logo

పక్కాగా పది పరీక్షల నిర్వహణ

పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాల సాధనే లక్ష్యంగా ప్రత్యేక ప్రణాళిక చేపట్టామని డీఈవో జగన్మోహన్‌రెడ్డి అన్నారు.

Published : 21 Mar 2023 06:16 IST

న్యూస్‌టుడే, జగిత్యాల పట్టణం: పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాల సాధనే లక్ష్యంగా ప్రత్యేక ప్రణాళిక చేపట్టామని డీఈవో జగన్మోహన్‌రెడ్డి అన్నారు. కలెక్టర్‌ యాస్మిన్‌భాష ఆదేశాల మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాల కల్పన, విద్యా ప్రమాణాల పెంపునకు చర్యలు చేపట్టామని చెప్పారు. పదిలో వందశాతం ఉత్తీర్ణత సాధించాలని కలెక్టర్‌ ఆదేశించారని, విద్యార్థులు కనీస అభ్యసన సామర్థ్యాలు సాధించేలా ఉపాధ్యాయులు పనిచేయాలని సూచించారని పేర్కొన్నారు. ఏప్రిల్‌ 3 నుంచి ప్రారంభంకానున్న పదో తరగతి పరీక్షల ఏర్పాట్లు, సన్నద్ధతపై ‘న్యూస్‌టుడే’తో మాట్లాడారు. ఆ వివరాలు..


ప్రశ్న: జిల్లాలో పది పరీక్షల నిర్వహణకు ఎలాంటి చర్యలు చేపట్టారు?
సమాధానం: జిల్లాలో పది పరీక్షలకు పటిష్ఠమైన ఏర్పాట్లు చేశాం. మొత్తం 11,177 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్ష రాయనున్నారు. ఇందుకోసం 69 పరీక్ష కేంద్రాలను ఎంపిక చేశాం. 69 మంది చీఫ్‌ సూపరింటెండెంట్లు, 69 మంది డిపార్టుమెంటల్‌ అధికారులు 1034 ఇన్విజిలేటర్లు పరీక్షలు సమర్థంగా నిర్వహించనున్నారు. మాస్‌ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాం.


ప్ర: పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి వసతులు కల్పించనున్నారు.?
స: గాలి, వెలుతురు సౌలభ్యంగా ఉన్నవాటినే పరీక్ష కేంద్రాలుగా గుర్తించాం. విద్యుత్తు, ఫ్యాన్ల అమరిక పూర్తయింది. తాగునీటి వసతితోపాటు మూత్రశాలల సౌలభ్యం కల్పించాం. ఇంకా ఏవైనా సమస్యలుంటే పరిష్కరించే విధంగా సిబ్బందికి సూచనలు జారీ చేశాం.


ప్ర: మన ఊరు-మన బడి పాఠశాలల్లో ప్రగతి పనుల జాప్యంతో ఇబ్బందులున్నాయా.?
స: దాదాపు ఎంపిక చేసిన పాఠశాలల్లో 80 శాతం పనులు పూర్తయ్యాయి. పది కేంద్రాలపై వీటి ప్రభావం లేదు. మిగిలిన పనులు సైతం వేసవి సెలవులకు ముందే పూర్తయ్యే అవకాశం ఉంది.


ప్ర: కొందరు ఉపాధ్యాయులు సమయ పాలన పాటించడంలేదనే ఆరోపణలున్నాయి. విద్యార్థులకు నష్టం జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారు.?
స: సమయపాలన పాటించని వారిపై శాఖాపరంగా చర్యలు తీసుకుంటాం. కలెక్టర్‌ ఆదేశాల మేరకు విద్యాశాఖపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయి. విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఉపాధ్యాయులపై కఠినంగా వ్యవహరిస్తాం.


ప్ర: పదో తరగతిలో ఉత్తమ ఫలితాల సాధనకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు.?
స: అన్ని పాఠశాలల్లోనూ పాఠ్య ప్రణాళిక పూర్తయింది. ఉదయం, సాయంత్రం ఒక్కో గంట చొప్పున ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. ఈ సమయంలో విద్యార్థుల ఆకలి తీర్చేందుకు అల్పాహారం అందజేస్తున్నాం. పునశ్చరణ రెండు పర్యాయాలు పూర్తయింది. ఇంట్లోనూ విద్యార్థులు చదువుకునేలా తల్లిదండ్రులను ఉపాధ్యాయులు కోరడం జరిగింది. అభ్యాస దీపికలు అనుసరించి బోధన కొనసాగుతోంది.


మొత్తం పాఠశాలలు: 364
పదో తరగతి విద్యార్థులు: 11,177
బాలురు: 5,747
బాలికలు: 5,430
పరీక్ష కేంద్రాలు: 69
పరీక్ష నిర్వహణ పరిశీలకులు: 1,034

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని