logo

లక్షల లీటర్ల శుద్ధ జలం వృథా

అసలే ఎండాకాలం.. ఆపై జలం అవసరాలు పెరిగిపోవడం.. ప్రతి ఒక్కరూ నల్లా నీరు ఎప్పుడు వస్తుందా అని ఎదిరి చూస్తుండగా.. పైపులైన్ల లీకేజీలు.. వాల్వుల దగ్గర బయటకు వస్తున్న శుద్ధజలంతో.. లక్షల లీటర్ల నీరు వృథా అవుతోంది.

Published : 24 Mar 2023 04:19 IST

నగరంలో పైపులైన్‌ లీకేజీల పరంపర
న్యూస్‌టుడే, కరీంనగర్‌ పట్టణం, కార్పొరేషన్‌

ఎస్‌ఆర్‌ఆర్‌ కళాశాల ఎదురుగా బ్యాంకు కాలనీకి వెళ్లు కూడలిలో పైపులైను వాల్వ్‌ ఉంది. ఇటీవల మరమ్మతులు చేసినా ఎప్పటిలాగే శుద్ధి నీరంతా రోడ్డుపై ప్రవహిస్తోంది. ఆ ప్రాంతంలో బురదమయంగా మారుతుండటంతో  రాకపోకలు సాగించే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.  

అసలే ఎండాకాలం.. ఆపై జలం అవసరాలు పెరిగిపోవడం.. ప్రతి ఒక్కరూ నల్లా నీరు ఎప్పుడు వస్తుందా అని ఎదిరి చూస్తుండగా.. పైపులైన్ల లీకేజీలు.. వాల్వుల దగ్గర బయటకు వస్తున్న శుద్ధజలంతో.. లక్షల లీటర్ల నీరు వృథా అవుతోంది.

కరీంనగర్‌ నగర పాలక సంస్థ పరిధిలోని 60 డివిజన్లు ఉండగా అత్యధిక శాతం కాలనీలకు శుద్ధి నీరే పంపిణీ చేస్తున్నారు. గతంలో రోజు విడిచి రోజు వచ్చే నల్లా నీరు ప్రస్తుతం రోజు వస్తుండటంతో నగరవాసులకు నీటి సమస్యనే లేదు. విలీన కాలనీల్లో కొన్నింటికి నగరం నుంచే తాగునీరు పంపిణీ అవుతుండగా మిగతా ప్రాంతాలకు మిషన్‌ భగీరథ, స్థానికంగా ఉన్న బోరు, బావుల నీటిని సరఫరా చేస్తున్నారు. నల్లా నీర ఒక రోజు రాకపోయినా ఆయా ప్రాంతవాసులు ఎదురు చూసే పరిస్థితి ఏర్పడింది. పాత నగరంలో బోరు, బావులు లేకపోవడంతో అన్ని అవసరాలకు ఈ నీరే అధికంగా వాడుతున్నారు.. అంతరాయం లేకుండా సరఫరా చేయాల్సి ఉండగా ఈ మధ్య మరమ్మతుల పేరిట నిలిపి వేస్తుండటంతో ఇబ్బందులు తప్పడం లేదు.

నెలల తరబడి ..

నగరంలోని కాపువాడ, ఆమేర్‌నగర్‌, మారుతీనగర్‌, పాతబజారు, బోయవాడ, అహ్మద్‌పుర, భగత్‌నగర్‌, కశ్మీర్‌గడ్డ, గోదాంగడ్డ, రాంనగర్‌, సప్తగిరికాలనీ, శివనగర్‌, అంబేడ్కర్‌నగర్‌, మంచిర్యాల చౌరస్తా, హౌసింగ్‌బోర్డుకాలనీ, సిక్కువాడీ, దోబీవాడ, కట్టరాంపూర్‌, కోతిరాంపూర్‌, అలకాపురికాలనీ, విద్యానగర్‌, జ్యోతినగర్‌, మంకమ్మతోట, విద్యానగర్‌, ఖాన్‌పుర, హుస్సేనీపుర, అశోక్‌నగర్‌, బ్యాంకుకాలనీ, మెహర్‌నగర్‌, సుభాష్‌నగర్‌, సవారన్‌వీధి, వావిలాలపల్లి తదితర ప్రాంతాల్లో వాల్వుల లీకేజీలు అధికంగా ఉన్నాయి. అందులో నీరు నిలిచి ఉండటంతో తిరిగి పైపులైన్లకు వెళ్తోందని అంటున్నారు. ప్రధాన రహదారులపై పైపులు పగిలి నీరంతా రోడ్లపై ప్రవహిస్తుండగా మరమ్మతులు చేయడంలో జాప్యం చేస్తున్నారు.

నిపుణులతో చేయించకపోవడంతో..

నగరంలోని పలు ప్రాంతాల్లో స్మార్ట్‌సిటీ రహదారులు నిర్మిస్తున్నారు. వేసిన రోడ్లు భవిష్యత్తులో పగులకొట్టకుండా ఉండేందుకు కొత్తగా హెచ్‌డీపీఈ పైపులు వేస్తున్నారు. రెండు పైపులను అనుసంధానం చేసే సమయంలో జాయింట్లు సక్రమంగా చేయడం లేదు. నిపుణులతో కాకుండా స్థానిక కార్మికులతోనే ఈ పనులు చేయిస్తుండటంతో సీసీ వేసిన తర్వాత లీకేజీలు బయట పడుతున్నాయి. పలు స్మార్ట్‌ రోడ్లపై ఇప్పటికే ఉన్నాయి.


మంచిర్యాల చౌరస్తా సమీపంలో మసీదుకు ఎదురుగా అంబేడ్కర్‌నగర్‌ రిజర్వాయర్‌కు వెళ్లు దారిలో పైపులైను లీకవుతోంది. నెలల తరబడి అలాగే ఉండగా శుద్ధి నీరంతా మురుగునీటి కాల్వల్లోకి వెళ్తోంది. ప్రధాన పైపులైను కావడంతో దానిని ముట్టుకోకుండా వదిలేస్తుండటంతో కొన్ని సందర్భాల్లో ఫౌంటెయిన్‌ తరహాలో నీరు పైకి లేస్తోంది.


సాయినగర్‌లో ఇటీవల స్మార్ట్‌సిటీ కింద రోడ్డు వేశారు. అంతకంటే ముందే హడావుడిగా తాగునీటి పైపులైను వేసి పరీక్షించలేదు. రోడ్డు వేసిన తర్వాత జాయింట్‌ ఊడిపోవడం, రోడ్డు లోపలి భాగంలో ఉండటంతో కొత్తగా వేసిన రోడ్డు తవ్వాల్సిన పరిస్థితి రావడంతో అధికారులు ఆలోచనలో పడ్డారు. ఈ శుద్ధి నీరు రోడ్డుపై ప్రవహిస్తోంది.


లోపాలు ఏమిటి..

వాల్వుల దగ్గర నీరు బయటకు వస్తుండటంతో ప్యాకింగ్‌ తాడు వేస్తున్నారు. కార్మికులకు దీనిపై అవగాహన లేదని తెలుస్తోంది. వాహనాలు వెళ్లే క్రమంలో కదలకుండా ఉండేందుకు చుట్టూ ప్లాస్టిక్‌ పైపు, సిమెంటు వేసినా ఆగడం లేదు. కొన్ని రోజులకే శుద్ధి నీరు బయటకు వచ్చి రోడ్డు దెబ్బతింటుంది. వాల్వులు సక్రమంగా లేకపోవడం, వాటిని ఆపరేటింగ్‌ చేసే సమయంలో తేడాలు వస్తుండటం, వాహనాలు దాని గుండా వెళ్తుండటమే సమస్యలకు కారణంగా మారుతుంది.


ఎప్పటికప్పుడు మరమ్మతులు

నగర మేయర్‌ ఆదేశాల మేరకు అన్ని రిజర్వాయర్ల పరిధిలోని ఇంజినీర్లకు ఆదేశాలు జారీ చేశాం. లీకేజీలు, వాల్వుల ప్యాకింగ్‌ తాడు వేసేలా చర్యలు చేపట్టారు. బీటీ రోడ్లపై లీకేజీలను సరి చేసేందుకు ప్రాధాన్యమిచ్చాం. ఎప్పటికప్పుడు మరమ్మతులు చేస్తున్నారు.

 నాగ మల్లేశ్వరరావు, ఎస్‌ఈ, కరీంనగర్‌ నగర పాలిక

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని