logo

లక్ష్యం దిశగా పల్లెలు

పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు అని మహాత్మాగాంధీ అన్నారు. అలాంటి గ్రామాల అభివృద్ధికి ప్రధాన ఆదాయ వనరు ఇంటి పన్నులు.

Published : 26 Mar 2023 05:05 IST

ప్రధాన ఆదాయ వనరులుగా ఇంటి పన్నులు

దుర్శేడు గ్రామ పంచాయతీ కార్యాలయం

న్యూస్‌టుడే, కరీంనగర్‌ కలెక్టరేట్‌: పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు అని మహాత్మాగాంధీ అన్నారు. అలాంటి గ్రామాల అభివృద్ధికి ప్రధాన ఆదాయ వనరు ఇంటి పన్నులు. వీటితోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు ఇస్తున్న ఆర్థిక సంఘం నిధులు, ఎస్‌ఎఫ్‌సీ నిధులు తోడుగా నిలుస్తున్నాయి. కానీ గత కొంతకాలంగా సకాలంలో ఆర్థిక సంఘం నిధులు అందకపోవడంతో ఇంటి పన్నులే ప్రస్తుత ఆదాయ వనరుగా మారాయి. వీటితో గ్రామంలో మెరుగైన వసతులు ఏర్పాటు చేస్తున్నారు.

జిల్లాలోని 313 గ్రామపంచాయతీలకుగాను రూ.7.82 కోట్ల పన్ను వసూలు లక్ష్యంగా నిర్దేశించారు. ఇప్పటి వరకు రూ.7.51 కోట్లు వసూలు చేసి 95 శాతం చేరుకొని లక్ష్యానికి చేరువలో ఉన్నారు. మిగిలిన వారం రోజుల్లో వంద శాతం పూర్తి చేస్తామనే దీమాతో ఆయా గ్రామాల కార్యదర్శులు ముందుకు సాగుతున్నారు. కార్యదర్శులను పురమాయించి పన్నులు వసూలు చేసేందుకు ఎంపీవోలు క్షేత్ర స్థాయిలో నిత్యం కృషి చేస్తున్నారు. ఆర్థిక సంఘం నిధులు సకాలంలో విడుదలకాక ప్రధాన ఆదాయ వనరైన పన్ను వసూళ్లపై అధికారులు ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు. ఆస్తి మార్పిడి, తదితర రాబడిని వంద శాతం చేయాలనే లక్ష్యంతో గతం నుంచే ముందుకు సాగుతున్నారు. రోజు వారీగా వసూలు చేసేందుకు కృషి చేస్తున్నారు.


కొత్తపల్లి, తిమ్మాపూర్‌ మండలాలు ముందంజ..

మరో వారం రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగుస్తుండగా జిల్లాలో పన్ను వసూళ్లలో కొత్తపల్లి, తిమ్మాపూర్‌, చిగురుమామిడి మండలాలు 99 శాతం పూర్తి చేశాయి. మిగతా మండలాలు అన్ని 90 శాతానికి పైగా అధిగమించాయి. కరీంనగర్‌ గ్రామీణ మండలం మూడేళ్లుగా పన్నుల వసూళ్లలో వంద శాతం లక్ష్యం చేరుకుంటుంది. ఈ మండలంలో 17 గ్రామ పంచాయతీలు ఉండగా అన్నింటిలో కార్యదర్శులు మొదటి నుంచే లక్ష్యం నిర్దేశించుకొని కృషి చేస్తున్నారు. దాంతో వంద శాతం లక్ష్యాన్ని చేరుకుంటుంది.


పని భారంలో కార్యదర్శులు

పంచాయతీ కార్యదర్శులు విధి నిర్వహణలో పని భారంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం ఏడు గంటలకే పారిశుద్ధ్యం, నీటి సరఫరా పర్యవేక్షిస్తున్నారు. వీటికితోడు పన్ను వసూళ్ల లక్ష్యానికి చేరుకోవడానికి గ్రామంలో కలియతిగుతూ గ్రామస్థుల నుంచి పన్ను వసూలుకు శాయశక్తుల కృషి చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో ప్రజాప్రతినిధులు పన్ను వసూళ్లలో సహకారం అందించడంలేదు. గ్రామంలో అన్ని తానై పనులు చక్కబెడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని