logo

ఒకట్రెండు రోజుల్లో సిట్‌ బృందం రాక!

ప్రశ్నపత్రాల లీకేజీలో కీలక నిందితుడిగా ఉన్న రాజశేఖర్‌ చుట్టూనే విచారణ సాగుతుండటంతో ఉమ్మడి జిల్లాలో అతని వ్యవహారంపై విస్తృతంగా చర్చ జరుగుతోంది.

Published : 21 Mar 2023 06:16 IST

ఈనాడు, కరీంనగర్‌ న్యూస్‌టుడే- మల్యాల: ప్రశ్నపత్రాల లీకేజీలో కీలక నిందితుడిగా ఉన్న రాజశేఖర్‌ చుట్టూనే విచారణ సాగుతుండటంతో ఉమ్మడి జిల్లాలో అతని వ్యవహారంపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. జగిత్యాల జిల్లా మల్యాల మండలం తాటిపల్లికి చెందిన ఈయన కీలక నిందితుడని అటు సిట్‌, ఇటు జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అతని పేరు బయటకి వచ్చినప్పటి నుంచి గ్రామంలో ప్రవర్తన, కుటుంబ నేపథ్యం, ఆర్థిక వనరులు ఇతరత్రా సమాచారాన్ని స్థానిక పోలీసులు సేకరించారు. మరోవైపు పోలీసు కస్టడీలో ఉన్న అతని నుంచి సిట్‌ అధికారులు కీలక సమాచారాన్ని సేకరించడంతోపాటు అతనితో ఎవరెవరికి సంబంధం ఉందనే విషయమై ఆరా తీస్తున్నారు. ఇతని సన్నిహితులు బంధుగణంలో ఎవరెవరు పరీక్ష రాశారనే కోణంలోనూ కొంత సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. ఒకట్రెండు రోజుల్లో వారు ఉమ్మడి జిల్లాలో విచారణ జరపనున్నట్లు సమాచారం. కొన్ని రోజులుగా సాగుతున్న విచారణలో రాజశేఖర్‌రెడ్డి వెల్లడించిన విషయాల ఆధారంగా ఉమ్మడి జిల్లాలోనూ అతనికి సంబంధించిన మరింత సమాచారాన్ని ఈ బృందం సేకరించే అవకాశం ఉంది. ప్రశ్నపత్రాలు ఎవరెవరికి ఇచ్చారు? ఇతర దేశాల్లో ఉన్నవారు ఎంతమంది వచ్చి పరీక్షల్ని రాశారనే కోణంలోనూ వారి దర్యాప్తు కొనసాగనున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక మూలాలపైన దృష్టి సారించనుండటంతో ఈ లీకేజీ పాపంలో ఇంకెవరెవరి పేర్లు బయటకు వస్తాయనే ఉత్కంఠ ఉమ్మడి జిల్లాలో నెలకొంది. ఇదే సమయంలో మల్యాల మండలంలో 100 మందికిపైగా గ్రూప్‌-1 ప్రిలిమినరీలో ఉత్తీర్ణులయ్యారని పీసీసీ అధ్యక్షుడు చేసిన ఆరోపణకు సంబంధించి, ఏమైనా అక్రమాలు జరిగితే వివరాలు అందజేయాలంటూ సిట్‌ ఆయనకు నోటీసు ఇవ్వడం స్థానికంగా చర్చనీయాంశమైంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు