logo

పంటల్లో ప్రతికూలతలను అధిగమించాలి

ఉమ్మడి జిల్లాలో అకాలవర్షాలు, వడగళ్లు, ఈదురు గాలులతో పంటలకు నష్టం వాటిల్లుతోంది. వర్షాలతో వాతావరణ పరిస్థితులు మారి పైర్లలో చీడపీడల తీవ్రత పెరగనుండగా ప్రతికూలతను అధిగమించాలని జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనస్థానం సహపరిశోధన సంచాలకులు డాక్టర్‌ జి.శ్రీనివాస్‌ తెలిపారు.

Updated : 24 Mar 2023 05:58 IST

‘న్యూస్‌టుడే’ ముఖాముఖీలో  ఏడీఆర్‌ డాక్టర్‌ జి.శ్రీనివాస్‌
న్యూస్‌టుడే, జగిత్యాల వ్యవసాయం

ఉమ్మడి జిల్లాలో అకాలవర్షాలు, వడగళ్లు, ఈదురు గాలులతో పంటలకు నష్టం వాటిల్లుతోంది. వర్షాలతో వాతావరణ పరిస్థితులు మారి పైర్లలో చీడపీడల తీవ్రత పెరగనుండగా ప్రతికూలతను అధిగమించాలని జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనస్థానం సహపరిశోధన సంచాలకులు డాక్టర్‌ జి.శ్రీనివాస్‌ తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో చేపట్టాల్సిన యాజమాన్యాన్ని ‘న్యూస్‌టుడే’ ముఖాముఖి ద్వారా వివరించారు.

ప్రశ్న: ఈ యాసంగిలో ఉమ్మడి జిల్లాలో పంటలసాగు పెరిగిందా.?

సమాధానం: ఆయకట్టుకు కాలువనీరు రావటం, భూగర్భ జల లభ్యతతో ఈ సారి పైర్లసాగు అనుకున్నదానికన్నా అధికమైంది. కరీంనగర్‌, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో 6.34 లక్షల ఎకరాల యాసంగి సాగు అంచనాకాగా 10.35 లక్షల ఎకరాల వరకు అన్నిరకాల పంటలను సాగు చేస్తున్నారు. వరిసాగే 9 లక్షల ఎకరాలను దాటగా మొక్కజొన్న, పెసర, మినుము, ఆవాలు, జొన్న, వేరుసెనగ, పెసర, మినుము, సెనగ తదితర పంటలను రైతులు పండిస్తున్నారు.

ప్రశ్న: వరి, నువ్వు పంటల్లో ఎలాంటి చర్యలు చేపట్టాలి.?

సమాధానం: వరిపైరు చిరుపొట్ట నుంచి గొలకదశలో ఉన్నందున మొగిపురుగు నివారణకు కారటాఫ్‌ హైడ్రోక్లోరైడ్‌ 400 గ్రాములు లేదా క్లోరాంత్రనిలిప్రోల్‌ 60 మి.లీ మందును ఎకరాకు పిచికారీ చేయాలి. చల్లటి వాతావరణంలో తీవ్రమయ్యే అగ్గితెగులు నివారణకు ఎకరాకు 300 మి.లీ ఐసోప్రోథయోలిన్‌ మందును పిచికారీ చేయాలి. ఎదిగే దశలోని పైరుకు 19:19:19 (ఎన్‌పీకే) మిశ్రమాన్ని లీటరు నీటికి 5 గ్రాముల చొప్పున కలుపుకుని పైరుపై పిచికారీ చేయాలి. ఆకుమచ్చ నిరోధానికి కార్బండిజం 1 గ్రాము మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. కాండంకుళ్లు లేదా వేరుకుళ్లు నిరోధానికి కాపర్‌ఆక్సీక్లోరైడ్‌ 3 గ్రాములు లీటరు నీటికి కలిపి మొక్కల వేరువ్యవస్థ తడిసేలా పోయాలి.

ప్రశ్న: అకాల వర్షాలతో ఏ పంటలకు ఎక్కువగా నష్టం వాటిల్లింది.?

సమాధానం: గాలివాన, వడగళ్లతో కండే పాలుపోసుకునే దశలో మొక్కజొన్న కర్రలు విరగటం, నూర్పిడికి వచ్చిన వరి గొలకల్లోని గింజలు, మామిడి కాయలు రాలటం, నువ్వుపైరు పడిపోవటం, ఇతరత్రా కూరగాయలు తదితర పంటలకూ నష్టం వాటిల్లింది. వడగళ్ల వర్షసమయం కాబట్టి వర్షపునీరు అత్యంత చల్లగా ఉండటం, గాలిలో తేమశాతం పెరగటం, రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గటం, పగటి ఉష్ణోగ్రతలు పెరగటం తదితరాలతో పంటల్లో చీడపీడలు, పోషకలోపాల సమస్యలూ తలెత్తుతాయి.

ప్రశ్న: వర్షాల అనంతరం పంటల్లో తక్షణం  తీసుకోవాల్సిన చర్యలేమిటి.?

సమాధానం: టమాట, తీగజాతి కూరగాయలు, ఉల్లి, వంగ తదితర కూరగాయలు, ఇతర పంటల్లో భారీవర్షం కురిసిన ప్రాంతాల్లో పొలంలో నీరు నిల్వకుండా బయటకు పారించాలి, పంట త్వరగా కోలుకునేందుకు 19:19:19 5 గ్రాములు, సూక్ష్మపోషకాల మిశ్రమం 2.5 గ్రాములు లీటరు నీటికి కలిపి పైరుపై పిచికారీ చేయాలి. నేలద్వారా వ్యాపించే తెగుళ్ల నివారణకు 3 గ్రాముల కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌ను లేదా 2 గ్రాముల మెటలాక్సిన్‌ను లీటరు నీటికి కలిపి మొక్కల మొదళ్లవద్ద పోయాలి. ఇతర ఆరుతడి పంటల్లోనూ వర్షాలు తగ్గిన తరువాత పైపాటుగా ఎకరాకు 20 కిలోల యూరియా వేయాలి. నూర్పిడిచేసిన పంట ఉత్పత్తులు, ఆరబెట్టిన దినుసులు తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

ప్రశ్న: మామిడిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి.?

సమాధానం: మామిడిలో తామర పురుగు ఆశించే అవకాశం ఉన్నందున నివారణకు లీటరు నీటికి 2 మి.లీ ఫిప్రోనిల్‌ మందును కలిపి పిచికారీ చేయాలి. మచ్చలు ఆశించి నష్టపరిచే అవకాశమున్నందున నివారణకు 1 గ్రాము కార్బండిజంను లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. అన్ని పంటల్లోనూ వాతావరణం, నేలగుణం, పంట విత్తన రకాలు, యాజమాన్యం తదితరాలను బట్టి ఒకరైతు పొలానికి పక్కనేఉన్న మరోరైతు పొలానికి చాలాతేడా ఉంటుంది. కాబట్టి పంటలపై ఏవేని అసహజ లక్షణాలుంటే వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులు లేదా శాస్త్రవేత్తలకు పైర్ల నమూనాలు చూపించి నివారణ తెలుసుకుని పాటించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని