logo

అందుబాటులోకి మామిడిమండీ

తెలంగాణలోనే ప్రముఖమైనదిగా ఉన్న జగిత్యాల చల్‌గల్‌ మామిడి మార్కెట్లో రూ.6 కోట్ల వ్యయంతో లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన 4 భారీ షెడ్లను మంత్రి కొప్పుల ఈశ్వర్‌ శుక్రవారం ప్రారంభించనున్నారు.

Published : 24 Mar 2023 04:14 IST

నేడు షెడ్లను ప్రారంభించనున్న మంత్రి ఈశ్వర్‌
న్యూస్‌టుడే, జగిత్యాల వాణిజ్యం

నిర్మించిన విశాలమైన షెడ్లు

తెలంగాణలోనే ప్రముఖమైనదిగా ఉన్న జగిత్యాల చల్‌గల్‌ మామిడి మార్కెట్లో రూ.6 కోట్ల వ్యయంతో లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన 4 భారీ షెడ్లను మంత్రి కొప్పుల ఈశ్వర్‌ శుక్రవారం ప్రారంభించనున్నారు. వాలంతరి ప్రదర్శన క్షేత్రం నుంచి అదనంగా తీసుకున్న 10 ఎకరాల స్థలంలోనూ ఈ సీజన్‌లో మామిడి కాయల లావాదేవీలు నిర్వహించనుండటం కలిసిరానుంది.

* చల్‌గల్‌ మండీని శాశ్వత పండ్లమార్కెటుగా మార్చేందుకు గతంలోనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. యార్డులో అభివృద్ధి పనులు జరుగుతున్నందున గత సీజన్లలో చాలామంది మార్కెట్ వెలుపల ప్రైవేటు స్థలాల్లో మామిడి లావాదేవీలు జరిపారు. రహదారి వెంబడి కాయల సేకరణ ట్రాఫిక్‌కు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నందున తప్పనిసరిగా యార్డులోనే లావాదేవీలు జరపాలని జిల్లా కలెక్టర్‌ ఆదేశించటం, ఈ సీజనుకు షెడ్లు అందుబాటులోకి రావటంతో దాదాపుగా 90 మంది వరకు వ్యాపారులకు స్థలాలను కేటాయించాల్సి ఉంది.

* గత సీజన్లలో అధికంగా మార్కెట్ ఫీజును చెల్లించినవారి వరుసక్రమాన్ని అనుసరించి షెడ్లలో స్థలాన్ని కేటాయించాలని వ్యాపారులు కోరుతున్నారు. యార్డులోనే మామిడి కాయల కొనుగోలు, ప్యాకింగ్‌, తరలింపు తదితర కార్యకలాపాలను చేపట్టేలా, మామిడితో పాటు అన్ని పండ్ల క్రయవిక్రయాలు ఏడాదిపొడవునా కొనసాగించేలా యార్డులో అంతర్గత రహదారులు, విద్యుత్తు తదితర సదుపాయాలు కల్పించాల్సి ఉంది. దిల్లీ, నాగ్‌పూర్‌, హైదరాబాద్‌, విజయవాడ తదితర మామిడి మార్కెట్ల ధరలను తెలిపేలా చల్‌గల్‌ మండీలో ఆన్‌లైన్‌తెర, ధరల ప్రదర్శనతో రైతులకు మేలు కలగనుంది. గతంలో మాదిరిగా ఈ సీజన్‌లోనూ కిసాన్‌ రైలు ద్వారా ఉత్తరాది రాష్ట్రాలకు కాయల ఎగుమతికి అవకాశముండటం, మామిడి కాపు తక్కువగా ఉన్నందున అధిక ధరలు దక్కుతాయని రైతులు, తోటల గుత్తేదారులు భావిస్తున్నారు.

* చల్‌గల్‌ యార్డులోని రైపెనింగ్‌ ఛాంబర్‌తో పాటుగా రెండు ధర్మకాంటాల వినియోగంతో రైతులకు మేలు కలుగుతుంది. నిబంధనల ప్రకారం కమీషన్‌ తీసుకునే వ్యాపారులు కాయలను బహిరంగ వేలం పద్ధతిన కొనుగోలు చేయాల్సి ఉన్నా యార్డులో అభివృద్ధి పనులు పూర్తిగాకపోవటం, వ్యాపారులు వారి సొంతస్థలాల్లోనే సేకరణ చేసినందున వేలానికి వీలుకాలేదు. ప్రస్తుతం యార్డులోనే క్రయవిక్రయాలు సాగే అవకాశముంది కాబట్టి వేలంను పాటించాలని కొందరు వ్యాపారులు కోరుతున్నారు. నాగ్‌పూర్‌ మార్కెట్లో ఉదయంపూట మామిడి కాయల వేలం ఉండగా జగిత్యాలలో రాత్రిపూట బీటు సాగుతుంది కాబట్టి వేలంను అనుసరిస్తే ఇందుకు సరిపడా ఏర్పాట్లు చేయాలి.


వచ్చే సీజనుకు మరిన్ని ఏర్పాట్లు

ఎమ్మెల్యే ద్వారా మంత్రి ఇతర ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో చల్‌గల్‌ మార్కెట్లో మరిన్ని అభివృద్ధి పనులను చేపట్టనున్నాం. ఈ సీజనుకు యార్డులోనే మామిడికాయల లావాదేవీలను జరపాలని నిర్ణయించగా వచ్చే సీజను వరకు మరిన్ని ఏర్పాట్లు చేపట్టనున్నాం.

నక్కల రాధ, మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని