logo

అగ్నిమాపక నిబంధనలు అమలుపర్చండి

వేసవిలో అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న దృష్ట్యా ప్రత్యేక బృందాల సహాయంతో రెండు వారాల్లోగా జిల్లాలోని అన్ని వాణిజ్య భవనాలు, విద్యా సంస్థలలో ఫైర్‌ సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అగ్నిమాపక శాఖ అధికారులను ఆదేశించారు.

Published : 26 Mar 2023 05:29 IST

మాట్లాడుతున్న కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

సిరిసిల్ల (విద్యానగర్‌), న్యూస్‌టుడే: వేసవిలో అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న దృష్ట్యా ప్రత్యేక బృందాల సహాయంతో రెండు వారాల్లోగా జిల్లాలోని అన్ని వాణిజ్య భవనాలు, విద్యా సంస్థలలో ఫైర్‌ సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అగ్నిమాపక శాఖ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ప్రత్యేక షెడ్యూల్‌ను వెంటనే సిద్ధం చేయాలని సూచించారు. కలెక్టరేట్లోని మినీ మీటింగ్‌ హాల్‌లో జిల్లాలో అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అగ్నిమాపక శాఖ, పోలీస్‌, రెవెన్యూ, పంచాయతీరాజ్‌, మున్సిపల్‌, వేములవాడ దేవస్థానం అధికారులతో కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. ఫైర్‌ సేఫ్టీ తనిఖీల కోసం ఏర్పాటు చేసిన బృందాలకు తనిఖీల సమయంలో పరిశీలించాల్సిన అంశాలు, చేయాల్సిన సూచనపై అగ్నిమాపక శాఖ అధికారులు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. రెండు వారాల్లోగా జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, గ్రామాల్లో వ్యాపార, వాణిజ్య భవనాలు, ఆసుపత్రులు, కలెక్టరేట్ సహా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పెట్రోల్‌ బంక్‌లు, ఆలయాలు, పాఠశాలలు, పౌర సరఫరాల సంస్థ గోడౌన్‌లు, ఎత్తైన అపార్ట్‌మెంట్లలో సేఫ్టీ ఆడిట్ నిర్వహించి హాట్ స్పాట్లను గుర్తించాలని కలెక్టర్‌ సూచించారు. ఫైర్‌ ఎగ్జిట్ల ముందు లాక్‌ కాకుండా చూడాలన్నారు. అత్యవసర ప్రవేశ మార్గాలలో డోర్లు ఏవైనా వస్తువులతో నింపి ఉంచినా, ఫైర్‌ సేఫ్టీ పరికరాలు లేకున్నా, కండిషన్‌లో లేకున్నా సంబంధిత యజమానులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలన్నారు. గోడౌన్‌లు నిర్వహించే వ్యాపారులు, అన్ని వ్యాపార భవనాల యజమానులు ఫైర్‌ సేఫ్టీ నిబంధనల పాటించాలని, లేనిచో కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలు, అగ్ని ప్రమాదం ఘటనల సమయంలో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా చూసేందుకు అనుసరించాల్సిన మార్గాలపై జిల్లాలోని ఇద్దరు ఎస్‌ఐలు, 10 మంది కానిస్టేబుళ్లకు హైదరాబాద్‌లో శిక్షణ కార్యక్రమాలు పూర్తయినట్లు చెప్పారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్‌ ఖీమ్యా నాయక్‌, ఫైర్‌ అధికారి వెంకన్న, జిల్లా పంచాయతీ అధికారి రవీందర్‌, ఆసుపత్రి పర్యవేక్షకుడు డా.మురళీధర్‌రావు, జిల్లా విద్యాధికారి రమేష్‌కుమార్‌, జిల్లా మార్కెటింగ్‌ అధికారి ప్రవీణ్‌, బీసీ, ఎస్పీ అభివృద్ధి అధికారి మోహన్‌రెడ్డి, జిల్లా పౌర సరఫరాల అధికారి జితేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని