logo

ఏసీడీ ఉన్నట్టా.. లేనట్టా!

వినియోగదారులను చికాకు పెడుతున్న అదనపు విద్యుత్తు వినియోగం డిపాజిట్‌(ఏసీడీ)పై అనిశ్చితి నెలకొంది. గత జనవరి నెలలో ఏసీడీ మొత్తాన్ని బిల్లుల్లో నమోదు చేస్తూ జారీ చేసిన అధికారులు.

Published : 09 Feb 2023 05:24 IST

ఇప్పటికే చెల్లించిన 28 వేల మంది
న్యూస్‌టుడే, భగత్‌నగర్‌

వినియోగదారులను చికాకు పెడుతున్న అదనపు విద్యుత్తు వినియోగం డిపాజిట్‌(ఏసీడీ)పై అనిశ్చితి నెలకొంది. గత జనవరి నెలలో ఏసీడీ మొత్తాన్ని బిల్లుల్లో నమోదు చేస్తూ జారీ చేసిన అధికారులు.. ప్రస్తుత ఫిబ్రవరి బిల్లులో నమోదు చేయలేదు. ఇదే సమయంలో ఓ పార్టీ నేతలు తమ పోరాటంతోనే పంపిణీ సంస్థలు రద్దు చేశాయంటూ విజయోత్సవాలు నిర్వహిస్తున్నారు. కాగా ఇప్పటికే డబ్బులు చెల్లించిన వారు అయోమయానికి గురవుతున్నారు. తాము చెల్లించిన మొత్తం తిరిగి ఇస్తారా.. బిల్లుల్లో జమ చేసుకుంటారా? అనే విషయం తెలియక అధికారులను ఆశ్రయిస్తున్నారు. వారు పై నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని తేల్చి చెబుతున్నారు.

అయోమయం.. గందరగోళం..

ఉత్తర విద్యుత్తు పంపిణీ సంస్థ పరిధిలో 300 యూనిట్లలోపు కరెంటు వినియోగిస్తున్న ప్రజలపై అదనపు ఏసీడీ పేరిట జిల్లాలో గత నెల 2.65 లక్షల సర్వీసు కనెక్షన్లకు బిల్లులు వేశారు. దక్షిణ విద్యుత్తు పంపిణీ సంస్థ (ఎస్‌పీడీసీఎల్‌) వినియోగదారులపై ఏసీడీ మొత్తం వేయకుండా ఉత్తర విద్యుత్తు పంపిణీ సంస్థ పరిధిలోని ప్రాంత వినియోగదారులపై వేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఇటీవల కరీంనగర్‌లోని కలెక్టరేట్‌ ఆడిటోరియంలో విద్యుత్తు నియంత్రణ మండలి వినియోగదారులతో నిర్వహించిన ముఖాముఖిలో ఈ విషయం చర్చకు వచ్చింది. ముందస్తు నోటీసు ఇవ్వకుండా ఏసీడీ మొత్తం బిల్లుల్లో పేర్కొనడం వినియోగదారుల హక్కులను కాలరాయడమేనని పలువురు ఛైర్మన్‌ శ్రీరంగరావు దృష్టికి తీసుకువెళ్లారు. ముందస్తు నోటీస్‌ ఇవ్వకపోవడాన్ని నిరసించారు. దీనికి ఈఆర్‌సీ ఛైర్మన్‌ సైతం ముందస్తు నోటీస్‌ ఇవ్వకపోవడమనేది పంపిణీ సంస్థ తప్పేనని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరిలో జారీ చేస్తున్న కరెంటు బిల్లుల్లో ఏసీడీ మొత్తం రావడం లేదు. ఏసీడీ రద్దు చేశారా లేదా? అనే విషయం తెలియడంలేదు.

వీరి సంగతేమిటి?

ఇప్పటికే జిల్లాలో 28 వేల మంది సుమారు రూ.3 కోట్ల వరకు ఏసీడీ చెల్లించినట్లు అధికారుల లెక్కల ద్వారా తెలుస్తోంది. మరో వైపు రద్దు చేశారంటూ ఆయా పార్టీలు విజయోత్సవాలు చేసుకుంటున్నాయి. ఈ విషయమై విద్యుత్తు అధికారులను సంప్రదిస్తే స్పష్టత ఇవ్వడంలేదు. రద్దు చేస్తున్నట్లు ఎలాంటి ఆదేశాలు రాలేదని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని