logo

సమ్మిళిత ప్రగతి.. అనితర ఖ్యాతి

అన్ని రంగాల అభివృద్ధి.. తలసరి ఆదాయం పెరుగుదలతో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా ప్రగతి పథంలో దూసుకెళ్తోంది. అవకాశాల సద్వినియోగంతో పల్లెలు, పట్టణాలు ఆయా రంగాల్లో అనితర ఖ్యాతిని ఆర్జిస్తున్నాయి.

Published : 09 Feb 2023 05:24 IST

మారుతున్న ఉమ్మడి జిల్లా ముఖ స్వరూపం
సామాజిక ఆర్థిక సర్వే-2023లో వెల్లడి
ఈనాడు, కరీంనగర్‌

అన్ని రంగాల అభివృద్ధి.. తలసరి ఆదాయం పెరుగుదలతో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా ప్రగతి పథంలో దూసుకెళ్తోంది. అవకాశాల సద్వినియోగంతో పల్లెలు, పట్టణాలు ఆయా రంగాల్లో అనితర ఖ్యాతిని ఆర్జిస్తున్నాయి. నాలుగు జిల్లాల పరిధిలో వనరులు, సౌకర్యాలు సామాజిక స్థితిగతులను మారుస్తున్నాయి.  రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 2023 సామాజిక    ఆర్థిక సర్వే వివరాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి.

ఆ రెండింటా ఘనం

స్థూల జిల్లా స్థూల ఉత్పత్తి(జీడీడీపీ), తలసరి ఆదాయం పెరుగుదల విషయంలో ఉమ్మడి జిల్లా జోరు చూపిస్తోంది. సహజ వనరుల ద్వారా ఏటా ఆదాయం పెరుగుతోంది. ఇదే తరుణంలో ప్రజల తలసరి ఆదాయంలో పురోగతి కనిపిస్తోంది. ఈ విషయంలో రాష్ట్ర స్థాయిలో 11వ స్థానంలో ఉంది. జిల్లాలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవలు, కొనుగోలు, ఇతర సేవలను జీడీడీపీగా పరిగణిస్తారు. ఆర్థిక వ్యవస్థకు ఇదే ప్రధాన సూచీ. పెట్టుబడులు, దిగుబడులతో పాటు వ్యయాలను పరిగణనలోకి తీసుకునేందుకు ఇదే కొలమానంగా మారుతుంది. గత మూడేళ్లలో నాలుగు జిల్లాల స్థూల ఉత్పత్తి ప్రస్తుత ధరలకు అనుగుణంగా క్రమంగా పెరుగుతోంది.

పల్లెప్రగతిలో మొబైల్‌ యాప్‌ వినియోగంతో పంచాయతీల భాగస్వామ్యంలో జగిత్యాల(86.40 శాతం) జిల్లా రాష్ట్రంలోనే రెండో స్థానాన్ని దక్కించుకుంది. పెద్దపల్లి(86.12) నాలుగు, సిరిసిల్ల(84.49) తొమ్మిది, కరీంనగర్‌(83.71) 11వ స్థానాల్లో ఉన్నాయి.


విద్యుత్తు కనెక్షన్లు (శాతాల్లో)

వ్యవసాయ కనెక్షన్లలో 24.25 శాతంతో జగిత్యాల రాష్ట్రంలోనే మెరుగైన స్థానంలో ఉంది. ఆ తరువాత కరీంనగర్‌లోనూ ఎక్కువ కనెక్షన్లున్నాయి. పదో స్థానంలో కరీంనగర్‌, 13వ స్థానంలో పెద్దపల్లి, 25వ స్థానంలో సిరిసిల్ల ఉన్నాయి.


ప్రత్యేకతల సమాహారం

* ఉపాధిహామీ పనిదినాల కల్పనలో పెద్దపల్లి 121 శాతం, కరీంనగర్‌, సిరిసిల్లలు 115 శాతం, జగిత్యాల 105 శాతంతో పురోగతి సాధించాయి.

* అడవుల విస్తీర్ణంలో రాష్ట్రంలోనే కరీంనగర్‌ అట్టడుగు స్థానంలో ఉంది. కేవలం 0.1 శాతం అటవీ భూ భాగం ఉంది. సిరిసిల్ల(20.2), జగిత్యాల(19.6), పెద్దపల్లి(15.5)లో ఓ మోస్తరుగా ఉంది.

* సంసద్‌ ఆదర్శ గ్రామ యోజన(ఎస్‌ఏజీవై) అమలులో దేశంలోనే కరీంనగర్‌ జిల్లా సైదాపూర్‌ మండలం వెన్నెంపల్లి (99.97 శాతం) 3వ స్థానంలో, జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలరాంపూర్‌(99.61 శాతం) 17వ స్థానంలో నిలిచాయి.

* స్వచ్ఛసర్వేక్షణ్‌లో 50 వేల నుంచి లక్ష జనాభా కలిగిన పురపాలికలో సిరిసిల్ల సెల్ఫ్‌ సస్టెనేబుల్‌ సిటీగా అవార్డు అందుకోగా.. కోరుట్ల ఫాస్ట్‌ మూవింగ్‌ విభాగంలో, వేములవాడ సిటిజన్‌ ఫీడ్‌బ్యాక్‌లో మెరుగైన ఫలితాల్ని అందుకున్నాయి.

* ఏడాదిలో పౌల్ట్రీ ఉత్పత్తి విషయంలో కరీంనగర్‌(21.68 లక్షలు) రాష్ట్రంలోనే నాలుగో స్థానంలో ఉంది. జగిత్యాల(8.67 లక్షలు), పెద్దపల్లి(10.70 లక్షలు), సిరిసిల్ల(7.44 లక్షలు) జిల్లాలు వెనుకబడ్డాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు