logo

ఆడుతూ.. పాడుతూ

సిరిసిల్లకు చెందిన ఓ చిన్నారి అటు నాట్యం, ఇటు సంగీతంలోనూ ప్రతిభ చూపుతోంది. పలు పోటీల్లో పాల్గొని పురస్కారాలు అందుకుంది.

Published : 08 Feb 2023 06:19 IST

ఔరా అనిపిస్తున్న చిన్నారి మహాలక్ష్మి
న్యూస్‌టుడే, సిరిసిల్ల (విద్యానగర్‌)

తాను గెలుచుకున్న బహుమతులతో మహాలక్ష్మి

సిరిసిల్లకు చెందిన ఓ చిన్నారి అటు నాట్యం, ఇటు సంగీతంలోనూ ప్రతిభ చూపుతోంది. పలు పోటీల్లో పాల్గొని పురస్కారాలు అందుకుంది. పలు వేదికలపై ప్రదర్శనలు ఇచ్చి ఔరా అనిపిస్తోంది. ఆమె ఎలిగేటి మహాలక్ష్మి. ప్రస్తుతం ఓ ప్రైవేటు పాఠశాలలో ఆరో తరగతి చదువుతుంది. తల్లిదండ్రులు ఎలిగేటి పల్లవి, ఎలిగేటి రమేశ్‌ ప్రభుత్వ ఉపాధ్యాయులు. చిన్నతనం నుంచి చదువులో చురుకుగా ఉండేది. నాట్యమన్నా, సంగీతమన్నా ఎంతో ఆసక్తి. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో సిరిసిల్లలో గురువు తన్మయి వద్ద కర్ణాటక సంగీతం, ధర్మరాజు వద్ద కూచిపూడి నృత్యంలో గత నాలుగేళ్లుగా శిక్షణ పొందుతుంది.

ప్రతిభకు పురస్కారాలు

హైదరాబాద్‌లో తెలంగాణ సారస్వత పరిషత్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన పాటల పోటీల్లో వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ గెలుచుకుంది. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ వేడుకల్లో భాగంగా సిరిసిల్లలోని సినారె కళామందిరంలో లంబోదర కల్చరల్‌ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన నృత్య పోటీల్లోనూ ప్రతిభ చూపి పురస్కారం అందుకుంది. యువ రత్న పబ్లిక్‌ వెల్ఫేర్‌ సొసైటీ వారు నిర్వహించిన పాటల పోటీల్లో పాల్గొని ప్రశంసలు పొందింది. కాజీపేట లయన్స్‌ క్లబ్‌ వారు నిర్వహించిన పాటల పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి పురస్కారం అందుకుంది. కరీంనగర్‌లోని వేంకటేశ్వరస్వామి దేవాలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాల సమయంలో నృత్యం చేసి బహుమతులు పొందింది. వేములవాడలోని రాజన్న ఆలయంలో గత మూడు సంవత్సరాలుగా మహా శివరాత్రి వేడుకలను పురస్కరించుకొని శివార్చన కార్యక్రమంలో నృత్యం చేస్తూ అందరి మన్ననలు పొందింది. నాట్యం, సంగీతంలో ప్రతిభ కనబరుస్తున్నప్పటికీ చదువును ఏమాత్రం నిర్లక్ష్యం చేయడం లేదని, తరగతిలో ఎప్పుడూ మొదటి మూడు ర్యాంకుల్లో ఉంటుంది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో రెండింటిలో రాణిస్తున్నట్లు మహాలక్ష్మి తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని