logo

ప్రశ్నిస్తే కక్ష సాధింపు : జీవన్‌రెడ్డి

ప్రశ్నించిన వారిపై కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని మాజీ మంత్రి, శాసనమండలి సభ్యుడు టి.జీవన్‌రెడ్డి అన్నారు.

Published : 26 Mar 2023 05:05 IST

రాస్తారోకో చేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

జగిత్యాల, న్యూస్‌టుడే: ప్రశ్నించిన వారిపై కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని మాజీ మంత్రి, శాసనమండలి సభ్యుడు టి.జీవన్‌రెడ్డి అన్నారు. రాహుల్‌గాంధీ పార్లమెంట్‌ సభ్యత్వాన్ని రద్దు చేయడాన్ని నిరసిస్తూ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. జంబిగద్దె నుంచి ర్యాలీగా వచ్చిన నాయకులు, కార్యకర్తలు తహసీల్‌ చౌరస్తాలో సుమారు గంటసేపు రాస్తారోకో నిర్వహించి ప్రధాని దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి మాట్లాడుతూ రాహుల్‌గాంధీ పార్లమెంట్‌ సభ్యత్వం రద్దు చేయడాన్ని దేశవ్యాప్తంగా నిరసిస్తున్నారని, ప్రశ్నించే వారి గొంతునొక్కుతూ ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇస్తున్నారన్నారు. దేశ ప్రజల ఆస్తులను ప్రధాని ఆప్తమిత్రుడైన అదానికి దోచిపెడుతూ అధికారం కోసం కులమతాల మధ్య చిచ్చుపెట్టి విద్వేశాలు రెచ్చగొడుతూ పబ్బం గడుపుతున్నారని విమర్శించారు. దేశంలోనే అత్యధిక మెజార్టీతో గెలుపొందిన రాహుల్‌గాంధీ పార్లమెంట్‌ సభ్యత్వాన్ని రద్దు చేయడం సిగ్గుచేటన్నారు. దేశ సమగ్రత కోసం ఇందిరా, రాజీవ్‌గాంధీ ప్రాణాలర్పిస్తే దేశ సమగ్రతను కాపాడేందుకు రాహుల్‌గాంధీ భారత్‌ జోడో యాత్ర చేపట్టడాన్ని భాజపా జీర్ణించుకోలేకపోతుందన్నారు. పీసీసీ సభ్యుడు, మాజీ పురపాలక ఛైర్మన్‌ గిరినాగభూషణం, జిల్లా మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు, మాజీ పురపాలక ఛైర్‌పర్సర్‌ టి.విజయలక్ష్మి, జిల్లా మైనార్టీ, ఎస్సీ విభాగం అధ్యక్షులు మన్సూర్‌, రమేష్‌బాబు, పీసీసీ ఆర్గనైజింగ్‌ కార్యదర్శి బండ శంకర్‌, ఎన్‌ఆర్‌ఐ సెల్‌ కన్వీనర్‌ చాంద్‌పాషా, పురపాలక ఫ్లోర్‌ లీడర్‌ దుర్గయ్య, పట్టణ అధ్యక్షుడు కొత్త మోహన్‌, మధు, బీరం రాజేష్‌, కచ్చు హరీశ్‌, శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని