logo

ప్రమాద ఘంటికలు

ఎగువ మానేరు కాల్వలపై వంతెనలు నిర్మించి ఏళ్లు గడుస్తోంది. వీటి రక్షణ గోడలు కొన్ని చోట్ల ధ్వంసమవగా.. మరికొన్ని చోట్ల పలుమార్లు రహదారి మరమ్మతులు చేపట్టిన కారణంగా రోడ్డుకు సమాంతరంగా మారి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి.

Published : 26 Mar 2023 05:29 IST

వంతెనలపై లేని రక్షణ గోడలు  

ఎగువ మానేరు కాల్వలపై వంతెనలు నిర్మించి ఏళ్లు గడుస్తోంది. వీటి రక్షణ గోడలు కొన్ని చోట్ల ధ్వంసమవగా.. మరికొన్ని చోట్ల పలుమార్లు రహదారి మరమ్మతులు చేపట్టిన కారణంగా రోడ్డుకు సమాంతరంగా మారి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. ఈ వంతెనల వద్ద కనీసం హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసిన దాఖలాలే కనిపించడం లేదు. గతంలో జరిగిన ప్రమాదాల దృష్ట్యా సంబంధిత అధికారులు దృష్టిసారించి ఆయా గ్రామాల్లో కాల్వలపై ఉన్న వంతెనల వద్ద అడ్డుగోడలు నిర్మించేలా చర్యలు చేపట్టాల్సి ఉంది.

 న్యూస్‌టుడే, ముస్తాబాద్‌


రోడ్డుకు సమాంతరంగా..

ముస్తాబాద్‌ గ్రామ శివారు పోత్గల్‌ వెళ్లే ప్రధాన రోడ్డు ఎగువ మానేరు కాల్వపై రక్షణ గోడలు లేక ప్రమాదకరంగా మారింది. మండల కేంద్రం నుంచి పోత్గల్‌, గన్నెవారిపల్లె, సేవాలాల్‌తండా మీదుగా జిల్లా కేంద్రానికి వాహనదారులు వస్తూపోతూ ఉంటారు. ఆర్టీసీ బస్సులు సైతం ఈ రోడ్డుగుండా నడుస్తుంటాయి. గతేడాది రాత్రి వేళ ఓ కారు అడ్డుగోడను ఢీకొట్టింది. రోడ్డుకు సమాంతరంగా రక్షణ గోడ ఉండడంతో దూరం నుంచి వచ్చే వాహనాలకు కనిపించకపోగా ప్రమాద హెచ్చరిక బోర్డు లేదు.


ఇరువైపులా పిచ్చిమొక్కలు

ముస్తాబాద్‌ మండల కేంద్రం నుంచి నామాపూర్‌ మీదుగా రాంరెడ్డిపల్లె, కొండాపూర్‌, ఎల్లారెడ్డిపేట మండలానికి నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. రాంరెడ్డిపల్లె శివారులో ఎగువ మానేరు కాల్వ వంతెన వద్ద వంతెనకు ఇరువైపులా ఇలా పిచ్చి మొక్కలు ఉండడంతో వాహనదారులకు వంతెన వద్ద అడ్డుగోడలు కనిపించడం లేదు.  


ఇరుకు వంతెనతో ఇబ్బందులు

ముస్తాబాద్‌ మండలం చిప్పలపల్లి నుంచి గోపాల్‌పల్లె మీదుగా కొండాపూర్‌ గ్రామానికి వెళ్లే రోడ్డులో ఎగువ మానేరు కాల్వ వంతెన ఇరుకుగా ఉంది. నిత్యం ఆర్టీసీ బస్సుతో పాటు వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. రక్షణ గోడలు రోడ్డుకు సమాంతరంగా మారి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. జిల్లా కేంద్రం నుంచి బస్సు ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లి మీదుగా కొండాపూర్‌ మీదుగా మండల కేంద్రానికి రాకపోకలు సాగిస్తున్న నేపథ్యంలో అడ్డుగోడలు నిర్మించాల్సి ఉంది.


కానరాని సూచికలు

ముస్తాబాద్‌ మండలం సేవాలాల్‌తండా గ్రామ పరిధిలోని రాగంవాడ ఉంది. రాగంవాడలో కాల్వకు ఓ వైపు 12 కుటుంబాలు నివాసముండగా మరోపక్క పదమూడు  కుటుంబాలు నివాసముంటున్నాయి. కాల్వపైన సీసీరోడ్డు వేశారు. ఇరువైపుల మాత్రం రక్షణ గోడలు నిర్మించక అలాగే వదిలేశారు. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకోస్తుందోనని స్థానికులు భయాందోళన చెందుతున్నారు.


అధికారులు చర్యలు చేపట్టాలి

ప్రధాన రోడ్ల వెంట ఎగువ మానేరు కాల్వల వద్ద కల్వర్టుల రక్షణ గోడలు రోడ్డుకు సమాంతరంగా మారాయి. ముస్తాబాద్‌ నుంచి పోత్గల్‌, చిప్పలపల్లి నుంచి కొండాపూర్‌ వెళ్లే రోడ్డులో, నామాపూర్‌ నుంచి రాంరెడ్డిపల్లె దారిలో, రాగంవాడలో.. ఇలా అనేక చోట్ల ఎగువ మానేరు కాల్వపై ప్రమాదకరంగా మారిన వంతెనలను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో సందర్శించాలి. త్వరితగతిన వంతెనలను విస్తరించడంతోపాటు రక్షణ గోడలు నిర్మించాలి.

తోట ధర్మేందర్‌, పోత్గల్‌


ప్రతిపాదనలు పంపాం

ఎగువ మానేరు కాల్వపై ప్రమాదకరంగా ఉన్న కల్వర్టులను గుర్తించాం. అడ్డుగోడలు నిర్మించేలా ప్రతిపాదనలను సిద్ధం చేసి పైఅధికారులకు నివేదించాం. నిధులు మంజూరై, పైఅధికారుల నుంచి ఆదేశాలు రాగానే కల్వర్టుల వద్ద అడ్డుగోడలు నిర్మిస్తాం.

వంశీకృష్ణ, నీటిపారుదల శాఖ ఏఈ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని