logo

ధూప దీపం.. నిధులకు గ్రహణం

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని ఆలయాలకు దూప దీప నైవేధ్యం (డీడీఎన్‌) నిర్వహణకు కష్టమొచ్చింది. దాదాపు ఐదు నెలలుగా నిధులు విడుదల కాకపోవడంతో అర్చకులు అప్పులు చేసి నిర్వహణ బాధ్యతలు చేపడుతున్నారు.

Published : 08 Feb 2023 06:18 IST

న్యూస్‌టుడే, కరీంనగర్‌ సాంస్కృతికం

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని ఆలయాలకు దూప దీప నైవేధ్యం (డీడీఎన్‌) నిర్వహణకు కష్టమొచ్చింది. దాదాపు ఐదు నెలలుగా నిధులు విడుదల కాకపోవడంతో అర్చకులు అప్పులు చేసి నిర్వహణ బాధ్యతలు చేపడుతున్నారు. నమ్ముకున్న దేవుడికి ఈ కార్యక్రమం నిర్వహించకపోతే భక్తుల ముందు చులకన అవుతామనే వారిని వెంటాడుతోంది. ఆలయాల్లో నిత్య పూజా కార్యక్రమాలు చేయడం తమ ఆచార ధర్మంగా భావించి అప్పులు చేస్తున్నారు.

అరకొర వేతనం..అయినా సేవలు

అరకొర వేతనం అందుకుంటున్న అర్చకులు దేవుడి సేవలో తరిస్తూ నాలుగు కార్యక్రమాలు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2007లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ‘ధూప దీప నైవేధ్యం’ పథకం చేపట్టారు. అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 1809 ఆలయాల్లో అమలు చేశారు. అర్చకుడికి రూ.1500, ధూప దీప నైవేధ్యం కింద రూ.వెయ్యి చెల్లించేవారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2014 ఎన్నికల్లో తెరాస అధికారంలోకి వస్తే రూ.6 వేలు చెల్లిస్తామని ప్రకటించి, అమలు చేశారు. పూజా కార్యక్రమానికి రూ.2 వేలు, అర్చకుడికి రూ.4 వేలు చెల్లిస్తున్నారు. పెరుగుతున్న ధరల దృష్ట్యా రూ.10 వేలకు పెంచాలని అర్చక ఉద్యోగుల డిమాండ్‌ వస్తోంది.

విస్తరణకు దరఖాస్తుల ఆహ్వానం..

పథకాన్ని మరిన్ని ఆలయాలకు విస్తరించాలని నాలుగు నెలలలో రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తులు ఆహ్వానించింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు అయిదు మంది దరఖాస్తు చేసుకున్నారు. క్షేత్ర స్థాయి పరిశీలనతో అర్చకులకు మౌఖికంగా పరీక్షించారు. మళ్లీ రెండో విడత దాదాపు 70 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎప్పుడు, ఎన్ని భర్తీ చేస్తారోనని అర్చకులు, ఆలయ కమిటీ ఎదురుచూస్తున్నాయి. జిల్లా దేవాదాయ శాఖ అధికారులు మాత్రం వచ్చిన దరఖాస్తులను రాష్ట్ర అధికారులకు పంపించామని చెబుతున్నారు. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అంటున్నారు.

పూజా సామగ్రి కొనుగోలుకు కష్టం..

ప్రస్తుతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 632 మంది పథకం కింద పని చేస్తున్నారు. వీరందరికీ ఐదు నెలలుగా నిధులు రావడంలేదు. చాలిచాలనీ వేతనాలతో ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. ఆలయానికి కావాల్సిన నూనె, వత్తులు, అగర్‌ వత్తులు, కర్పూరం, తదితర సామగ్రి కొనుగోలుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దేవాదాయ శాఖకు వేల కోట్ల రూపాయాలు రాష్ట్రంలోని ప్రధాన దేవాలయల నుంచి వస్తోంది. కామన్‌ గుడ్‌ ఫండ్‌ కింద దేవాదాయ శాఖ ఉన్నత శ్రేణి ఆలయాలతోపాటు 6ఏ, 6బీ ఆలయాలు నిధులు జమ చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మానవత్వంతో స్పందించి వెంటనే నిధులు విడుదల చేయాలని కోరుతున్నారు.


బడ్జెట్‌ విడుదల కాగానే నేరుగా జమ

- ఆకునూరి చంద్రశేఖర్‌, సహాయ కమిషనర్‌, దేవాదాయ శాఖ, ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా

ఉన్నతాధికారుల ప్రకారం దేవాలయాలకు నవంబరు, డిసెంబరు వేతనాలు రావాల్సి ఉంది. వారి బిల్లులు చేసి రాష్ట్ర అధికారులకు పంపించగా ట్రెజరీకి పంపించినట్లు ఉన్నతాధికారులు చెప్పారు. బడ్జెట్‌ విడుదల కాగానే నేరుగా వారి ఖాతాల్లోనే జమ అవుతాయి. బిల్లులు పంపించడం వరకే మాకు అధికారాలు ఉన్నాయి.


ఉద్యోగ భద్రత కల్పించాలి

- సముద్రాల శ్యాంసుందరాచార్యులు, అధ్యక్షుడు, డీడీఎన్‌ ఉమ్మడి జిల్లా శాఖ

అర్చకులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయిదారు నెలలుగా నిధులు విడుదల కావడంలేదు. ఆలయ కార్యనిర్వహణలో వారు అల్లాడుతున్నారు. పది మందిని దేవుడి తరఫున ఆశీర్వదించే మేము చేయి చాచి అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా ప్రభుత్వం నిధులు విడుదల చేయాలి. భవిష్యత్తులో ఉద్యోగ భద్రత కల్పించాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని