logo

పాలతో ఆర్థిక స్వావలంబన

ఆ గ్రామంలో పాడి రైతులు ఆర్థిక స్వావలంబన మార్గంలో పయనిస్తున్నారు. 210 మందితో ఏర్పాటు చేసుకున్న పాల సేకరణ కేంద్రం ద్వారా ప్రతిరోజు ఉదయం, సాయంత్రం కలిపి దాదాపు 840 లీటర్ల పాలను సేకరిస్తున్నారు.

Published : 24 Mar 2023 04:14 IST

లంబాడిపల్లెలో రోజుకు 840 లీటర్ల విక్రయం
న్యూస్‌టుడే, మల్యాల

కేంద్రంలో పాలు పోస్తున్న రైతులు

ఆ గ్రామంలో పాడి రైతులు ఆర్థిక స్వావలంబన మార్గంలో పయనిస్తున్నారు. 210 మందితో ఏర్పాటు చేసుకున్న పాల సేకరణ కేంద్రం ద్వారా ప్రతిరోజు ఉదయం, సాయంత్రం కలిపి దాదాపు 840 లీటర్ల పాలను సేకరిస్తున్నారు. కరీంనగర్‌ డెయిరీ కేంద్రానికి విక్రయిస్తూ ఏటా రూ.1.10 కోట్ల ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తూ జగిత్యాల జిల్లాలోనే ఆదర్శంగా నిలుస్తున్నారు. మల్యాల మండలం లంబాడిపల్లె గ్రామానికి చెందిన 110 మంది పాడి రైతులు నిత్యం ఉదయం 470 లీటర్లు, సాయంత్రం 370 లీటర్ల పాలను సొసైటీ ద్వారా సేకరిస్తుంటారు. దాదాపు 23 ఏళ్లుగా లంబాడిపల్లె గ్రామంలోని పాడి రైతులు పాల ఉత్పత్తి ద్వారా ఆర్థిక స్వావలంబన వైపు పురోగమిస్తూ తమ పిల్లలను చదివిస్తున్నారు. ప్రమాదవశాత్తు మృతి చెందితే రూ.లక్ష, సాధారణ మరణం సంభవిస్తే రూ.50 వేల చొప్పున ఇప్పటికీ 11 మందికి లబ్ధి చేకూర్చారు. తమ సంఘానికి వచ్చే లాభం నుంచి 60 శాతం బోనస్‌గా అందజేస్తూ పాడి రైతులను ప్రోత్సహిస్తున్నారు. సంఘానికి చేకూరిన లాభాలతో రెండున్నర గుంటల స్థలాన్ని రూ.6.50 లక్షలతో కొనుగోలు చేసి రెండు గదులతో భవనం నిర్మించుకున్నారు. ఏడాదిలో 225 రోజులు(రోజుకు లీటరు) పాలుపోసే పాడి రైతు కుటుంబాలకు చెందిన ఆడపిల్లల పెళ్లిళ్లకు డెయిరీ ఆధ్వర్యంలో రూ.12 వేల విలువైన పుస్తెమట్టెలు అందజేస్తారు. డెయిరీ అందజేసే పాలతోపాటు గ్రామంలో నిత్యం 100 లీటర్ల పాలను విక్రయిస్తారు. పాల ఉత్పత్తి, సరఫరాలో లంబాడిపల్లె జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిచింది.  


ప్రతి రోజు 5 లీటర్లు

మాకున్న ఒక గేదె రోజుకు 5 లీటర్ల పాలు ఇస్తుంది. వాటిని గ్రామంలోని పాల కేంద్రానికి తీసుకెళ్లి విక్రయిస్తాను. భర్త, కుమారుడు జీవనోపాధి కోసం దుబాయి వెళ్లారు. పాల విక్రయంతో కుమార్తెను చదివిస్తూ జీవనం సాగిస్తున్నాం. ఏటా మా గ్రామంలోని సొసైటీ ద్వారా బోనస్‌ రూపంలో లాభాలు కూడా అందజేస్తారు. సొసైటీ ఆధ్వర్యంలో బీమా సౌకర్యం కల్పించి అన్ని విధాలుగా ఆదుకుంటూ అండగా నిలుస్తున్నారు.

ఎల్లెంల ఎల్లవ్వ, లంబాడిపల్లె 


 ఆరు ఆవులు పెంచుతున్నా

నాకు మూడు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అందులో 20 గుంటల్లో పశుగ్రాసం పెంచుతూ మిగిలిన భూమిలో పొలం సాగు చేస్తున్నాను. 6 ఆవులు పెంచుతూ వాటి ద్వారా ప్రతి రోజు 25 లీటర్ల పాలను స్థానిక పాల కేంద్రంలో విక్రయిస్తున్నాను. వాటి విక్రయం ద్వారా ఏడాదికి రూ.4 లక్షల ఆదాయం వస్తుంది. పాల విక్రయం ద్వారా జీవనోపాధి మెరుగు పడింది.

మామిడి మల్లయ్య, లంబాడిపల్లె


జిల్లాలోనే ఆదర్శం

పాల సేకరణలో మా గ్రామం జిల్లాలోనే ప్రథమస్థానంలో నిలవడం గర్వకారణంగా ఉంది. పాలు విక్రయించే రైతులకు ప్రతి నెలా జగిత్యాల డెయిరీ కేంద్రం నుంచి వేతనాలు తీసుకొచ్చి పంపిణీ చేస్తుంటాను. పాడి రైతులకు రాయితీపై గడ్డి విత్తనాలు, గేదెలు, ఆవులకు బీమా సౌకర్యం కల్పించడంతో వల్ల మేలు జరుగుతోంది. సొసైటీలో 210 మంది సభ్యులున్నప్పటికీ ప్రస్తుతానికి 110 మంది కేంద్రానికి పాలు పోస్తున్నారు.

కొమ్మనవేని తిరుపతి, పాలకేంద్రం అధ్యక్షుడు, లంబాడిపల్లె

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని