logo

నిర్వహణ అస్తవ్యస్తం.. సేవలు నామమాత్రం

ప్రజలకు కార్పొరేట్‌ తరహా వైద్య సేవలను అందుబాటులోకి తీసుకు రావాలనే ఉద్దేశంతో గోదావరిఖనిలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ సార్వజనిక ఆసుపత్రిలో నిర్వహణ అస్తవ్యస్తంగా కొనసాగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

Published : 24 Mar 2023 04:14 IST

‘ఖని’ ప్రభుత్వ సార్వజనిక ఆసుపత్రి తీరు
న్యూస్‌టుడే, గోదావరిఖని పట్టణం

ప్రారంభానికి నోచుకోని ఆసుపత్రిలోని సీటీ స్కానింగ్‌ విభాగం

ప్రజలకు కార్పొరేట్‌ తరహా వైద్య సేవలను అందుబాటులోకి తీసుకు రావాలనే ఉద్దేశంతో గోదావరిఖనిలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ సార్వజనిక ఆసుపత్రిలో నిర్వహణ అస్తవ్యస్తంగా కొనసాగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ కారణంగా మెరుగైన వైద్య సేవలు కొరవడుతుండగా అక్రమాలు యథేచ్ఛగా సాగుతున్నాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. నిరంతర పర్యవేక్షణతో ఆసుపత్రి నిర్వహణ, వైద్య సేవలను మెరుగు పరిచేలా చర్యలు తీసుకునేందుకు జిల్లా కలెక్టర్‌ను ఆసుపత్రి అభివృధ్ధి కమిటీ ఛైర్మన్‌గా ప్రభుత్వం నియమించి ఎనిమిదిన్నర నెలలు కావస్తున్నా నేటికీ పూర్తిస్థాయి కమిటీ నియామకం జరగలేదు. కమిటీని నియమిస్తే అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందనే భావనతో ఆస్పత్రి వర్గాలు కమిటీ లేకుండానే కాలయాపన చేస్తున్నట్లు వినికిడి. ప్రాంతీయ ఆసుపత్రి నుంచి సార్వజనిక ఆసుపత్రిగా స్థాయి పెరిగినా సేవలు మాత్రం గతంలోకంటే అధ్వానంగా ఉన్నాయనే ఆవేదనలు రోగుల నుంచి వ్యక్తమవుతున్నాయి.

* కారును అద్దెకు తీసుకోవాలంటే ముందుగా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఆమోదంతో ప్రకటన ఇచ్చి కొటేషన్లు ఆహ్వానించాలి. ఇవేం లేకుండానే కారు అద్దె పేరిట కారు లేకుండానే గత అక్టోబరు నుంచి బిల్లులు డ్రా చేయడం గమనార్హం.

* ఆసుపత్రిలో పారిశుద్ధ్య పర్యవేక్షకుడిగా పనిచేస్తున్న వ్యక్తికి సంబంధించిన కారును అద్దెకు నడిపిస్తుండగా సదరు పర్యవేక్షకుడే ఈ కారునకు డ్రైవరుగా పనిచేస్తూ రెండు వేతనాలు పొందుతుండడం గమనార్హం. తాజాగా వాహనం లేకుండానే మరో కారు పేరిట బిల్లులు స్వాహా చేశారనే ఆరోపణలున్నాయి.

* పారిశుద్ధ్య కార్మికుల నియామకాల్లో సదరు పర్యవేక్షకుడు అక్రమాలకు పాల్పడిన సంఘటన పోలీసు స్టేషన్‌ వరకూ వెళ్లినా చర్యలు శూన్యం. ఆసుపత్రి పర్యవేక్షకుడి సేవలు నామమాత్రమే కాగా సదరు పారిశుద్ధ్య పర్యవేక్షకుడే ఓ రకంగా ఆసుపత్రి పర్యవేక్షకుడిగా పెత్తనం చెలాయిస్తున్నాడని పలువురు ఆరోపిస్తున్నారు.

* సుమారు రూ.2.57 కోట్ల సింగరేణి నిధులతో దాదాపు మూడు నెలల క్రితం ఆసుపత్రిలో అత్యాధునిక సీటీ స్కానింగ్‌ యంత్రాన్ని ఏర్పాటు చేసినా నేటికీ ప్రారంభానికి నోచుకోవడం లేదు.

* కుక్కకాటు ఇంజక్షన్‌ కోసం ఆసుపత్రికి వెళ్తే తప్పనిసరిగా సిరంజీలు బయట కొనుక్కొని వెళ్లాల్సిందేనని పలువురు అంటున్నారు. బాధితులు సిరంజీలు తెచ్చుకుంటేనే ఆసుపత్రిలో కుక్క కాటు ఇంజక్షన్లు ఇస్తున్నారని చెబుతున్నారు.

* కొంతకాలం కేవలం పేపరు లేకపోవడంతో ఇసీజీ సేవలు నిలిచిపోగా మరి కొంత కాలం రక్తపోటును పరీక్షించే బీపీ ఆపరేటర్లు సైతం మూలన పడ్డాయి. రోగ నిర్ధారణలో కీలకమైన కొన్ని రకాల రక్తపరీక్షలు అత్యవసరమైతే తప్ప చేయడం లేదు.

* ఆసుపత్రికి చెందిన మూడు అంబులెన్సులు మూలనపడ్డాయి. రెండేమో మరమ్మతులకు నోచుకోక ఆసుపత్రి వెనకాల ఉండగా, ఒకదానికి మరమ్మతులు పూర్తయినా బిల్లులు చెల్లించకపోవడంతో షోరూమ్‌లోనే ఉంది. దీంతో అత్యవసరమైతే రోగులు తప్పనిసరిగా ప్రైవేటు అంబులెన్సులనే ఆశ్రయించాల్సి వస్తుంది.


సమస్యల పరిష్కారానికి కృషి

ప్రజలకు కార్పొరేట్‌ వైద్య సేవలను అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో ప్రభుత్వం రామగుండంలో వైద్య కళాశాల ఏర్పాటుతో పాటు ఆసుపత్రి స్థాయి పెంచింది. నిర్వహణ గాడితప్పడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆసుపత్రిలో నెలకొన్న అవకతవకలు, అక్రమాలపై తగిన ఆధారాలతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తున్నా. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు నిర్వహణ మెరుగుపరుస్తూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకుంటాం.

కోరుకంటి చందర్‌, ఎమ్మెల్యే, రామగుండం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని