logo

డబ్బులా.. బియ్యం కావాలా?

ప్రభుత్వం ఈ-పోస్‌ విధానాన్ని అమలు చేస్తున్నా రేషన్‌ బియ్యం దందా ఆగడం లేదు. కొందరు డీలర్లు రేషన్‌ బియ్యాన్ని వినియోగదారుల నుంచి కొనుగోలు చేసి వారే దళారులకు అమ్ముతున్నారు.

Published : 24 Mar 2023 04:14 IST

ఆగని అక్రమ వ్యాపారం
న్యూస్‌టుడే, తంగళ్లపల్లి

రేషన్‌ దుకాణంలో బియ్యం నిల్వలు

ప్రభుత్వం ఈ-పోస్‌ విధానాన్ని అమలు చేస్తున్నా రేషన్‌ బియ్యం దందా ఆగడం లేదు. కొందరు డీలర్లు రేషన్‌ బియ్యాన్ని వినియోగదారుల నుంచి కొనుగోలు చేసి వారే దళారులకు అమ్ముతున్నారు. ఎక్కువగా మధ్య తరగతి కుటుంబాల వారి నుంచి సేకరిస్తున్నారు. ప్రతి నెలా పంపిణీ తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్‌ షాపుల్లో బియ్యం ఇచ్చే సమయంలో తనిఖీలు చేపడితే ఈ విషయం బయటపడుతుంది. అయితే ఫిర్యాదు చేస్తేగానీ పౌర సరఫరాలు, రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

జిల్లాలో మొత్తం 344 రేషన్‌ దుకాణాలు ఉండగా, అందులో 1,74,050 ఆహార భద్రత కార్డులు ఉన్నాయి. వీటి ద్వారా 5,00,562 మంది లబ్ధి పొందుతున్నారు. జిల్లాలో ప్రతి నెలా 344 రేషన్‌ డిపోల ద్వారా 3,300 మెట్రిక్‌ టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నారు. కొందరు డీలర్లు డబ్బులకు ఆశపడి అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారు. బియ్యం అమ్ముకునేలా లబ్ధిదారులను ఒప్పిస్తున్నారు. వారితో వేలిముద్రలు వేయించుకుని కిలోకు రూ.9 నుంచి రూ.10 చొప్పున చెల్లిస్తున్నారు. ఇలా క్వింటాళ్ల కొద్దీ బియ్యాన్ని సేకరించి డీలర్లే అక్రమార్కులకు వాటిని కిలో రూ.15 నుంచి రూ.16 చొప్పున విక్రయిస్తున్నారు. అంటే డీలర్లు ఒక కిలోకు రూ.6 నుంచి రూ.7 వరకు పొందుతున్నారు.

మధ్య తరగతి కుటుంబాలే లక్ష్యం..

ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బియ్యం పేదలకు వరం. అదే వారి ఆకలి తీరుస్తోంది. దీంతో వారు బియ్యం అమ్ముకోరు. దీంతో మధ్య తరగతి కుటుంబాలనే డీలర్లు లక్ష్యంగా చేసుకుంటున్నారు. వారిని మచ్చిక చేసుకుని స్వయంగా రేషన్‌ దుకాణాల్లోనే కొనుగోలు చేస్తున్నారు. మరి కొన్ని చోట్ల చిరు వ్యాపారులు పట్టణాలు, గ్రామాల్లో ద్విచక్ర వాహనాలు, ఆటోల్లో తిరుగుతూ రేషన్‌ బియ్యం కొనుగోలు చేస్తున్నారు. ఇలా సేకరించిన బియ్యాన్ని కొందరు జిల్లా సరిహద్దు గ్రామాలకు డంపు చేసి అక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. కొందరు రైస్‌ మిల్లర్లు ప్రభుత్వం ఇచ్చిన ధాన్యం  మిల్లుల్లోనే ఉంచుకొని, రేషన్‌ బియ్యాన్ని కొనుగోలు చేసి రీసైక్లింగ్‌ చేసి భారత ఆహార సంస్థకు అంటగడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.


తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకుంటాం
- జితేందర్‌రెడ్డి, డీఎస్‌వో

రేషన్‌ డీలర్లు బియ్యం కొనుగోలు విషయం మా దృష్టికి రాలేదు. బియ్యం అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. డీటీలతో తనిఖీలు నిర్వహించి రికార్డుల్లో పంపిణీ చేసిన బియ్యం కంటే ఎక్కువగా నిల్వ ఉన్న డీలర్లపై చర్యలు తీసుకుంటాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని