logo

కార్మికులకు అమలుకాని బయోమెట్రిక్‌

కరీంనగర్‌ నగరపాలక సంస్థ కార్యాలయ పరిధిలో పని చేస్తున్న అధికారులు, ఉద్యోగులు, కార్మికులు, ఇతర సిబ్బంది హాజరు నమోదు పక్కాగా నమోదు చేయాల్సి ఉంటుంది.

Published : 21 Mar 2023 06:16 IST

కరీంనగర్‌ వీధుల్లో పనులు చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు

న్యూస్‌టుడే, కరీంనగర్‌ కార్పొరేషన్‌: కరీంనగర్‌ నగరపాలక సంస్థ కార్యాలయ పరిధిలో పని చేస్తున్న అధికారులు, ఉద్యోగులు, కార్మికులు, ఇతర సిబ్బంది హాజరు నమోదు పక్కాగా నమోదు చేయాల్సి ఉంటుంది. అన్ని శాఖల్లో బయోమెట్రిక్‌ విధానం అమలు చేస్తుండగా.. కార్యాలయ ఉద్యోగులు, అధికారులు సైతం దీని ద్వారానే హాజరు వేసుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో పని చేసే పారిశుద్ధ్యం, నీటి విభాగం, పట్టణ ప్రణాళిక కార్మికులకు మాత్రం హాజరు చేతితోనే వేస్తున్నారు. వీరికి ఆయా డివిజన్ల వారీగా రిజిస్టర్లు వినియోగిస్తున్నారు. బయోమెట్రిక్‌ యంత్రాలు కొనుగోలు చేయాలని గతంలోనే నగర మేయర్‌ వై.సునీల్‌రావు ఆదేశించగా టెండర్లు నిర్వహించారు. ఇప్పటికీ ఆ యంత్రాలు మాత్రం వినియోగంలోకి రాలేదు.


జవాన్ల పెత్తనం

నగరంలో పారిశుద్ధ్య విభాగంలో సుమారు 1,030 మంది కార్మికులు పని చేస్తున్నారు. వీరందరి హాజరు వేకువజామున, మధ్యాహ్నం తీసుకుంటున్నారు. ప్రస్తుతం జవాన్ల వారీగా ఈ హాజరు తీసుకుంటున్నారు. నాలుగైదు డివిజన్ల పరిధిలో పని చేసే కార్మికులు ఒకచోట వచ్చి సంతకాలు చేయాల్సి ఉంటుంది. గైర్హాజరు, హాజరు విషయంలో జవాన్ల పెత్తనంతో బల్దియాకు నష్టం కలిగేలా మారింది. రెండు రోజుల కంటే ఎక్కువ వాడినా, అనుమతి తీసుకొని సెలవులో వెళ్లిన కార్మికుల హాజరు వీరి చేతిలోనే ఉండటంతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నట్లుగా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని సందర్భాల్లో కార్మికుల వేతనాలు వచ్చిన వెంటనే జవాన్‌కు ఎంతో కొంత ముట్టజెప్పనిదే హాజరు పడదనే విమర్శలు కార్మికుల నుంచి వినిపిస్తోంది.


సెలవుల్లో కోత

నిత్యం దుర్గంధ భరిత వ్యర్థాల మధ్య, దుమ్ము, ధూళిలో పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు మాత్రం ఆదివారాలు, పండగల తెల్లవారి ఇచ్చే సెలవులు తప్ప అదనంగా సెలవులు ఇవ్వడం లేదు. కార్మిక చట్టం ప్రకారం ప్రతీనెలా రెండు సెలవులు ఇవ్వాల్సి ఉండగా అత్యవసర పరిస్థితిలో కార్మికులు రాకపోతే హాజరు వేసేందుకు కొందరు జవాన్లు 50 ఫార్ములా ఉపయోగిస్తున్నారని చెబుతున్నారు. పక్కనే ఉన్న రామగుండం కార్పొరేషన్‌లో కార్మికుడికి నెలకు రెండు రోజులు సెలవులు వినియోగించుకునేలా అక్కడి పాలకవర్గం అనుమతించింది. కరీంనగర్‌లో మాత్రం సెలవులు లేకుండా పని చేస్తున్నారు.


అందుబాటులోకి యంత్రాలు ఎప్పటికో?

పారిశుద్ధ్య కార్మికులు, నీటి విభాగంలో పని చేస్తున్న కార్మికుల సమయసారిణి పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది. వారి సమయాలను పరిగణలోకి తీసుకునేలా బయోమెట్రిక్‌ అమలు చేసేందుకు నిర్ణయించినప్పటికీ ఆ యంత్రాలు అందుబాటులోకి రావడం లేదు. కొత్తగా కొనుగోలు చేసే పరికరాల్లో ముఖం, చేతి వేళ్ల గుర్తింపును సెన్సార్‌ ద్వారా తీసుకుంటాయి. కార్మికుడి వేతనం, ఎన్ని సెలవులు వాడారు? నెలలో ఎన్ని పనిదినాలు హాజరు అయ్యారు? గైర్హాజరు ఎన్ని, ఎంత వేతనం వస్తుందనే వివరాలను ఇందులో పొందుపర్చే వీలుంది. వేతనాలు తయారు చేసేందుకు సులభంగా ఉంటుంది. అదనంగా పని చేస్తే ఆ పని గంటలను కూడా పరిగణలోకి తీసుకుంటారని తెలిసింది. ఇప్పటికైనా నగరపాలక అధికారులు పరిశీలించి బయోమెట్రిక్‌ విధానంతో పారదర్శక హాజరు ప్రక్రియ అమలు చేయాల్సిన అవసరముంది.


త్వరలోనే అమలు
- త్రియంబకేశ్వర్‌, డిప్యూటీ కమిషనర్‌, నగరపాలిక

పారిశుద్ధ్య కార్మికుల కోసం బయోమెట్రిక్‌ యంత్రాలకు ఆర్డర్‌ ఇచ్చారు. డివిజన్ల వారీగా మొత్తం 60 బయోమెట్రిక్‌ వినియోగంలోకి వస్తాయి. రెండు, మూడు రోజుల్లో రాగానే అమలు చేస్తాం.  

కార్యాలయంలో ఉద్యోగుల కోసం బయోమెట్రిక్‌ పరికరం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు