logo

ఆస్తి పంపకాల్లో వివాదం

ఆస్తి పంపకాల విషయమై వివాదం చోటుచేసుకుని కోపోద్రిక్తుడైన తనయుడు కన్నతండ్రినే హత్య చేశాడు. కరీంనగర్‌ జిల్లా గన్నేరువరం మండలం జంగపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Published : 24 Mar 2023 04:14 IST

కన్నతండ్రిని హత్య చేసిన తనయుడు

శంకరయ్య

గన్నేరువరం, న్యూస్‌టుడే : ఆస్తి పంపకాల విషయమై వివాదం చోటుచేసుకుని కోపోద్రిక్తుడైన తనయుడు కన్నతండ్రినే హత్య చేశాడు. కరీంనగర్‌ జిల్లా గన్నేరువరం మండలం జంగపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. జంగపల్లికి చెందిన అటికం శంకరయ్య (64), విజయ దంపతులకు 18 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె సంతానం. చిన్న కుమారుడు వివాహమైన నెల రోజులకే మృతి చెందాడు. పెద్ద కుమారుడు రవీందర్‌, అతని భార్య సరిత పేరుపై శంకరయ్య ఇటీవల 9 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్‌ చేశాడు. మిగతా 10 ఎకరాల భూమి శంకరయ్య, ఆయన భార్య పేరుపై ఉంది. ఈ భూమి సోదరి స్వప్నకు ఇస్తాడేమోనని రవీందర్‌కు అనుమానం. ఈ విషయమై పలుమార్లు తండ్రితో వాగ్వాదానికి కూడా దిగాడు. శుక్రవారం సోదరి ఇంట్లో శుభకార్యం ఉండగా, తల్లిదండ్రులను ఆహ్వానించి తనను పిలవలేదని రవీందర్‌ కోపోద్రిక్తుడయ్యాడు. బుధవారం అర్ధరాత్రి మద్యం తాగి వచ్చి తండ్రితో ఆస్తి విషయమై వాదనకు దిగాడు. మాటమాట పెరగడంతో క్రికెట్‌ బ్యాట్‌తో శంకరయ్య తలపై కొట్టగా తీవ్ర రక్తస్రావమైంది. చుట్టుపక్కలవారు వెంటనే కరీంనగర్‌ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ కొద్దిసేపటికే ఆయన మృతి చెందాడు. సీˆఐ రమేశ్‌, ఎస్సై సురేందర్‌ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా రవీందర్‌ భార్య సరితను, ఇద్దరు కుమారులతో కలిపి పుట్టింటికి పంపించారు. అంత్యక్రియలు కుమారుడు చేయడానికి వీల్లేదని శంకరయ్య భార్య విజయ తానే ఆ కార్యక్రమం నిర్వహించింది. రవీందర్‌ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని