నారు.

జాతీయ హరిత ట్రైబ్యునల్‌(ఎన్జీటీ) ఉత్తర్వుల మేరకు మానేరులో ఇసుక తవ్వకాలను నిలిపివేస్తున్నట్లు టీఎస్‌ఎండీసీ ప్రాజెక్టు అధికారి శ్రీకాంత్‌ గత నెల 25న అధికారిక ప్రకటన విడుదల చేశారు. నిల్వ చేసిన ఇసుకను ప్రభుత్వ అవసరాలకు మాత్రమే కేటాయించనున్నట్లు వెల్లడించారు. అయితే వాస్తవాలు మరో రకంగా ఉన్నాయి. టీఎస్‌ఎండీసీ సైట్‌లో మానేరు ఇసుక బుకింగ్‌ ప్రక్రియ నిరాటంకంగా జరుగుతోంది. ఆన్‌లైన్‌లో బుకింగ్‌ చేసుకొని పగలు నిల్వ కేంద్రాల నుంచి, రాత్రిళ్లు వాగులో నుంచి ఇసుకను తరలిస్తున్నారు. మానేరు ఎగువ ప్రాంతాల్లో ఇసుక లేకపోవడంతో దిగువ ప్రాంతాల నుంచి తరలిస్తూ కాసులు దండుకుంటున్నారు. ఇక కోర్టు ఉత్తర్వులకు గౌరవం ఇచ్చే సంస్కృతి కనిపించకుండా పోవడం, గ్రామాల్లో సైతం వసూళ్ల పర్వం కొనసాగుతుండటం, ఇసుక రవాణా ఎన్నాళ్లు జరుగుతుందో తెలియని అనిశ్చితి పరిస్థితులు నెలకొన్నాయి.

అందినకాడికి వసూళ్లు

ఆన్‌లైన్‌లో ప్రభుత్వానికి చెల్లించిన డబ్బుల నుంచి ఇసుక క్వారీ నిర్వాహకుల(గుత్తేదారుల)కు ఇవ్వాల్సిన సొమ్మును ప్రభుత్వం ఎప్పుడు చెల్లిస్తుందో తెలియడం లేదు. దీంతో నిర్వాహకులు అనధికారిక వసూళ్లకు పాల్పడుతున్నారు. లారీ లోడింగ్‌కు రూ.800, లారీలో అనుమతించిన పరిమాణం కంటే ఎక్కువ పోసేందుకు పొక్లైన్‌లోని ఒక బకెట్‌(సుమారు 1.5 క్యూబిక్‌ మీటర్లు) ఇసుకకు రూ.1800 చొప్పున వసూలు చేస్తున్నారు. దీనికితోడు రహదారులు దెబ్బతింటున్నాయంటూ పంచాయతీలు సైతం ఒక కౌంటర్‌ ఏర్పాటు చేసుకొని ట్రిప్పుకు ఇంత అని వసూలు చేస్తున్నాయి. లారీల్లో తరలించే ఇసుకను తూకం వేసే వే బ్రిడ్జిలు పని చేయడం లేదు. ఒక వేళ కాంటాలు పని చేసే చోట ఎలాంటి తూకాలు లేకుండానే లారీలను నడిపిస్తున్నారు. నిబంధనల ప్రకారం ఆన్‌లైన్‌లో చెల్లించే రుసుం నుంచి గుత్తేదారు, పంచాయతీలకు నిధులు కేటాయిస్తారు. అయినా వసూళ్లు యథేచ్ఛగా జరుగుతున్నాయి.


తరలిస్తున్నా పరిమాణం తగ్గడం లేదు

తవ్వకాలు చేపట్టవద్దని ఎన్‌జీటీ ఉత్తర్వుల్లో స్పష్టంగా ఉన్నా నిల్వ కేంద్రాల నుంచి ఇసుకను తరలిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. డంపింగ్‌ కేంద్రాల్లో ఇసుక నిల్వ పరిమాణం తగ్గడం లేదు. రాత్రి వేళల్లో తవ్వకాలు చేసి నిల్వ చేస్తూ పగటి పూట తరలిస్తున్నారు. ఈ ఇసుక తరలించడానికి పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతి ఇవ్వదు. ఒకటి, రెండు నెలల్లో ఎన్జీటీ తుది తీర్పు వెలువరించే అవకాశముంది. ఇది కేవలం మానేరుకే కాదు, యావత్‌ దేశంలోనే డీసిల్టింగ్‌(పూడికతీత) నిలిచిపోవడానికి దారి తీస్తుంది.

కరుణాకర్‌రెడ్డి, మానేరు పరిరక్షణ సమితి కన్వీనర్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని