logo

అర్హత ఉన్నా.. అందుకోలేక!

రైతుబంధు పొందేందుకు అన్ని అర్హతలున్నా.. సుదీర్ఘ నిరీక్షణ తప్పట్లేదు. సవరిస్తే సరిపోయే చిన్నపాటి సాంకేతిక కారణాలను సాకుగా చూపి నెలల తరబడి ఖాతాలో డబ్బులు జమ చేయడంలేదు.

Published : 24 Mar 2023 04:14 IST

రైతుబంధు సహాయానికి నిరీక్షణ
న్యూస్‌టుడే, కరీంనగర్‌ మంకమ్మతోట

రైతుబంధు పొందేందుకు అన్ని అర్హతలున్నా.. సుదీర్ఘ నిరీక్షణ తప్పట్లేదు. సవరిస్తే సరిపోయే చిన్నపాటి సాంకేతిక కారణాలను సాకుగా చూపి నెలల తరబడి ఖాతాలో డబ్బులు జమ చేయడంలేదు. అధికారుల నిర్లక్ష్యమా?, ప్రభుత్వ నిధులు లేకపోవడం కారణమేదైనా రైతుకు మాత్రం నిరాశే మిగులుతుంది. పూర్తి వివరాలతో ‘న్యూస్‌టుడే’ కథనం.

గత కొన్నేళ్లుగా సహాయం పొందుతున్న పలువురు ఈ యాసంగిలో రైతుబంధు జమ కాలేదు. కారణమేంటని ఆరా తీయగా ఖాతాలో ఉన్న బ్యాంకు ఐఎఫ్‌ఎస్‌సీ నంబరు మారడంతో డబ్బులు జమ కాలేదని అధికారుల నుంచి సమాధానం వచ్చింది. డబ్బులు రాలేదన్న రైతన్నలతో మాత్రం సాంకేతిక సమస్యనే కదా.. సరైన నంబర్‌ పంపిస్తే త్వరలోనే మీ ఖాతాలో జమ అవుతాయని అధికారులు నమ్మబలికారు. కానీ చాలామందికి డిసెంబరులో రైతుబంధు నిధులు వస్తే.. మార్చి నెలాఖరు సమీపిస్తున్నా వీరికి మాత్రం జమ కాలేదు.

ముగుస్తున్న ఆర్థిక సంవత్సరం..

మార్చి నెలాఖరుతో ఈ ఆర్థిక సంవత్సరం ముగిసిపోతుంది. మరో వారం రోజుల గడువు మాత్రమే ఉండడంతో సాంకేతిక కారణాలతో ఇప్పటి వరకు జమ కాని వారి డబ్బులు తిరిగి వెనక్కి వెళ్లిపోతాయమోనన్న భయం నెలకొంది. రెండు వారాల్లో జమ అవుతాయన్న డబ్బులు.. మూడు నెలలైనా రాకపోవడంతో ఎదురుచూస్తున్నారు. బ్యాంకుల ఐఎఫ్‌ఎస్‌సీ నంబరు మారడంతో ఖాతాలో నగదు జమ కానీ వారి సంఖ్య జిల్లాలో తక్కువగానే ఉందని అధికారులు పైకి చెబుతున్నా.. రాని వారి వివరాలు వెల్లడించకుండా గోప్యత పాటిస్తున్నారు.

నిత్యం కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు

బాధిత రైతులు సంబంధిత మండల వ్యవసాయ అధికారి కార్యాలయాల వద్దకు ప్రతి రోజు ప్రదక్షిణలు చేస్తున్నారు. వాళ్లు మాత్రం మేము ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ నంబర్‌ను సరి చేసి పంపించాం. కానీ మీ ఖాతాలో డబ్బులు ఎప్పుడో పడతాయో చెప్పలేమంటున్నారు. ఆశతో కొందరు జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయానికి వచ్చినా.. వారికి అక్కడ ఎదురయ్యే సమాధానం నిరాశ కల్గిస్తుంది. తిరిగి తిరిగి వేసారినా.. భరోసా కల్పించే వారు లేకుండా అయ్యారని పలువురు వాపోతున్నారు.


పంట పెట్టుబడికి పనికొస్తాయనుకున్నా..

నాకు రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. కరీంనగర్‌ కోర్టు చౌరస్తా సమీపంలోని బ్యాంకులో నా ఖాతా ఉంది. ఏటా రెండు సార్లు రైతుబంధు జమ అవుతుంది. ఈ యాసంగిలో ఇప్పటి వరకు రాలేదు. కారణమేమిటని మండల వ్యవసాయ శాఖ అధికారులను అడిగితే ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ మారడంతో ఇలా జరిగిందన్నారు. సరి చేసి పంపించాం. త్వరలోనే వస్తాయన్నారు. మూడు నెలలైనా ఇప్పటికీ డబ్బులు రాలేదు.

శేఖర్‌, రేకొండ, చిగురుమామిడి


అధికారుల స్పందన కరవు

నాకు ఎకరం ఐదు గుంటల వ్యవసాయ భూమి ఉంది. ప్రతి ఆరు నెలలకు రైతుబంధు సహాయం అందేది. యాసంగి పంట పెట్టుబడి రాలేదు. కారణం అడిగితే బ్యాంకు ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ మారిందని, అందుకే డబ్బులు జమ కాలేదన్నారు. రైతులకు నచ్చజెప్పి సమస్య పరిష్కరించాల్సిన అధికారులు సరిగా స్పందించడంలేదు.  

రాజేందర్‌, గంగాధర

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని