నిధులు మంజూరైనా నిర్మాణాలేవీ..!
రామగుండం నగరపాలక ప్రాంతాభివృద్ధి కోసం వివిధ పథకాల్లో నిధులు మంజూరు చేస్తున్న ప్రభుత్వం వాటిని విడుదల చేయడంతో నిర్లక్ష్యం వహిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
రామగుండంలో అర్ధాంతరంగా నిలిచిన అభివృద్ధి
న్యూస్‌టుడే, గోదావరిఖని పట్టణం
రామగుండం నగరపాలక ప్రాంతాభివృద్ధి కోసం వివిధ పథకాల్లో నిధులు మంజూరు చేస్తున్న ప్రభుత్వం వాటిని విడుదల చేయడంతో నిర్లక్ష్యం వహిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో ఆయా నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. అధికారుల ప్రణాళిక లోపం రామగుండం అభివృద్ధికి విఘాతంగా మారుతుంది. కేంద్ర, రాష్ట్ర పరిశ్రమలకు నిలయమైన రామగుండం ప్రాంతంలో ప్రధానమైన అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదు.
రెండు దశాబ్దాలుగా ...
స్వశక్తి మహిళల కోసం హనుమాన్‌నగర్‌లో సుమారు రెండు దశాబ్దాల క్రితం చేపట్టిన సామాజిక భవనం పిల్లర్లకే పరిమితమైంది. పనులు మొదలయ్యాక అంచనాలను మార్చిన పాలకవర్గం, దానికి అనుగుణంగా నిధులు కేటాయించలేదు. ఐదేళ్ల క్రితం ఇదే ప్రాంతంలో ఆడిటోరియం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక నిధులు రూ.4 కోట్లు కేటాయించి గుత్తేదారునకు పనులు అప్పగించినా పనులు మొదలు కాలేదు.
విజ్ఞాన కేంద్రం.. పునాదులకే పరిమితం
రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక నిధులు రూ.5 కోట్లతో మల్కాపూర్ శివారులో అంబేడ్కర్ విజ్ఞాన కేంద్రం నిర్మాణానికి నాలుగేళ్ల క్రితం నిధులు కేటాయించారు. ఎట్టకేలకు రెండేళ్ల క్రితం పనులు మొదలు కాగా నిధుల కొరతతో అర్ధాంతరంగా వదిలేశారు. పనులు పునాదుల వరకు రాగానే కొంత మేరకు బిల్లు గుత్తేదారుకు చెల్లించాల్సి ఉండగా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో గుత్తేదారు సదరు పనిని అర్ధాంతరంగా నిలిపివేశారు. నిరుద్యోగ యువతీ యువకులతో పాటు విద్యార్థులకు విజ్ఞానాన్ని పంచాల్సిన అంబేడ్కర్ విజ్ఞాన కేంద్రం ఇలా పునాదులకే పరిమితమైంది.
బహుళ ప్రయోజనకర భవనం దుస్థితి
నగరపాలక పాత కార్యాలయం, సీనియర్ సిటిజన్ పార్కు ఆవరణలో బహుళ ప్రయోజనకర భవనం నిర్మాణం కోసం ఐదేళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక నిధులు రూ.8 కోట్లు మంజూరు చేసింది. ఎట్టకేలకు సుమారు రెండేళ్ల క్రితం పనులు మొదలయ్యాయి. దాదాపు రూ.2 కోట్ల వరకు పనులు పూర్తి చేసిన గుత్తేదారు మధ్యంతర చెల్లింపుల కోసం బిల్లులను ప్రభుత్వానికి సమర్పించినప్పటికీ నిధులు విడుదల కాకపోవడంతో పనులను ఆపేశారు. ఇప్పటికే లక్ష్మీనగర్ ప్రాంతంలో నిర్మాణం పూర్తయిన నగరపాలక వాణిజ్య భవన సముదాయం నిరుపయోగంగా ఉండగా తాజాగా బహుళ ప్రయోజనకర భవన నిర్మాణం నిలిచిపోయింది.
సమీకృత మార్కెట్ పూర్తయ్యేదెన్నడు..
విఠల్‌నగర్‌లో సమీకృత మార్కెట్ నిర్మాణం కోసం సుమారు ఒకటిన్నర దశాబ్దాల క్రితమే ప్రణాళికలు సిద్ధం చేసిప్పటికీ ఐదేళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక నిధులు రూ.5 కోట్లు మంజూరు చేశారు. నాలుగేళ్ల క్రితం సమీకృత మార్కెట్‌తో పాటు సామాజిక భవన నిర్మాణం పనులు చేపట్టారు. దాదాపు రూ.1.5 కోట్ల మేరకు పనులు పూర్తికాగా బిల్లుల కోసం రెండున్నరేళ్ల క్రితం బిల్లులను సమర్పించినా నిధులు విడుదల కాలేదు. అధికారులు, పాలకవర్గం ఒత్తిళ్లతో మరో రూ.1.5 కోట్ల వరకు పనులు చేపట్టినా బిల్లులు చెల్లించకపోవడంతో గుత్తేదారు చేతులెత్తేశాడు. పనులు నిలిచిపోవడంతో ఇప్పుడు ఆ ప్రాంతం ఆసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతోంది.
కాగితాల్లోనే ‘ప్రత్యేక నిధులు’
రామగుండం అభివృద్ధి కోసం ఏటా రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఆచరణకు నోచుకోవడం లేదు. ఈ సారైనా ప్రత్యేక నిధులు రూ.100 కోట్లు వస్తాయేమోననే ఆశతో ఏటా రామగుండం నగరపాలిక బడ్జెట్‌లో అంచనా ఆదాయంలో రూ.100 కోట్లు చేరుస్తూనే ఉన్నారు. 2016-17, 2017-18లో మాత్రమే ఏటా రూ.100 కోట్ల చొప్పున రూ.200 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం ఆ తర్వాత మంజూరును విస్మరించగా మంజూరు చేసిన రెండేళ్ల నిధుల్లోంచి ఇప్పటి వరకు కేవలం రూ.83.5 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. దీంతో ఆయా నిధులతో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ఏళ్లు గడుస్తున్నా కొన్ని పనులు మొదలే కావడం లేదు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు దృష్టి సారించాలని నగర ప్రజలు కోరుతున్నారు.
చువ్వలు తుప్పు పడుతున్నాయ్
విఠల్‌నగర్‌లో చేపట్టిన సమీకృత మార్కెట్ భవనం పనులు పూర్తికాకపోగా తాజాగా మరో రూ.4.5 కోట్లతో ఎన్టీఆర్ నగర్‌లో మరో సమీకృత మార్కెట్ భవన నిర్మాణం పనులను ఏడాదిన్నర క్రితం చేపట్టారు. పునాదుల వరకు పనులు కాగానే బిల్లుల కోసం ప్రభుత్వానికి గుత్తేదారు నివేదించినా ప్రయోజనం లేకపోవడంతో అర్ధాంతరంగా పనులను ఆపేశారు. పనుల పురోగతి ఆధారంగా బిల్లులు చెల్లిస్తేనే గుత్తేదార్లు పనులు చేపట్టే అవకాశమున్నప్పటికీ ఆ దిశగా ప్రభుత్వం, పాలకవర్గం చర్యలు తీసుకోవడం లేదు. దీంతో పునాదుల్లోని ఇనుప చువ్వలు తుప్పు పట్టిపోయే పరిస్థితులు నెలకొన్నాయి.
అనాలోచిత నిర్ణయం...
ఆసుపత్రి అభివృద్ధికి స్థలం అవసరముంటుందని వైద్య ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేసినా పట్టించుకోని నగరపాలిక గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రి ముందున్న ఖాళీ స్థలాన్ని స్వాధీనం చేసుకొని ‘అమృత్’ నిధులు రూ.5 కోట్లతో ఉద్యానవనం నిర్మాణానికి పూనుకున్నారు. బోటింగ్ కోసం తవ్వకాలు, ప్రహరీ నిర్మాణం తదితర పనుల కోసం సుమారు రూ.42 లక్షలు ఖర్చు చేశారు. నిధులు లేక వదిలేశారు. తాజాగా ఈ స్థలంలో 650 పడకల సామర్థ్యంతో ఆసుపత్రి భవన నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం ప్రయోజనకరమైనా ఉద్యానవనం పేరిట వెచ్చించిన నిధులు వృథా అయ్యాయి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
కరెంటు కోతతో కోపోద్రిక్తుడై.. డిప్యూటీ సీఎం ఇంట్లో బాంబు పెట్టానంటూ ఫోన్!
-
Movies News
Shaakuntalam: అలా నేను వేసిన తొలి అడుగు ‘శాకుంతలం’: దిల్ రాజు
-
India News
DCGI: 18 ఫార్మా కంపెనీల లైసెన్స్‌లు రద్దు చేసిన కేంద్రం
-
World News
North korea: కిమ్మా.. మజాకానా? లాక్డౌన్లోకి ఉత్తర కొరియా నగరం!
-
Politics News
Chandrababu: కేంద్రానికి, మీకు ప్రత్యేక ధన్యవాదాలు.. ప్రధాని మోదీకి చంద్రబాబు లేఖ
-
World News
Donald Trump: ‘24 గంటల్లోపే ఉక్రెయిన్ యుద్ధానికి తెరదించుతా..!’