logo

అంజన్న ఆలయాభివృద్ధికి రూ.100 కోట్లు మంజూరు

కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధి కోసం రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్లు గత డిసెంబరు 7న జగిత్యాల బహిరంగ సభలో ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌.. రెండు నెలల్లోనే తమ హామీని నిలబెట్టుకున్నారు.

Published : 09 Feb 2023 05:24 IST

మల్యాల, న్యూస్‌టుడే

కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధి కోసం రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్లు గత డిసెంబరు 7న జగిత్యాల బహిరంగ సభలో ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌.. రెండు నెలల్లోనే తమ హామీని నిలబెట్టుకున్నారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట గ్రామ పరిధిలోని అంజన్న ఆలయ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి ప్రకటించిన రూ.100 కోట్లు వెంటనే విడుదల చేయాలని ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు ఆందోళనలు, ప్రకటనలు చేస్తున్న నేపథ్యంలో జీవో ఆర్‌టీ నంబరు 49 ప్రకారం ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు కొండగట్టు అంజన్న ఆలయానికి ప్రత్యేక అబివృద్ధి, సంక్షేమ నిధుల నుంచి రూ.100 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ఈ నెల 7న జారీ అయిన ఉత్తర్వులో స్పష్టం చేశారు. కొండగట్టులో చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనుల గురించి జిల్లా కలెక్టరు ప్రత్యేక నివేదిక సమర్పించాలని అందులో కోరారు.

చేపట్టాల్సిన ముఖ్యమైన పనులివే..

దాదాపు 400 ఏళ్ల క్రితం నిర్మించిన ఆలయానికి రెండో ప్రాకార మండపం, మెట్లదారి నుంచి ‘రోప్‌వే’ నిర్మాణం, ప్రమాదాల నివారణకు ఘాట్‌రోడ్డు పునర్నిర్మాణం, మెట్లదారి ఆధునికీకరణ, కొండపైన దాదాపు 200 ధర్మశాల గదులు, ఆలయం చుట్టూ విశాలమైన మాడ వీధి నిర్మాణాలు చేపట్టాల్సి ఉంటుంది. అంజన్న ఆలయానికి 45 ఎకరాల స్థలం ఉండగా అందులో ఆలయ పరిసరాలే 22 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ క్షేత్రానికి ఆనుకుని ఉన్న 333 ఎకరాల బంచరాయి, ప్రభుత్వ భూములను నాలుగేళ్ల క్రితమే జిల్లా కలెక్టరు ఆలయానికి స్వాధీనం చేశారు. దీంతో అంజన్న ఆలయానికి దాదాపు 378 ఎకరాల భూములు సొంతమయ్యాయి. ప్రస్తుతం కొండగట్టు స్టేజీ వద్ద విలువైన ఆలయ భూములు కొన్ని ఆక్రమణకు గురవుతున్నాయి. వాహనాల పార్కింగు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాల్సి ఉంది.  

డార్మెటరీలు ఇతర పనులకు..

భక్తుల సౌకర్యం కోసం దేవాదాయశాఖ, పలువురు దాతలు నిర్మించిన డార్మెటరీ షెడ్లు, భవనాలను ఆలయ అవసరాలకే వినియోగించుకోవడంతో భక్తులకు వసతి కరవైంది. అద్దెకు ఇవ్వడానికి కేవలం 40లోపు గదులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం రెండు డార్మెటరీ భవనాల్లో ఒకదానిని లడ్డూ పులిహోర ప్రసాదం తయారీకి, మరొకటి అన్నదానం నిర్వహించడానికి వినియోగిస్తున్నారు. ఏళ్ల క్రితం నిర్మించిన డార్మెటరీ షెడ్లు నిర్వహణలేక అధ్వానంగా మారాయి. ఇటీవలే రూ.32 లక్షలతో ఆలయం పక్కన క్యూలైన్‌ను ఆనుకుని డార్మిటరీ షెడ్డు నిర్మించగా, రూ.కోటితో మరో రెండు డార్మెటరీ షెడ్లు నిర్మించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.  

నిర్మించినా నిరుపయోగం

కొండగట్టు స్టేజీ సమీపంలోని ఆలయ భూమిలో దాదాపు 8 ఏళ్ల క్రితం రూ.కోట్లు వెచ్చించి నిర్మించిన 19 దుకాణ భవన సముదాయం గదులు, 15 ఏళ్ల క్రితం నిర్మించిన 20 దుకాణ గదులు (షాపింగ్‌ కాంప్లెక్స్‌) నేటికీ ప్రారంభానికి నోచుకోక నిరుపయోగంగా ఉన్నాయి. పలు సులభ్‌ కాంప్లెక్స్‌ల నిర్వహణను గాలికొదిలేయడంతో మూలనపడ్డాయి. అతిథి గృహ భవనాలకు స్థలం కేటాయింపు సమస్యగా మారుతోంది. పురాతన మెట్లదారి అభివృద్ధి, దీక్షాపరుల కోసం మాలావిరమణ మండపం నిర్మించడానికి ఐదేళ్ల క్రితం రూ.5 కోట్లు మంజూరు చేసినా మెట్లదారి పనులు చేపట్టకపోగా, మాలావిరమణ మండపం పనులు పిల్లర్ల స్థాయిలో అర్ధాంతరంగా నిలిచిపోయాయి.

బృహత్‌ ప్రణాళికతో మేలు

కొండగట్టులో భక్తులకు సకల సౌకర్యాలు కల్పించడానికి, అభివృద్ధి పనులను చేయడానికి ‘మాస్టర్‌ ప్లాన్‌’ అమలు చేయాల్సి ఉన్నా 20 ఏళ్లుగా అమలుకు నోచుకోవడం లేదు. గతంలో అధికారులు మాస్టర్‌ ప్లాను రూపొందించినప్పటికీ ప్రభుత్వ ఆమోదం లభించకపోవడంతో బుట్టదాఖలయింది. భక్తుల రద్దీ దృష్ట్యా కొండపై పనుల గురించి పాలకమండళ్లు తీర్మానాలు చేసినా అమలుకు నోచుకోలేదు. మాస్టర్‌ప్లాన్‌ అమలు చేయాలని అన్ని వర్గాల నుంచి డిమాండ్‌ వస్తున్నప్పటికీ ఇంజినీరింగు అధికారులు ఎక్కడబడితే అక్కర నిర్మాణాలు చేపట్టడం.. తర్వాత వాటిని తొలగించడం ఏళ్లుగా నడుస్తోంది.


నిధుల మంజూరు సంతోషకరం

వెంకటేశ్‌, ఆలయ ఈవో

ఆలయ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేయడం సంతోషకరం. కొండపైన ఎలాంటి అభివృద్ధి పనులు చేపడ్తారన్న విషయమై దేవాదాయశాఖ కమిషనరు ద్వారా మాకు సమాచారం అందుతుంది. భక్తుల కోసం ఆయా పనులను ఇంజినీరింగు అధికారుల పర్యవేక్షణలో చేపడ్తారు. అందుకోసం కొండపైన బృహత్‌ ప్రణాళికను అమలు చేస్తారని భావిస్తున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని