logo

పల్లెసేవలో.. యువ ఇంజినీర్లు

ఎప్పుడూ తరగతి గదుల్లో పుస్తకాలతో కుస్తీ పట్టడమే కాదు.. క్షేత్రస్థాయిలో పర్యటించి అవగాహన పెంచుకుంటున్నారు.

Published : 21 Mar 2023 06:16 IST

గ్రామాల్లో జాతీయ సేవా పథకం
(ఎన్‌ఎస్‌ఎస్‌) శిబిరాల నిర్వహణ

వీధి శుభ్రం చేస్తున్న వాలంటీర్లు

కొడిమ్యాల(జగిత్యాల), న్యూస్‌టుడే: ఎప్పుడూ తరగతి గదుల్లో పుస్తకాలతో కుస్తీ పట్టడమే కాదు.. క్షేత్రస్థాయిలో పర్యటించి అవగాహన పెంచుకుంటున్నారు. గ్రామాల్లో జాతీయ సేవా పథకం(ఎన్‌ఎస్‌ఎస్‌) శిబిరాలు నిర్వహిస్తూ సేవ చేస్తున్నారు. కొడిమ్యాల మండలంలోని జేఎన్టీయూ నాచుపల్లి కళాశాలలోని ఎన్‌ఎస్‌ఎస్‌ విభాగం ఆధ్వర్యంలో ఈనెల 15 నుంచి 21 వరకు హిమ్మత్‌రావుపేట, డబ్బుతిమ్మయ్యపల్లె గ్రామాల్లో శిబిరాలు నిర్వహించారు. రెండు బృందాలుగా ఏర్పడి శ్రమదానం, స్వచ్ఛభారత్‌, హరితహారం, వ్యక్తిగత మరుగుదొడ్లు, ఆరోగ్యం, రక్తదానం, సామాజిక రుగ్మతలు, పర్యావరణ పరిరక్షణ, వాననీటి సంరక్షణ, ఓటరు నమోదు, మూఢనమ్మకాలు, సైబర్‌ నేరాలు, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా గ్రామస్థుల్లో చైతన్యం కలిగించారు. ఈ సందర్భంగా వారిని ‘న్యూస్‌టుడే’ పలకరించగా వారి అనుభవాలను పంచుకున్నారు. ఆ వివరాలు..  


సామాజిక రుగ్మతలపై చైతన్యం..
- భావన, శిబిరం సమన్వయకర్త

శిబిరంలో భాగంగా పల్లెటూరులో సేవ చేయడం ఆనందాన్నిస్తోంది. గ్రామాల్లోని సామాజిక రుగ్మతల నివారణకు జాతీయ సేవా పథకం చక్కటి వేదికగా నిలుస్తుంది. బాల్య వివాహాలు, భ్రూణహత్యలు, మద్యపాన నిషేధం, బాల కార్మికులు, ధూమపాన నిషేధం, సైబర్‌ నేరాలు వంటి అనేక అంశాలపై గ్రామస్థులకు అవగాహన కల్పిస్తున్నాం. సేవా కార్యక్రమాల ద్వారా ఆత్మ సంతృప్తి పొందుతున్నాం.  


పరిశుభ్రతపై..
- ప్రణయశ్రీ, వాలంటీర్‌

గ్రామంలో స్వఛ్ఛభారత్‌, హరితహారంపై విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నాం. ప్లాస్టిక్‌ కవర్ల వాడకం వలన కలిగే భూమి కాలుష్యంపై గ్రామస్థులకు తెలియజేస్తూ ప్లాస్టిక్‌ నివారణకు కృషి చేస్తున్నాం. అంతేగాక పరిసరాలు అపరిశుభ్రత వల్ల సంక్రమించే వ్యాధులను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశాం. ప్రతి ఇంటికీ వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకుని వినియోగించుకోవాలని తెలిపారు.


క్రమశిక్షణ నేర్చుకున్నాం..
- టి.వర్షిణి

జాతీయ సేవా పథకంలో భాగంగా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వాలంటీర్లు ఒక బృందంగా ఏర్పడి శ్రమదానం, వివిధ కార్యక్రమాలు నిర్వహించడం, సాయంత్రం గ్రామస్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా క్రమశిక్షణ అలవడింది. ఇలాంటి శిబిరాల వల్ల ఆత్మవిశ్వాసంతో పాటు తోటి వారిపట్ల సోదరభావం పెంపొందుతుంది. గ్రామస్థుల నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాం.


నాయకత్వ లక్షణాలు..
- సాయిభార్గవ్‌, శిబిరం సమన్వయకర్త

చిన్ననాటి నుంచే దేశ సేవ చేయాలనే ఉద్దేశం ఉంది. ఎన్‌ఎస్‌ఎస్‌ శిబిరాల్లో పాల్గొనడం ద్వారా చాలా విషయాలు నేర్చుకుంటున్నాను. శిబిరం సమన్వయకర్తగా వ్యవహరించడం ద్వారా నాయకత్వ లక్షణాలు, బృంద నిర్వహణ, ఎలా పని చేయించాలి, ఎలా వ్యవహరించాలో నేర్చుకుంటున్నాం. భవిష్యత్తులో మేము పనిచేసే చోట తోటి వారితో కలిసి పనిచేయడానికి, పని చేయించుకోవడానికి ఉపయోగపడుతుంది.


సేవాభావం అలవడింది..
- సిరి

గతంలో మేము చాలా శిబిరాలు నిర్వహించాం. గ్రామస్థులకు చెప్పడం కంటే వారి నుంచే అనేక విషయాలు నేర్చుకున్నాం. శిబిరంలో పాల్గొంటూ గ్రామంలో శ్రమదాన కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా సేవాభావాన్ని అలవాటు చేసుకున్నాను. గ్రామస్థులంతా ఒక్కటై తమ గ్రామాన్ని, తమ సమస్యలను పరిష్కరించుకునేలా అవగాహన కల్పించాం.  ఇతరులకు సేవ చేయాలనే ఆలోచన కలిగింది.


ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలని..
- నదీమ్‌పాషా

ఆపదలో ఉన్న వారికి రక్తదానం చేయడం ద్వారా ప్రాణాపాయ స్థితి నుంచి వారిని కాపాడవచ్చని, రక్తదానం చేయడం వలన అనారోగ్యానికి గురవుతామని, శక్తి హీనులమవుతామనే అపోహలను తొలగిస్తూ గ్రామస్థులకు అవగాహన కల్పిస్తున్నాం. ఒక వ్యక్తి మరణించిన తర్వాత నేత్రదానంతో అంధులకు చూపు, కొత్త జీవితాన్ని అందించవచ్చని రక్తదానం, షౌష్టికాహారం వంటి అంశాలను ప్రచారం చేస్తున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని