logo

వడివడిగా పనులు.. మందకొడిగా చెల్లింపులు

ఉపాధి హామీ పథకంలో లక్షలాది రూపాయలతో చేపట్టిన సీసీరోడ్లు, పంచాయతీ భవనాలు, ఇతరత్రా అనేక రకాల అభివృద్ధి పనుల బిల్లులకు ఎదురుచూపులు తప్పడం లేదు.

Published : 24 Mar 2023 04:14 IST

ఉపాధి హామీలో బిల్లులకు తప్పని ఎదురుచూపులు
ఈనాడు డిజిటల్‌, సిరిసిల్ల

రుద్రంగిలో నిర్మాణం పూర్తయిన సీసీ రహదారి

ఉపాధి హామీ పథకంలో లక్షలాది రూపాయలతో చేపట్టిన సీసీరోడ్లు, పంచాయతీ భవనాలు, ఇతరత్రా అనేక రకాల అభివృద్ధి పనుల బిల్లులకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఇటీవల తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలో మంత్రి కేటీఆర్‌ పర్యటనలో ఒక రైతు అధికారుల సూచనలతో రూ.75 వేలతో కల్లం నిర్మాణం చేసుకున్నా ఏడాదిగా బిల్లులు రావడం లేదు. ఇప్పించాలని కోరారు. దానికి మంత్రి కేంద్రం నుంచి నిధులు రాలేదని సమాధానమిచ్చారు. ఇలా జిల్లాలో చాలా రకాల పనులు పూర్తయినా బిల్లులు రాని పరిస్థితి ఉంది. క్షేత్రస్థాయిలో పనుల లక్ష్యాలు నిర్దేశించిన అధికారులు అవి పూర్తయ్యాక బిల్లుల చెల్లింపుల్లో మాత్రం ఉలుకూ పలుకూ ఉండటం లేదు. ఉపాధి హామీ పథకంలో కేంద్రం చేసిన పలు మార్పుల వల్లే ఈ పరిస్థితి తలెత్తుతోంది.

జిల్లాలో ఉపాధి హామీ పథకంలో 60 శాతం నిధులు కూలీలకు, 40 శాతం మెటీరియల్‌ కాంపోనెంట్‌లో పనులు చేయాలి. మన దగ్గర నిబంధనలు పాటించకుండా కొంత కాలంగా కూలీలకు వెచ్చించే శాతానికి మించి నిధులు కేటాయిస్తున్నారు. ఉపాధి హామీ పథకంలో రాష్ట్ర ప్రభుత్వ పెత్తనానికి కేంద్రం అడ్డుకట్ట వేసింది. కేంద్రం ఆజమాయిషీలోనే పనులు జరిగే విధంగా నేషనల్‌ ఇన్‌ఫర్మేటివ్‌ సెంటర్‌ (ఎన్‌ఐసీ) సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తెచ్చింది. పనులు చేసిన కూలి డబ్బులను నేరుగా కార్మికుల ఖాతాల్లోనే జమ చేస్తోంది. తాజాగా మెటీరియల్‌ కాంపోనెంట్‌ కింద చేసే పనులకు ఇష్టారీతిన కేటాయిస్తున్నారని వీటికీ అడ్డుకట్ట వేసింది. గతంలో మెటీరియల్‌ కాంపోనెంట్‌ కింద జిల్లాకు కాకుండా రాష్ట్రం మొత్తం ఒకే యూనిట్‌గా పరిగణించేవారు. ఈ క్రమంలో ఒక జిల్లాకు మెటీరియల్‌ కాంపోనెంట్‌ కింద మంజూరయ్యే నిధులను మరో జిల్లాకు కేటాయించే వెసలుబాటు ఉండేది. ఈ నిబంధనల్లో మార్పులు చేసింది. ఏ జిల్లాకు వచ్చే నిధులు ఆ జిల్లాలోనే వెచ్చించేలా ఎన్‌ఐసీలో కట్టడి చేశారు. దీంతో పాత బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.


‘ఇవి కోనరావుపేట మండలం నిమ్మపల్లిలోని సామూహిక గొర్రెల షెడ్లు. రెండేళ్ల క్రితం 22 షెడ్లు మంజూరయ్యాయి. వాటిలో ఏడాది కిందట 14 షెడ్లు పూర్తయ్యాయి. పనుల ప్రారంభంలో ఒక్కో యూనిట్‌కు రూ.90 వేలుగా పేర్కొన్నారు. బిల్లుల కోసం వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేసే క్రమంలో రూ.50 వేలుగా చూపుతోంది. అయినా ఇప్పటికీ నిధులు మంజూరు కాలేదు.’’


చేపట్టింది ఇలా...

ఉపాధి హామీలో పనులంటేనే గుత్తేదారులు వెనకడుగు వేస్తున్నారు. కారణం పనులు పూర్తయ్యాక బిల్లుల కోసం నెలల తరబడి జాప్యం జరుగుతోంది. దీనికి నిదర్శనం జిల్లా వ్యాప్తంగా మన ఊరు- మన బడిలో ఉపాధి హామీలో నాలుగు రకాల పనులు చేయాలి. రూ.13.16 కోట్ల అంచనాతో 314 పనులను గుర్తించారు. అందులో 150 పనులు పూర్తయ్యాయి. వీటికి చెల్లింపులకు వచ్చే సరికి ఇప్పటికీ రూ.1.55 కోట్లు మాత్రమే జరిగాయి.

* రూ.6.13 కోట్లతో 255 కంపోస్టు షెడ్లు, రూ.7.01 కోట్లతో 73 వైకుంఠధామాలు నిర్మించారు. జిల్లా వ్యాప్తంగా 1,681 కల్లాలు మంజూరు కాగా వాటిల్లో 349 పూర్తి చేశారు. ఇప్పటి వరకు రూ.2.11 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి.

* రూ.27.54 కోట్లతో 151 పంచాయతీ భవనాలు మంజూరు కాగా వీటికి రూ.6.53 కోట్లతో 36 మాత్రమే పూర్తయ్యాయి. ఇటీవల మరో 80 భవనాలు మంజూరయ్యాయి. ఇటీవల రూ. 6.52 కోట్లతో 44 సీసీ రహదారులు మంజూరయ్యాయి. ఈ పనులు ఇంకా ప్రారంభం కాలేదు.

* 1,301 పశువుల పాకలు మంజూరు కాగా రూ.10.38 కోట్లతో 586 పూర్తి చేశారు. గొర్రెలు, మేకల పాకల నిర్మాణాలు 424 యూనిట్లకుగాను 21 పూర్తయ్యాయి. వీటికి రూ.7.23 కోట్లు కేటాయించారు. ఇలా జిల్లాకు మంజూరైన వివిధ పనులను ఎడాపెడా గుత్తేదారులకు అప్పగించారు. వీటిలో కొన్ని ప్రజాప్రతినిధులే చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా గతేడాది చేసిన పనులకుగాను రూ.10 కోట్లపైనే బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో ఈ ఏడాది అదనపు పనులు చేయకుండా వాటితోనే పూర్తి చేయనున్నారు.


తొమ్మిది నెలలవుతున్నా..
- పిడుగు లచ్చిరెడ్డి, గుత్తేదారు

రుద్రంగిలో రూ.10 లక్షలతో రెండు సీసీ రహదారులు నిర్మాణం చేశాను. జూన్‌లోనే పనులు పూర్తయ్యాయి. రికార్డులు సమర్పించి తొమ్మిది నెలలవుతున్నా బిల్లులు మంజూరు కావడం లేదు. చేసిన పనులకు సకాలంలో నిధులు మంజూరైతే ఇతర పనులు చేసేందుకు వెసలుబాటు ఉంటుంది.


జాప్యం లేకుండా చూస్తాం
- గౌతంరెడ్డి, డీఆర్‌డీవో

ఉపాధి హామీ పథకంలో పూర్తయిన పనులకు బిల్లుల మంజూరులో జాప్యం లేకుండా చూస్తున్నాం. పెండింగ్‌ బిల్లులు అన్నింటికీ అప్‌లోడ్‌ చేశాం. మంజూరు కాగానే ఆయా విభాగాల వారీగా నేరుగా చెల్లింపులు జరుగుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని