logo

మార్చి నాటికి నిర్మాణాలు పూర్తయ్యేనా?

ఎట్టకేలకు జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలకు సొంత భవనాలు రానున్నాయి. ప్రభుత్వం వాడావుడిగా సొంత భవనాలు లేని గ్రామాలకు ఉపాధి హామీ కింద నిధులు మంజూరు చేసింది.

Published : 09 Feb 2023 05:24 IST

96 పంచాయతీలకు సొంత భవనాలు
హడావుడిగా నిధులు మంజూరు

న్యూస్‌టుడే, కరీంనగర్‌ పట్టణం

గంగాధర మండలం మధురానగర్‌లో నిర్మాణం పూర్తయిన పంచాయతీ భవనం

ట్టకేలకు జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలకు సొంత భవనాలు రానున్నాయి. ప్రభుత్వం వాడావుడిగా సొంత భవనాలు లేని గ్రామాలకు ఉపాధి హామీ కింద నిధులు మంజూరు చేసింది. వీటితో మార్చి నెలాఖరుకల్లా నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఆదేశించింది. రెండు నెలల్లో భవన నిర్మాణాలు ఎలా పూర్తవుతాయని ప్రజాప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల జరిగిన జడ్పీ స్థాయీ సంఘ సమావేశంలో జడ్పీ ఛైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ కూడా ఈ అంశాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఆగమేఘాల మీద పని చేసినా రెండు నెలల్లో పూర్తి కావడం కష్టమేనని అంటున్నారు.

ప్రతి గ్రామంలో భవన నిర్మాణానికి మూడు గుంటలకు పైగా స్థలం సమకూరిస్తే నిధులు మంజూరు చేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది. క్షేత్రస్థాయి నుంచి ప్రతిపాదనలు తెప్పించుకుందిు. గతంలోనూ ఉపాధి హామీ నిధుల ద్వారా మంజూరు ఇవ్వగా ప్రస్తుతం పనులు కొనసాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 313 పంచాయతీలు ఉండగా గతేడాది 21 చోట్ల నిధులు మంజూరయ్యాయి. ప్రతి భవనానికి రూ.20 లక్షల నిధులు నిబంధనల ప్రకారం ఖర్చు చేసి నిర్మాణ పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఈ విధానం పట్టించుకోని కొందరు నిర్మాణాలపై ఆసక్తి చూపలేదు. అధికారులు ఒత్తిడి తేవడంతో తాజాగా వారు పనులు చేపట్టారు. ఇవి పోగా మరో 96 మిగిలాయి. వాటికి కూడా రూ.19.20 కోట్ల నిధులు విడుదలయ్యాయి. ఇవి పూర్తయితే జిల్లాలోని 313 గ్రామాలకు సొంత భవనాలు ఉంటాయి.

కొందరే ఆసక్తి..

ఈ నిధులను సర్పంచి, కార్యదర్శి కలిసి ఖర్చు చేసే అవకాశముంటుంది. సర్పంచులుగా ప్రస్తుతం కొనసాగుతున్న వారు తమ పదవీకాలం ముగిసేలోగా భవనం నిర్మించాలన్న ఆసక్తి కనబరుస్తున్నారు. కొత్తగా మంజూరైన వాటిలో ఒకరిద్దరు సర్పంచులు భవన నిర్మాణానికి భూమి పూజలు కూడా చేశారు. గ్రామాలకు సిమెంట్‌ రహదారులతోపాటు పంచాయతీ భవనాల నిర్మాణాల పనులను తమ పర్యవేక్షణలో నిర్వహిస్తామని జిల్లా పంచాయతీ రాజ్‌ కార్యనిర్వాహక ఇంజినీర్‌ శ్రీనివాసరావు తెలిపారు.


అవసరమైతే సమయం కోరతాం

శ్రీనివాస రావు, ఈఈ, పంచాయతీరాజ్‌ శాఖ

ఉపాధి హామీ కింద భవన నిర్మాణాలు చేపడుతున్నాం. ఇప్పటికే మానకొండూర్‌ మండలం నిజాయితీగూడెంలో పనులు ప్రారంభమయ్యాయి. అవసరమైతే ప్రభుత్వ సమయం కోరుతాం. అన్ని పంచాయతీలలో పనులు ప్రారంభిస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని